Begin typing your search above and press return to search.

రహస్యప్రాంతానికి ఆనందయ్య..!

By:  Tupaki Desk   |   29 May 2021 6:30 AM GMT
రహస్యప్రాంతానికి ఆనందయ్య..!
X
ఆనందయ్య .. ఆనందయ్య.. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్​ భారతదేశంలోనూ ఈ పేరు మారుమోగిపోతున్నది. అందుకు కారణం కరోనాకు ఆయన తయారుచేసిన మందు. అసలు ఆనందయ్య తయారుచేసింది మందే కాదు.. కేవలం హెర్బల్​ ప్రొడక్ట్​ అనే వాళ్లు కూడా ఉన్నారు. కాదు అది పసరుమందు అని వాదించేవాళ్లు ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం ఆనందయ్య తయారుచేసింది మందేనని నమ్ముతున్నారు. దానిని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే 70 వేల మందికి ఈ మందు వేశారని.. ఎవ్వరికీ ఎటువంటి హాని జరగలేదని ప్రచారం సాగుతోంది. లేదు ఈ మందు తీసుకొని కొంతమందికి అనారోగ్యం కలిగిందని హేతువాదులు వాదిస్తున్నారు.

మొత్తానికి ఆనందయ్య తయారుచేసిన మందుకు విపరీతమైన క్రేజ్​ వచ్చింది. అందుకు మీడియా, సోషల్​ మీడియా ప్రధాన కారణం. ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలోని ముత్తుకూరులో ఆనందయ్య మందును తయారుచేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడికి జనం పోటెత్తారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ మందు పంపిణీని నిలిపివేసింది.

ఆనందయ్య మందును ఏపీ ఆయుష్​ శాఖ పరిశీలిస్తున్నది. ఈ మందులో ఎటువంటి హానికారకాలు లేవని ఇప్పటికే ఆయుష్ శాఖ నివేదిక ఇచ్చింది. మరోవైపు కోర్టు సైతం ఈ విషయంపై సానుకూలంగా స్పందించింది. ఆనందయ్య మందుపై ప్రభుత్వం ఏదో ఒక విషయం తొందరగా తేల్చాలని ఆదేశించింది.ఇదిలా ఉంటే వారం రోజులుగా పోలీసుల పర్యవేక్షణలో నెల్లూరు, కృష్ణపట్నంలలో ఉన్న ఆనందయ్య శుక్రవారం స్వగ్రామం ముత్తుకూరుకు వచ్చారు. అయితే ఆయన గ్రామానికి వచ్చిన రెండు గంటల్లోనే మళ్లీ పోలీసులు ముత్తుకూరుకు వచ్చారు. మళ్లీ ఆయన్ను తరలించే ప్రయత్నం చేయగా ఆనందయ్య భార్య, బంధువులు అడ్డుకున్నారు.

ఆలోగా గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఆనందయ్య ఇంటి నుంచి బయటకు వచ్చి మాట్లాడారు. తన మందు పంపిణీకి ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని, కాబట్టి మందు పంపిణీ ఎప్పటినుంచి అనే విషయంపై ఏ నిర్ణయం తీసుకోలేదని ఆనందయ్య ప్రకటించారు. ముత్తుకూరులో మందు పంపిణీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు.

కాగా ఆనందయ్యను మళ్లీ పోలీసులు ముత్తుకూరు నుంచి తరలిస్తారన్న అనుమానంతో గ్రామస్తులు రాత్రి 9 గంటల వరకు ఆనందయ్య ఇంటివద్దే ఉండి పోయారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇవాళ తెల్లవారు జామున మళ్లీ గ్రామానికి చేరుకున్న పోలీసులు ఆనందయ్యను రహస్య ప్రాంతానికి తరలించారు.

ఆనందయ్య కృష్ణ పట్నంలో ఉంటే జనం అక్కడికి చేరుకొనే అవకాశం ఉండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.