Begin typing your search above and press return to search.

జనం నమ్మాలంటే ఆ సీక్రెట్ చెప్పాలి!

By:  Tupaki Desk   |   12 Nov 2017 4:46 AM GMT
జనం నమ్మాలంటే ఆ సీక్రెట్ చెప్పాలి!
X
కేంద్రప్రభుత్వం జీఎస్టీ పన్నుభారాన్ని కొన్ని వస్తుసేవలపై కొంత మేరకు తగ్గించింది. ఇదివరకటితో పోలిస్తే.. ఇప్పుడు సామాన్యుడి మీద పడుతున్న భారం కొంత తక్కువే. జనం నడ్డివిరిచేలా ప్రభుత్వాలు ఎంత దారుణంగా వడ్డించినా.. పెద్దగా మాట్లాడవు. భారం తగ్గించేప్పుడు.. ఎంత పరిమితంగా ఆ పనిచేసినా.. విపరీతంగా ప్రచారం చేసుకుంటాయి. ఇప్పుడు కేంద్రం కూడా అదే పనిలో పడింది. భారీగా పెంచిన పన్నులను కొంత తగ్గించి.. అక్కడికేదో జాతికి తాము మేలు చేసేసినట్లుగా బిల్డప్ ఇస్తోంది. వారి సంగతి ఇలా ఉంటే రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.. తగ్గింపులు మొత్తం తమ చలవే అంటున్నారు.

పన్నుల తగ్గింపుగురించి - సామాన్యులు ఇబ్బంది పడుతున్నారనే సంగతి గురించి తాము గతంలో కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశాం అని.. జీఎస్టీ సమావేశాల్లో ప్రస్తావించాం అని - ఆ ఎఫెక్టే ఇప్పుడు తగ్గింపు అని ఆయన సెలవిస్తున్నారు. ‘ఛ - అవునా - నిజమా...’ అని జనం విస్తుపోతున్నారు.

యనమల మాటలు వింటే ‘సక్సెస్ హేస్ మెనీ ఫాదర్స్’ అనే ఇంగ్లిషు సామెత గుర్తుకొస్తోంది అని జనం నవ్వుకుంటున్నారు. యనమల మాదిరిగా దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు మా కృషి వల్లనే పన్నులు తగ్గాయ్ అంటూ.. కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారో తెలియదు.

నిజంగానే యనమల జీఎస్టీ పన్ను తగ్గింపుల గురించి కృషిచేసి ఉంటే తాము ఏ అంశాల గురించి కోరామో ప్రజలకు చెప్పాలి. ఆన తన మాటల్లో ఇంకా అనేక ఇతర అంశాలను కూడా జీఎస్టీ కౌన్సిల్ లో తాము లేవనెత్తాం అని, వాటిని కూడా కౌన్సిల్ పరిశీలిస్తోందని యనమల రామకృష్ణుడు చెప్పారు. ఆ మాటల్లో గనుక నిజాయితీ ఉంటే... ఇంకా తాము ప్రతిపాదించిన ఏయే అంశాలు కౌన్సిల్ వద్ద పెండింగ్ లో ఉన్నాయో యనమల చెప్పాలి. అందుకోసం తాము రాసిన లేఖలను కూడా చూపించాలి. అవి తగ్గితే మాత్రమే ఆయన కృషి ఉందని నమ్మగలం తప్ప.. ఏవి తగ్గితే వాటిని చూపించి మేమే తగ్గించాం అని టముకు వేసుకుంటే ఎలాగ అని జనం అనుకుంటున్నారు.