Begin typing your search above and press return to search.

ఈ దెబ్బతో ఆనందయ్య దుకాణం క్లోజ్?

By:  Tupaki Desk   |   13 Jan 2022 11:30 AM GMT
ఈ దెబ్బతో ఆనందయ్య దుకాణం క్లోజ్?
X
డబ్బులు తీసుకోడు. ఉచితంగానే మందు ఇస్తాడు. పరిమితులు పెట్టడు.అందుకే.. కరోనా టైంలో లక్షలాది రూపాయిలు కుమ్మేసే కార్పొరేట్ ఆసుపత్రులకు బదులుగా.. మూలికలతో ఇచ్చే ఆనందయ్య నాటు మందు ఫేమస్ అయ్యింది. అందులోని శాస్త్రీయత ఏమిటన్నది పక్కన పెడితే.. ఆ మందు వాడితే కరోనా రాదన్న నమ్మకం బలంగా పడిపోయింది. రోజుకు వేలాది మంది మందు కోసం చేరితే.. అక్కడ కేసులు పెద్దగా రాని పరిస్థితి. అన్నింటికి మించి ఆనందయ్య ఉండే ఊరిలో కరోనా కేసులు నమోదు కాలేదన్న మాటను మీడియా వార్తల రూపంలో ఇచ్చింది. ఆనందయ్య మందు కోసం చోటు చేసుకున్న డిమాండు.. కొందరు నేతలు ఆయన్ను బలవంతం పెట్టి మరీ మందు చేయించుకోవటం తెలిసిందే.

అయితే.. ఇదంతా గతం. అందుకు పూర్తి భిన్నమైన వర్తమానం తాజాగా చోటు చేసుకుంది. ప్రపంచంలోని మరెవరికీ సరిగా అర్థం కాని ఒమిక్రాన్ కు చెక్ పెట్టే మందు తాను తయారు చేస్తానంటూ ఆనందయ్య నోటి నుంచి వచ్చిన మాట చాలామంది నోట మాట రాకుండా చేసింది. సరిగా అవగాహన లేని జబ్బు గురించి.. ఏకంగా మందు ఎలా తయారు చేస్తారన్న ప్రాథమిక ప్రశ్న తలెత్తింది. గతంలో ఆయన్ను నెత్తిన పెట్టుకున్న వారు సైతం.. ఈసారి అందుకు భిన్నంగా రియాక్టు అవుతున్న పరిస్థితి.

తాజాగా ఆయన ఊరి వారు (నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం) సైతం ఆనందయ్యకు వ్యతిరేకంగా ఫిర్యాదు ఇవ్వటం.. ఆయుష్ విభాగం వారు నోటీసులు జారీ చేయటం.. ఆనందయ్య పరపతిని బాగా దెబ్బ తీసిందని చెప్పాలి.సెకండ్ వేవ్ లో ఆయనకు వచ్చిన పేరు ప్రఖ్యాతులన్ని.. ఒమిక్రాన్ కు మందు ఇస్తానన్న ఒక్క మాటతో మొత్తం పోయిన పరిస్థితి. ఒమిక్రాన్ లక్షణాలు ఏమిటన్నది వైద్యులకే తెలియని పరిస్థితి. అలాంటప్పుడు దాన్ని నయం చేసే మందును ఎలా ఇస్తారన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి.

అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు ప్రజల నుంచి కానీ.. స్థానిక నేతల నుంచి ఎలాంటి మద్దతు లేకపోవటంతో ఆనందయ్య ఒంటరి అయ్యారు. ఆయన మందు పంపిణీకి వ్యతిరేకంగా తొలుత గ్రామ పంచాయితీ తీర్మానం చేసింది. ఆ తర్వాత కలెక్టర్ నుంచి నోటీసులు వెళ్లాయి. అంతేకాదు.. ఒమిక్రాన్ కు మందు చేస్తుంటే.. దాని గురించి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో..ఆయన న్యాయపోరాటాన్ని షురూ చేశారు. కేసు కోర్టులో ఉన్న సమయంలోనే ఆయుష్ విభాగం వారు మరో నోటీసు ఇచ్చారు. ఆయుర్వేద మందుల్ని ఎవరు పడితే వారు తయారు చేయకూడదని.. పంపిణీ చేయకూడదని ఆయుష్ చెబుతోంది.

సెకండ్ వేవ్ సమయంలోనూ కోర్టు సూచనతో ఆనందయ్య మందును పరిశీలించి.. దాని పంపిణీకి ఎలాంటి అడ్డంకులు లేవని ఆయుష్ విభాగం వారు చెప్పిన తర్వాతే.. దాన్ని పంపిణీ చేయటం తెలిసిందే. తాజాగా ఒమిక్రాన్ కు మందు అన్నంతనే పలువురు అడ్డు చెప్పటం.. శాస్త్రీయత లేదన్న వాదన జోరందుకోవటంతో.. అటు ప్రజల్లోనూ.. ఇటు మీడియాలోనూ సంశయాలు చోటు చేసుకున్నాయి. అసలు ఒమిక్రాన్ లక్షణాల్ని గుర్తించే విషయంలోనే బోలెడన్ని సందేహాలు ఉన్న వేళ.. దానికి మందు ఎలా వస్తుందన్న దగ్గర విషయం ఆగింది. ఆనందయ్యకు చెక్ పడింది. సెకండ్ వేవ్ లో వచ్చిన ఇమేజ్ ను థర్డ్ వేవ్ వేళ ఒమిక్రాన్ పేరుతో ఆనందయ్య డ్యామేజ్ చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.