Begin typing your search above and press return to search.

ఆ టీడీపీ నేత బాబు ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడలేదట..

By:  Tupaki Desk   |   14 April 2018 4:41 PM GMT
ఆ టీడీపీ నేత బాబు ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడలేదట..
X
చంద్రబాబు అంటే టీడీపీకి అధినేత. ఎంత సీనియర్లయినా ఆయన మాట వినాల్సిందే, ఆయన వస్తున్నారంటే సిద్ధంగా ఉండాల్సిందే. కానీ.. టీడీపీకి చెందిన ఒక సీనియర్ లీడర్ మాత్రం చంద్రబాబు వస్తున్నారని తెలిసి.. అక్కడ నుంచి వెళ్లిపోవడమే కాకుండా ఆయన ఫోన్ చేసినా కూడా మాట్లాడబోనంటూ తన సహాయకులతో చెప్పించారట. ఇంతకీ.. చంద్రబాబు ముఖం కూడా చూడ్డానికి ఇష్టపడని ఆ నేత ఎవరు? ఆయన ఎందుకంత తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.. చంద్రబాబు ఆయనకు చేసిన నష్టమేంటి..?

చంద్రబాబు విషయంలో ఇలా వ్యవహరించిన నేత ఆనం రామనారాయణరెడ్డి అని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన ఆనం రాంనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు వివేకాలను కొంత కాలం కిందట చంద్రబాబు టీడీపీలోకి తీసుకొచ్చారు. అయితే... ఆ తరువాత వారిని పట్టించుకోకపోవడంతో చాలాకాలంగా ఆగ్రహంగా ఉన్నారు. ఇంతలో ఆనం వివేకా తీవ్ర అనారోగ్యంపాలవడంతో ఆయన్ను పరామర్శించేందుకు చంద్రబాబు గురువారం ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. కానీ.. రాంనారాయణరెడ్డి మాత్రం చంద్రబాబును రావొద్దని ఏకంగా చెప్పారట.

చంద్రబాబు పరామర్శకు రావడానికి ముందు ఇంటెలిజెన్స్ డీఎస్పీ ఆనం రామనారాయణరెడ్డికి సమాచారం ఇవ్వగా ఆయన రావాల్సిన పనిలేదంటూ రామనారాయణరెడ్డి చెప్పారని సమాచారం. అయితే అప్పటికే చంద్రబాబు బయలుదేరారని చెప్పడంతో… అప్పటి వరకు ఆస్పత్రిలోనే ఉన్న ఆనం కుటుంబ సభ్యులంతా చంద్రబాబు వచ్చిన సమయంలో బయటకు వెళ్లిపోయారట. దీంతో సీఎం సిబ్బంది రామనారాయణరెడ్డికి ఫోన్ చేయగా… మాట్లాడేదేమీ లేదని చెప్పేసి ఫోన్ పెట్టేశారట.

మరోవైపు ఆనం త్వరలో తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారని నెల్లూరు రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఆనం ఫ్యామిలీ టీడీపీని వీడడం ఖాయమైపోయిందని.. వారు ఏ పార్టీలో చేరుతారన్నది వేచి చూడాలని అంటున్నారు.