Begin typing your search above and press return to search.

ఆనంవారి మాటలకు అర్థాలు వేరులే..!

By:  Tupaki Desk   |   7 Dec 2019 9:34 AM GMT
ఆనంవారి మాటలకు అర్థాలు వేరులే..!
X
ఆ గట్టునేమో బుట్టేడు బ్రాంది ఉంది.. ఈ గట్టునేమో ముంతడు మజ్జిగుంది’’ అంటూ కొద్దికాలం కిందట వచ్చిన రంగస్థలం సినిమాలోని పాట పాపులర్ అయిన సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యమున్న ఆ చిత్రంలోని పాట తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత - మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరి అడవికి వెళ్లాలి. ఏ రకం మాఫియా కావాలన్నా నెల్లూరు నగరానికి వెళ్లాలి. అక్కడ కబ్జా రాయుళ్లు - లిక్కర్‌ మాఫియా - బెట్టింగ్‌ మాఫియా - ల్యాండ్‌ మాఫియా - ఇసుక మాఫియా.. ఇలా ఒక్కటేమిటి ఏ రకం మాఫియా కావాలన్నా ఉన్నాయి’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు... వేలాది కుటుంబాలు - లక్షలాది మంది ప్రజలు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల కుమిలిపోతున్నారని, మాఫియా ఆగడాలను అడ్డుకునే సమర్థుడైన పోలీసు అధికారి రావాలని... ప్రజలకు భయభ్రాంతుల నుంచి విముక్తి కలిగించాలని తాను కోరుకుంటున్నాని అన్నారు.

నెల్లూరు జిల్లా నుంచి మంత్రిగా ఉన్న నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ ఆనం ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. నెల్లూరు వైసీపీలో ముదరుతున్న విభేదాలకు ఇది సంకేతంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆనం ఆగ్రహానికి మూడు ప్రధాన కారణాలున్నాయని నెల్లూరు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.

1) నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని వేణుగోపాల స్వామి ఆలయం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆనం రామనారాయణ రెడ్డిలో అసహనానికి కారణమని జిల్లాలో అందరూ చెప్పుకుంటున్నారు. వేంకటగిరి సంస్థానాధీశుల ఆనవాయతీ ప్రకారం అయిదు కుటుంబాలు ఈ దేవస్థానం ట్రస్టీలుగా దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ ఆలయ ట్రస్టీల కమిటీని రద్దు చేసి - ప్రభుత్వం తరపున ఆలయ కమిటీని నియమించేందుకు రంగం సిద్దమవుతోంది. దాంతో ఆనం కుటుంబ పెద్దరికం ఆ ఆలయం మీద కనుమరుగవుతుంది. దీని వెనుక అనిల్ కుమార్ మంత్రాంగం వుందని ఆనం అనుమానిస్తున్నారు.

2) అల్తూరుపాడు రిజర్వాయర్ కూడా మరో ప్రధాన అంశంగా చెబుతున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణ వ్యయం 250 కోట్లు కాగా.. రివర్స్ టెండరింగ్ విధానంలో 4 శాతం అధికంగా కోట్ అయ్యిందన్న సాకుతో ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టెండర్‌ ను రద్దు చేయించారు. అధికార పార్టీలో వుండి కూడా ఈ టెండర్ కాపాడుకోలేకపోయానన్న అసంతృప్తి ఆనంలో పెరిగిపోయిందంటున్నారు.

3) వేంకటగిరి రాజావారు నెలకొల్పిన నెల్లూరులోని వి.ఆర్. విద్యాసంస్థలపై ఆనం ఫ్యామిలీ పట్టుండేది. ఇప్పుడవి జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలోకి మారాయి.

ఇవే కాకుండా మరిన్ని కారణాలు ఆనంకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయని.. మంత్రి అనిల్ - రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిలు ఆనం హవాను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. వైసీపీ పెద్దలు కూడా వారికే ప్రయారిటీ ఇస్తున్నారు కానీ సీనియర్ అయిన ఆనంను పట్టించుకోవడం లేదట. ఇవన్నీ కలిసే ఆనం ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.