Begin typing your search above and press return to search.

ఆ కుంభకోణంపై ఆనంద్‌ మహీంద్రా సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   21 Jan 2023 6:39 AM GMT
ఆ కుంభకోణంపై ఆనంద్‌ మహీంద్రా సంచలన వ్యాఖ్యలు!
X
నిత్యం సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే వ్యాపారవేత్తల్లో మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఒకరు. తన దృష్టికి వచ్చే వివిధ అంశాలను, వీడియోలను సోషల్‌ మీడియాలో ఆయన నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. పలు స్ఫూర్తిదాయకమైన వీడియోలను సైతం షేర్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో పలువురికి ఆర్థిక సాయం కూడా ఆనంద్‌ మహీంద్రా చేస్తుంటారు.

కాగా తాజాగా ఆనంద్‌ మహీంద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రామలింగరాజు ఏర్పాటు చేసిన సత్యం కంప్యూటర్స్‌ ఆకాశమంత స్థాయికి చేరి ఆ తర్వాత పాతాళానికి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన బోర్డు మహీంద్ర గ్రూప్‌ కు సత్యం కంప్యూటర్స్‌ ను అప్పగించిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో నాటి పరిణామాలను ఆనంద్‌ మహీంద్రా గుర్తు చేసుకున్నారు. తమ కంపెనీలో రూ.5,000 కోట్ల కుంభకోణం జరిగిందంటూ స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు సత్యం కంప్యూటర్స్‌ అధినేత రామలింగరాజు లేఖ రాయడం మొదలుకుని.. సత్యం కంప్యూటర్స్‌ను విలీనం చేసేందుకు, టెక్‌ మహీంద్రాను ప్రభుత్వ బోర్డు ఎంపిక చేసినంత వరకు జరిగిన ఆ వంద రోజులపై రాసిన పుస్తకావిష్కరణలో ఆనంద్‌ మహీంద్ర నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

రూ.5 వేల కోట్ల కుంభకోణం జరగడానికి ఏడాది ముందు సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ను విలీనం చేసుకునే ప్రతిపాదనతో ఆ కంపెనీ చైర్మన్‌ రామలింగ రాజును సంప్రదించానని ఆనంద్‌ మహీంద్రా తెలిపారు. అయితే తన ప్రతిపాదనకు రామలింగరాజు నుంచి స్పందన రాలేదని వివరించారు. ఆ కంపెనీ ఖాతాల్లో పొరబాట్లు ఆయనకు ముందే తెలుసు కాబట్టే ఆయన స్పందించలేదేమోనని ఆనంద్‌ మహీంద్రా తాజాగా వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌ లో ప్రఖ్యాత ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ను ఏర్పాటు చేయడంలో రామలింగరాజుదే కీలక పాత్ర అని ఆనంద్‌ మహీంద్రా తెలిపారు. అలా ఆయన తనకు బాగా తెలుసునన్నారు. ఆ చనువుతోనే టెక్‌ మహీంద్రా, సత్యం కంప్యూటర్స్‌ విలీన ఆఫర్‌తో రామలింగరాజును సంప్రదించానని వెల్లడించారు. అప్పటికి టెక్‌ మహీంద్రా ఆదాయం 1 బిలియన్‌ డాలర్లుగా ఉందన్నారు. సత్యంనూ కూడా కలుపుకుంటే టెక్‌ మహీంద్రా మరింత పెద్ద సంస్థగా మారుతుందన్న ఆలోచనతోనే ఆ విధంగా చేశానని పేర్కొన్నారు.

రామలింగరాజును విలీనం కోసం సంప్రదించిన ఏడాదికి సత్యంలో కుంభకోణం బయటపడిందని ఆనంద్‌ మహీంద్రా గుర్తు చేసుకున్నారు. సత్యం కంప్యూటర్స్‌ అమ్మకం సమయంలో.. కుంభకోణం అనంతరం ఉన్న సంక్లిష్టతలతో ఎల్‌ అండ్‌ టీ మినహా ఏ కంపెనీ కూడా తమకు పోటీ రాలేదన్నారు. చివరకు ఆ సంస్థ ఒక్కో షేరుకు రూ.45.90 ఆఫర్‌ చేసిందన్నారు. తాము ఒక్కో షేరుకు రూ.58తో బిడ్‌ వేసి దాన్ని సత్యంను తమలో కలుపుకున్నామని చెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.