Begin typing your search above and press return to search.

ఆనం ఎంట్రీకి రంగం సిద్ధం..?

By:  Tupaki Desk   |   7 Aug 2018 12:01 PM GMT
ఆనం ఎంట్రీకి రంగం సిద్ధం..?
X
ఎక్క‌డైనా అధికార ప‌క్షంలోకి నేత‌లు వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. కానీ.. ఏపీలో మారుతున్న రాజ‌కీయం నేప‌థ్యంలో ఇందుకు భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ఎక్క‌డా లేని విధంగా అధికార‌పార్టీ నుంచి కోరి మ‌రీ విప‌క్షంలోకి వ‌స్తున్న సీనియ‌ర్ నేత తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. రానున్న రోజుల్లో ఏపీలో చోటు చేసుకునే రాజ‌కీయ మార్పుల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

వైఎస్ హ‌యాంలో మంత్రిగా వ్య‌వ‌హ‌రించి.. సీనియ‌ర్ నేత‌గా సుపరిచితుడైన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి టీడీపీలో చేర‌టం తెలిసిందే. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న ప‌చ్చ కండువా క‌ప్పుకొని సైకిల్ ఎక్కారు.

అయితే.. టీడీపీలో చేరిన ఆయ‌న అక్క‌డి వాతావ‌ర‌ణం.. ప‌రిస్థితులు ఏ మాత్రం న‌చ్చ‌క‌పోవ‌టం.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న విధానాల‌పై అసంతృప్తితో ఉన్న ఆయ‌న తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెఢీ అవుతున్నారు. ఆనం పార్టీ మారే విష‌యంపై గ‌డిచిన కొంత‌కాలంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తున్నా.. ఆయ‌న ఎంట్రీ ఎప్పుడన్న దానిపై క్లారిటీ లేదు.

తాజాగా ఈ అంశంపై స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం న‌డుస్తున్న ఆషాడమాసం ముగిసి.. శ్రావ‌ణంలోకి అడుగు పెట్టిన వెంట‌నే ఆయ‌న పార్టీలో చేరేందుకు రెఢీ అవుతున్న‌ట్లు చెబుతున్నారు. ఇటీవ‌ల వైఎస్ జ‌గ‌న్ తో ఆనం భేటీ కావ‌టం తెలిసిందే. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం జ‌గ‌న్ పాద‌యాత్ర విశాఖ‌ప‌ట్నానికి చేరుకున్న వెంట‌నే ఆయ‌న ఎంట్రీ ఉంటుంద‌ని చెబుతున్నారు.

అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే ఆగ‌స్టు 13న ఆయ‌న జ‌గ‌న్ పార్టీలో చేరే వీలుంద‌ని చెబుతున్నారు. విశాఖ‌లో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భా వేదిక‌పై జ‌గ‌న్ స‌మ‌క్షంలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి పార్టీలో చేర‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. ఆనం పార్టీ వీడ‌టంపై తెలుగు త‌మ్ముళ్లు ఒకింత ఇబ్బందికి గురి అవుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఎక్క‌డైనా విపక్షంలో నుంచి అధికార‌ప‌క్షంలోకి చేరుతారు. ఇందుకు భిన్నంగా అధికార‌ప‌క్షం నుంచి విప‌క్షంలో వ‌స్తున్న వైనం చూస్తే.. ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఎంత‌లా మారిందో ఇట్టే తెలుస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.