Begin typing your search above and press return to search.
చంపేస్తామంటూ నటుడికి బెదిరింపులు..!
By: Tupaki Desk | 30 Dec 2016 11:49 AM GMTసుమారు 12 ఏళ్లుగా అన్నాడీఎంకే పార్టీలో ఉంటున్న ఆనంద్ రాజ్ తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశాడు! ఆ వ్యవహారం అక్కడితో అయిపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో... తాజాగా ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. తనను చంపేస్తామని కొంతమంది వ్యక్తులు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని చెబుతూ, చెన్నైలోని నుంగంబాకం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆనంద్ రాజ్. ఆ ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టడంతో పాటు ఆనంద్ రాజ్ ఇంటికి సెక్యూరిటీ కల్పించారు. ప్రస్తుతం ఆనంద్ రాజ్ రాజీనామా - అనంతరం బెదిరింపులు - పోలీసు సెక్యూరిటీ వంటి విషయాలతో ఈయన వ్యవహారం తమిళనాట హాట్ టాపిక్ అయ్యింది.
కాగా అన్నాడీఎంకెలో క్రమశిక్షణ ఉన్న నేతగా ఉన్న ఆనంద్ రాజ్ కు, జయలలితకు మంచి విధేయడిగా పేరుంది. ప్రస్తుతం అన్నాడీఎంకేలో నెలకొన్న పరిస్థితులు తనను కలిచి వేస్తున్నాయని, అమ్మను తప్ప మరొకరిని ముఖ్యమంత్రిగా ఊహించలేకపోతున్నానని ఆనంద్ రాజ్ ఇప్పటికే పేర్కొన్నారు. మంత్రుల నుంచి నేతల వరకు ఏ ఒక్కరూ జయలలితకు తగిన గౌరవం ఇవ్వడం లేదని విమర్శించిన ఆయన, గురువారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి తనను ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తన వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/