Begin typing your search above and press return to search.

చెప్పులు కుట్టే వాడి గాలిస్తున్న బ‌డా వ్యాపార‌వేత్త‌

By:  Tupaki Desk   |   18 April 2018 5:41 AM GMT
చెప్పులు కుట్టే వాడి గాలిస్తున్న బ‌డా వ్యాపార‌వేత్త‌
X
ఔను. నిజంగా చెప్పులు కుట్టే వ్య‌క్తి కోసం దేశంలోని టాప్ వ్యాపార‌వేత్త‌లో ఒక‌రైన మ‌హీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మ‌హీంద్రా గాలిస్తున్నారు. ఆయ‌న ఒక్క‌డే వెత‌క‌ట్లేదు. స‌ద‌రు చెప్పులు కుట్టే వ్య‌క్తి అడ్ర‌స్ తెలిస్తే కాస్త చెప్తారా అంటూ ప‌ది మందిని కోరుతున్నాడు కూడా! ఆశ్చ‌ర్య‌పోతున్నారు క‌దు? కానీ నిజంగా నిజం. గ‌తంలో సినీ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ త‌న ఒంటిచెత్తో సుమోను ఎత్తిన ఫోటోతో ట్విట్ట‌ర్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన మ‌హీంద్రా ఇప్పుడు తాజా ట్వీట్‌ తో మ‌రోమారు నెటిజ‌న్ల‌ను ఆకట్టుకున్నారు.

తెగిన చెప్పులు - చిరిగిన షూలు కుట్టుకునే ఓ చిరువ్యాపారి.. తనకున్న స్థోమతలో తన వ్యాపారాన్ని ప్రచారం చేస్తున్న తీరు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.వాట్సాప్‌ లో చక్కర్లు కొడుతూ హల్‌ చల్ చేస్తున్న ఈ వ్యాపారి వినూత్న ప్రకటన.. ఆనంద్ మహీంద్రా కంటబడగా - ఇప్పుడిది ఆనంద్ మ‌హీంద్రా వ‌ల్ల‌ వైరల్‌ గా మారింది. వైవిధ్యభరిత వ్యక్తులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే ఈ మహీంద్రా గ్రూప్ అధినేత.. సదరు వ్యాపారి ఆలోచనా శక్తికి ఫిదా అయిపోయారు. నా వాట్సాప్ వండర్‌ బాక్స్‌ కు వచ్చిన ఫొటో చూడండంటూ ట్విట్టర్‌ లో పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఈ స్టార్టప్‌ లో నేను పెట్టుబడులు పెడుతానంటూ ట్వీట్ చేశారు.

మహీంద్రా ఇంతగా మెచ్చిన ఆ ఫొటోలో ఏముందంటే ``గాయపడిన బూట్ల ఆస్పత్రి -డాక్టర్ నర్సీరామ్` అని ఓ ఫ్లెక్సీపై హిందీలో రాసుంది. ఇక్క‌డితోనే అయిపోలేదు. `ఓ.పీ.డీ: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు - భోజన విరామం: ఒంటి గంట నుంచి రెండు గంటలదాకా - తిరిగి 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆస్పత్రి తెరిచే ఉంటుంది` అని ఉంది. అంతేగాక `జర్మన్ టెక్నిక్‌ ను ఉపయోగించి షూలకు చికిత్స చేస్తాం` అని కూడా రాసుంది. ఈ చిత్ర‌మే ఆనంద్ మ‌హీంద్రాకు తెగ న‌చ్చేసింది. `షూ డాక్టర్ కాన్సెప్ట్ అద్భుతం. తన పరిధిలో తన వ్యాపారం గురించి ఎంతో చక్కగా ప్రచారం చేసుకుంటున్నారీయన. అసలు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో మార్కెటింగ్ పాఠాలు చెప్పాల్సిన వ్యక్తి. ఈయన గురించిగానీ, ఆ ఆస్పత్రి గురించిగానీ మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఇంకా ఆయన ఇదే పని చేస్తుంటే కొంత పెట్టుబడి పెడతాను` అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. మహీంద్రా ట్వీట్లకు కొద్దిసేపటికే 8,200లకుపైగా లైకులు రాగా, 1,900లకుపైగా ప్రతిస్పందన ట్వీట్లు వచ్చాయి. మొత్తానికి ఈ షూ డాక్టర్ ఎవరు? ఎక్కడివారు? అన్నది తెలియాల్సి ఉంది. ఎవడబ్బా సొత్తుకాదు టాలెంటు అన్నారో సినీ కవి. ఇది అక్షరాల నిజం. చేసే ప్రతి పనిలో ఎంతో వైవిధ్యం ఉన్నా.. సరైన అవకాశాలు రాక ఎందరో ప్రతిభావంతులు సాదాసీదా జీవితం గడిపేస్తున్నారు. అలాంటి ఓ వ్యక్తి ఆలోచనే ఇప్పుడు అందరి మన్ననల్ని పొందుతోంది.