Begin typing your search above and press return to search.

ఆనం రాంనారాయణకు మంత్రి పదవి?

By:  Tupaki Desk   |   9 Dec 2015 7:19 AM GMT
ఆనం రాంనారాయణకు మంత్రి పదవి?
X
ఏపీలో మరో మూడునాలుగు నెలల్లో మంత్రివర్గ విస్తరణ ఖాయమని తెలుస్తోంది. అసమర్థులైన మంత్రులను తొలగించి సమర్థులను తీసుకురావడం ఒక్కటే కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చినవారికీ అవకాశాలు కల్పించే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. ఇతర పార్టీల కోటాలో ఆనం రామనారాయణరెడ్డికి మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నేతలు మరింత మంది టీడీపీలోకి వచ్చేందుకు ఇది అట్రాక్ట్ చేస్తుందన్న ఆలోచనతో చంద్రబాబు ఈ నిర్ణం తీసుకున్నారని చెప్తున్నారు.

మొన్నమొన్న పార్టీలో చేరినప్పటికీ ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రిగా అవకాశమిస్తే రెడ్డి వర్గం నేతల్లో ఆశలు కల్పించడానికి వీలవతుందని అనుకుంటున్నారు. అంతేకాదు... ప్రస్తుతం ఉన్న ఎంపీలు కేంద్రంతో సంప్రదింపుల్లో కానీ, పనులు సాధించడంలో కానీ ఆశించిన మేరకు పనిచేయలేకపోతున్నారన్న ఉద్దేశంతో చంద్రబాబు అక్కడ కూడా సమర్థుడైన నేతను పెట్టుకోవాలనుకుంటున్నారు. అందుకు ఏపీలో మంత్రిగా ఉన్న ఒక కీలక నేతను రాజ్యసభకు పంపించే యోచనలో ఉన్నారు. ఆయన స్థానంలో రామనారాయణరెడ్డికి మంత్రి పదవి దక్కొచ్చు. ఇక నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి కూడా మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్న తరుణంలో ఆనంకు కూడా ఇస్తే అక్కడ ఇప్పటికే ఉన్న మంత్రి నారాయణతో కలిపి ముగ్గురు అవుతారు. కాబట్టి దాన్ని నివారించడం కోసం నారాయణను మంత్రి వర్గం నుంచి తప్పించి సిఆర్ డిఏ ఛైర్మన్ గా పంపిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి పదవీకాలం ముగుస్తుండడంతో ఆయన స్తానంలో ఆనంను శాసనమండలికి పంపించి మంత్రిని చేయడానికి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇదంతా నిజమే అనిపిస్తున్నా.... ప్రచారాల్లో దిట్టలైన ఆనం సోదరుల గేమ్ కూడా కావచ్చని వినిపిస్తోంది. ఎందుకంటే టీడీపీలో చేరినా కూడా నెల్లూరులో ఆ పార్టీ క్యాడర్ తమపై మండిపడుతుండడంతో వారిని దారిలోకి తెచ్చేందుకు నెక్స్ట్ మేమే అని చెప్పేందుకు ఈ ప్రచారం చేస్తుండొచ్చన్న వాదనా ఉంది.