Begin typing your search above and press return to search.

స‌న్నాసి నుంచి ఐదుకోట్లు తీసుకున్న ఎంపీ

By:  Tupaki Desk   |   16 Jan 2017 10:16 AM GMT
స‌న్నాసి నుంచి ఐదుకోట్లు తీసుకున్న ఎంపీ
X
కొంత గ్యాప్ త‌ర్వాత తెర‌మీద‌కు వ‌చ్చిన‌ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి మ‌రోమారు త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. ఈ ద‌ఫా ఏపీ విప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్‌పై కాకుండా ఆయ‌న పార్టీ నేతల‌పై వివేక‌ ఫైర్ అయ్యారు. 'గత ఎన్నికల్లో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరులో ఒక సన్నాసి దగ్గర రూ.5కోట్లు తీసుకున్నాడు. అది చాలదన్నట్లు ఎన్నికల ఖర్చు అంటూ మరికొంత వసూలు చేశాడు. తీసుకున్న డబ్బు ఇవ్వలేదు. ఇప్పుడా సన్నాసి నగరంపై పడి దండుకుంటున్నాడు. ఇక మేకపాటి కుమారుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి ఖాళీ దొరికితే పదిరోజులకోసారి సముద్రంలో క్రూజ్‌కు వెళ్లి ఒళ్లు తోమించుకుని వస్తుంటాడు. మేకపాటి చరిత్ర ఆ పార్టీలో సామాన్య కార్యకర్తను అడిగినా పుంఖానుపుంఖాలుగా చెబుతారు' అని ఆనం వివేక విరుచుకుప‌డ్డారు.

ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరుగుతోందని నెల్లూరుకు వచ్చి గగ్గోలు పెట్టడం ఏమిటని ఆనం వివేకానంద రెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభాలకు ఎగనామం పెట్టి నగరానికొచ్చి ప్రొటోకాల్‌ ఉల్లంఘన అంటూ గోలపెట్టడం ఏమిటని ఆయ‌న వ్యాఖ్యానించారు. జెడ్‌పీ చైర్మన్ పై సైతం వివేకా ధ్వజమెత్తారు. పగలు ఆయన వైసీపీ అని, రాత్రి పూట టీడీపీ నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారన్నారు. జెడ్‌పి నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ప్రొటోకాల్‌ పాటిస్తారని, ఏ కార్యక్రమంలోనైనా వారి పేర్లు వేయాలంటే కుదరదని వివేక అన్నారు. ధన మదంతో వైసీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలను చూసి తట్టుకోలేక వైసీపీని వీడుతున్నారన్నారు. అలాగే ఆత్మకూరులో రెండు మేకలు అరుస్తున్నాయని, వైసీపీ నేతలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైతే శిలాఫలకాలపై పేర్లు ఉన్నాయో లేదో తెలుస్తుందని ఆనం అన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘించారంటూ వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చేస్తున్నారని వివేకానందరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా నుంచి నాకు ఎలాంటి నోటీసులు అందలేదని ఆనం వివేకానందరెడ్డి తెలిపారు.