Begin typing your search above and press return to search.

ఇప్పటికిప్పుడు దేశంలోఎన్నికలు జరిగితే..?

By:  Tupaki Desk   |   27 May 2016 6:59 AM GMT
ఇప్పటికిప్పుడు దేశంలోఎన్నికలు జరిగితే..?
X
పెరిగిన పోటీ నేపథ్యంలో ఎవరికి వారు తమదైన ప్రత్యేకతను ప్రదర్శించాలన్న తపన మీడియాలో పెరిగిపోయింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిన సందర్భంగా పలు మీడియా సంస్థలు పలు అంశాల మీద సర్వేలు నిర్వహించటం తెలిసిందే. మోడీ పరపతి ఎలా ఉంది? మోడీ పాలన ఎలా ఉంది? లాంటి అంశాల మీద చాలానే మీడియా సంస్థలు సర్వేలు చేపడితే.. ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ (ఆనంద్ బజార్ పత్రిక) మరో కోణంలో సర్వే నిర్వహించింది.

ఇప్పటికిప్పుడు దేశంలో లోక్ సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న అంశంపై అధ్యయనం చేపట్టింది. మోడీ రెండేళ్ల పాలన ముగిసిన నేపథ్యంలో చేపట్టిన ఈ సర్వే ఫలితాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. మోడీ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించారన్న విషయాన్ని స్పష్టం చేసింది. మోడీ పాలన చాలాబాగుందన్న అభిప్రాయాన్ని 49 శాతం మంది వ్యక్తం చేయగా.. మరో 32 శాతం మంది ఫర్వాలేదని చెప్పటం గమనార్హం.

ఇక.. ఇప్పటికిప్పుడు దేశ వ్యాప్తంగా ఎన్నికల్ని నిర్వహించిన పక్షంలో మొత్తం 543 లోక్ సభ స్థానాల్లో ఎన్డీయే కూటమి 342 స్థానాలు సొంతం చేసుకుంటుందని.. తిరుగులేని అధిక్యాన్ని ప్రదర్శిస్తుందని పేర్కొంది. మరోవైపు.. యూపీఏ పరిస్థితి అంతకంతకూ దిగజారుతున్న విషయాన్ని దానికి లభించే సీట్లతో చెప్పకనే చెప్పేసింది. యూపీఏకు 66 సీట్లకు మించి రావని.. వామపక్షాలు 14 స్థానాలు మాత్రమే లభిస్తాయని.. ఇతరులు 121 స్థానాల్ని గెలుచుకుంటారని పేర్కొంది.

దేశంలో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా ఎన్డీయే.. దేశ వ్యాప్తంగా అన్ని దిక్కుల్లోనూ సీట్లు సాధిస్తుందన్న విషయాన్ని సర్వేలో వెల్లడించింది. ఉత్తర భారతంలో 151 స్థానాల్లో 126.. తూర్పున 142 స్థానాలకు 62.. పశ్చిమాన 116స్థానాల్లో 104.. దక్షిణాదిన 134 స్థానాలకు 50 స్థానాల్లో బీజేపీ అండ్ కో గెలవటం ఖాయమని తేల్చింది. సో.. కనుచూపు మేరలో మోడీకి ఎదురులేదన్న మాట.