Begin typing your search above and press return to search.

ఆనం కుటుంబానికి మ‌రో ప‌ద‌వి.. జ‌గ‌న్ ఆమోదం?

By:  Tupaki Desk   |   14 March 2020 6:30 PM GMT
ఆనం కుటుంబానికి మ‌రో ప‌ద‌వి.. జ‌గ‌న్ ఆమోదం?
X
ఆనం కుటుంబం.. రాజ‌కీయం గా గ‌త ద‌శాబ్ద కాలంలో అటూ ఇటూ తిరిగిన పొలిటిక‌ల్ ఫ్యామిలీ. వైఎస్ హ‌యాంలో ఆయ‌న‌కు స‌న్నిహితులుగానే పేరుండేది ఆనం సోద‌రుల‌కు. అయితే ఆయ‌న మ‌ర‌ణించాకా కాంగ్రెస్ హై కమాండ్ కు ద‌గ్గ‌ర‌య్యారు. ఒక ద‌శ‌లో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి సీఎం అయిపోతార‌నే ఊహాగానాలు కూడా వ‌చ్చేవి. అయితే కాంగ్రెస్ త‌ర‌ఫునే నిలిచి ఎన్నిక‌ల‌ను ఎదుర్కొని క‌నీసం ఎమ్మెల్యేగా నెగ్గ‌లేక‌పోయిన వారిలో ఆనం సోద‌రులు కూడా నిలిచారు.

కాంగ్రెస్ ఏపీ లో ప‌త‌నం అయ్యాకా.. ఆనం సోద‌రులు త‌లా ఒక దిక్కుకు వెళ్లారు. అప్ప‌టి వ‌ర‌కూ రాజ‌కీయంగా కీల‌క ప‌ద‌వుల్లో ఉండిన ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, ఆనం వివేకానంద‌రెడ్డిలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారి సోద‌రుడు ఒక‌రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయ‌నే ఆనం విజ‌య్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి ఆయ‌న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత వివేక‌, రామ‌నారాయ‌ణ‌రెడ్డిలు టీడీపీలోకి వెళ్లినా అటు వైపు ఆయ‌న వెళ్లలేదు.

ఇక తెలుగుదేశం పార్టీలో ఆనం ఫ్యామిలీ కొన‌సాగ‌లేక‌పోయింది. అనారోగ్యంతో వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణానంత‌రం రామ‌నారాయ‌ణ రెడ్డి చ‌ల్ల‌గా జ‌గ‌న్ పార్టీ వైపు వ‌చ్చారు. వ‌స్తూనే ఎమ్మెల్యే టికెట్ పొందారు. గెలిచారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా కామ్ గా కొన‌సాగుతున్నారాయ‌న‌. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌నే అసంతృప్తి ఉంద‌ట‌. అయితే జ‌గ‌న్ ఎందుకో.. ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డిని ప‌ట్టించుకోవ‌డం లేదు.

అయితే మొద‌టి నుంచి త‌న వెంట నిలిచిన ఆనం విజ‌య్ కుమార్ రెడ్డికి మాత్రం ఇప్పుడు ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌బోతున్నార‌ట‌. స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌య్ కుమార్ రెడ్డికి కీల‌క పద‌వి ద‌క్క‌బోతోంద‌ని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ఎలాగూ జ‌డ్పీ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే సొంతం చేసుకునే అవ‌కాశాలున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ పీఠం విష‌యంలో విజ‌య్ కుమార్ రెడ్డి జ‌గ‌న్ నుంచి హామీని పొందార‌ని స‌మాచారం.