Begin typing your search above and press return to search.

మీడియాను ‘ఆనం’ ఎలా వాడుకున్నారంటే...

By:  Tupaki Desk   |   17 May 2016 11:03 AM GMT
మీడియాను ‘ఆనం’ ఎలా వాడుకున్నారంటే...
X
మీడియా కెమేరాలంటే ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నేతలే కాదు, చాలామంది భయపడతారు. తాము చేసే పొరపాట్లను ఏ మూల నుంచి చిత్రీకరించి జనంలోకి తీసుకెళ్తారో అని నిత్యం అప్రమత్తంగా ఉంటారు. కానీ... ఏపీలో మీడియాలో అలాంటి పవర్ ఫుల్ పొజిషన్ నుంచి నీచస్థితికి దిగజారిపోతోంది. తాజాగా జరిగిన ఓ ఘటన అందుకు ‘దర్పణం’ పడుతోంది. నెల్లూరుకు చెందిన టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి మీడియా కెమేరాను తన తల దువ్వుకోవడానికి ఉపయోగించుకోగా అందుకు సహకరించిన ఆ కెమేరామన్ మీడియా పరువునే తీశాడు.

వృద్ధాప్యం మీద పడుతున్నా సోకులు ఏమాత్రం తగ్గని ఆనం నిత్యం సినిమా హీరోలా మెంటైన్ చేస్తారన్న సంగతి తెలిసిందే. చిత్రవిచిత్రమైన పనులతో ప్రజలకు పరిచయమైన ఆయన తాజాగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే.. ప్రెస్ మీట్ అనగానే మీడియా కెమేరాలన్నీ తనపైనే ఫోకస్ చేస్తాయి కాబట్టి తన ముఖారవిందాన్ని ఒకసారి సరిచూసుకోవాలనుకున్నారు. అక్కడున్న ఓ మీడియా ఛానల్ కెమేరామన్ ను పిలిచి ఆయన వద్ద ఉన్న కెమేరాను అందుకువాడుకున్నారు. కెమెరా మానిట‌ర్‌ లో ముఖం చూసుకుంటూ తల దువ్వుకుని ఆ తరువాత ప్రెస్ మీట్ ప్రారంభించారు.

ఆనం చేసిన ఆ పని ఇప్పుడు మీడియా వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ముఖాలు చూసుకోవడానికి, తల దువ్వుకోవడానికి మా మీడియా కెమెరాలే దొరికాయా, మీడియా అంటే మరీ అంత చీప్ అయిపోయిందా అని అంటున్నారు. అదే సమయంలో ఆనంకు అలాంటి అవకాశమిచ్చిన కెమేరామన్ ను కూడా తప్పుపడుతున్నారు. చిన్నచిన్న ప్రలోభాలకు లొంగిపోయి - నేతలకు భయపడి - మొహమాటపడేవారు మీడియాలో ఎక్కువైపోయారని.. అలాంటివారి వల్ల ఇలా మీడియా పరువు పోతోందని ఘోషిస్తున్నారు. ఏదేమైనా సరే నిజాన్ని ప్రజలకు చూపించాల్సిన మీడియా కెమేరాను ఇలా తల దువ్వుకోవడానికి ఉపయోగించడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.