Begin typing your search above and press return to search.

ఎవరీ గ్యాంగ్ స్టర్ ఆనంద్ మోహన్? ఇంతకు దిగజారాలా నితీశ్?

By:  Tupaki Desk   |   26 April 2023 8:00 AM GMT
ఎవరీ గ్యాంగ్ స్టర్ ఆనంద్ మోహన్? ఇంతకు దిగజారాలా నితీశ్?
X
అత్యుత్తమ స్థానాల్లో ఉండి.. గౌరవ మర్యాదలకు కొదవ లేని వేళలో.. దశాబ్దాల తరబడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల్ని.. గౌరవ మర్యాదల్ని పణంగా పెట్టేందుకు అస్సలు ఇష్టపడరు. కానీ.. బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి దారుణమైన విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి తెలిసిన వారు.. మరీ ఇంత నీతిమాలిన పని చేయటమా? అంటూ విస్మయానికి గురి అవుతున్నారు.

కాలం కలిసి వచ్చి.. అవకాశం ఉండాలే కానీ ప్రధానమంత్రి రేసులో ఉండే అతికొద్ది మంది ముఖ్యమంత్రుల్లో నితీశ్ కుమార్ ఒకరు. అలాంటి ఆయన.. తనకున్న గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తూ తీసుకున్న వివాదాస్సద నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఒక ఐఏఎస్ అధికారిని నడిరోడ్డు మీద కారులో నుంచి బయటకు లాగి దాడి చేసిన ఉదంతంలో ప్రాణాలు తీసిన ఒక గ్యాంగ్ స్టర్ విడుదల కోసం నిబంధనల్ని సవరించిన నితీశ్ సర్కారు తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇంతకీ ఆ గ్యాంగ్ స్టర్ ఎవరు? ప్రాణాలు కోల్పోయిన ఆ ఐఏఎస్ అధికారి ఎవరు? అంతటి దారుణ నేరానికి పాల్పడి యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న అతడ్ని విడుదల చేసేందుకు నితీశ్ సర్కారు చేసిన నీతిమాలిన పని ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

సుమారు ముప్ఫై ఏళ్ల క్రితం.. అంటే, 1994లో లాలూ ప్రసాద్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు బిహార్ పీపుల్స్ పార్టీ నేత ఛోటన్ శుక్లాను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దీంతో బిహార్ వ్యాప్తంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి. మరణించిన నేత ప్రాతినిధ్యం వహించే బీపీపీ వ్యవస్థాపకుడు ఆనంద్ మోహన్ పిలుపు ఇచ్చి మరీ వేలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి అంతిమ యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా 35 ఏళ్ల ఐఏఎస్ అధికారి జి. క్రిష్ణయ్యను కారులో నుంచి బయటకు లాగి రాళ్లతో దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో ఆ అధికారి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. క్రిష్ణయ్య ఎవరో కాదు.. ఉమ్మడి ఏపీలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన తెలుగు వ్యక్తి. ఆందోళనకారుల్ని రెచ్చగొట్టి అధికారి ప్రాణాలు పోయేందుకు కారణమైన ఆనంద్ మోహన్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ వ్యవహారంలో ఆయనకు ఉరిశిక్ష పడింది. జైల్లో ఉన్న సమయంలో ఎంపీగా పోటీ చేసి.. ఎన్నికల్లో విజయం సాధించారు. ఎంపీగా ఉన్న వేళలోనే అతనికి ఉరిశిక్ష విధించటంతో పదవిని కోల్పోయారు. ఎంపీగా వ్యవహరించిన ఒక రాజకీయ నేతకు ఉరిశిక్ష పడిన మొదటి ఉదంతం అదే. ఆ తర్వాత అతనికి పడిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. దీన్ని సుప్రీం సైతం సమర్థించింది. అలా.. రెండు దశాబ్దాలకు పైనే జైల్లో ఉంటున్నాడు.

ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 10న నితీశ్ సర్కారు బిహార్ జైలు మాన్యువల్ 2012కు సవరణలు చేసింది. కొత్త సవరణ ప్రకారం... విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల హత్య కేసుల క్లాజును సవరించింది. సవరణకు ముందు ఉన్న క్లాజ్ ప్రకారం.. ఆనంద్ మోహన్ విడుదలకు అవకాశం లేదు. నిబంధనను మార్చిన నేపథ్యంలో అతడి విడుదలకు మార్గం సుగమమైంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. విపక్షాలు సైతం పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఇలాంటి వేళ.. ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆనంద్ మోహన్ కొడుకు కమ్ ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం ఇటీవల జరిగింది. దీనికి పెరోల్ మీద బయటకు వచ్చారు ఆనంద్ మోహన్. ఈ ఎంగేజ్ మెంట్ కు ముఖ్యమంత్రి నితీశ్.. ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తో సహా పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. ఈ ఎంగేజ్ మెంట్ వేళలోనే ప్రభుత్వం నిబంధనలు మారుస్తూ జీవో జారీ చేయటం గమనార్హం. చూస్తుంటే.. ఆర్జేడీ ఎమ్మెల్యే పెళ్లికి నిబంధనలు మార్చేసి మరీ నితీశ్ గిఫ్టు ఇచ్చారా? అన్న భావన కలుగక మానదు.