Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ అనంత్ బాబుకు మ‌ళ్లీ నిరాశ‌.. రెండోసారి బెయిల్ పిటిష‌న్ కొట్టివేత‌!

By:  Tupaki Desk   |   21 Jun 2022 5:31 AM GMT
ఎమ్మెల్సీ అనంత్ బాబుకు మ‌ళ్లీ నిరాశ‌.. రెండోసారి బెయిల్ పిటిష‌న్ కొట్టివేత‌!
X
దళిత యువకుడు, తన మాజీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనంత బాబుకు కోర్టు షాకిచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని అనంత్ బాబు దాఖలు చేసిన పిటిషన్ ను రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక కోర్టు రెండోసారి కూడా కొట్టేసింది.

తాజాగా జరిగిన విచారణలో ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి అనంత్ బాబు పిటిషన్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. బెయిల్ పొందడానికి సరైన కారణాలను చూపడంలో అనంత్ బాబు న్యాయవాది విఫలమయ్యారని.. అందుకే అతడి పిటిషన్ ను కొట్టేస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు. కేసులో విచారణ పూర్తి కాకపోవడం, అనంత్ బాబు బయటకొస్తే సాక్షులు ప్రభావితం చేసే అవకాశముందన్న బాధితుల తరఫు న్యాయవాది వాదనలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. బెయిల్ పిటిష‌న్ కొట్టేయ‌డంతో అనంత్ బాబు రిమాండ్ ను జూలై 1 వ‌ర‌కు పొడిగించారు.

ద‌ళిత యువ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో పోలీసులు మే 23 అనంత్ బాబును అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి ఆయ‌న రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సెంట్ర‌ల్ జైలులో ఉంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు రెండుసార్లు బెయిల్ కోసం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధ‌క న్యాయ‌స్థానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోగా .. రెండుసార్లు కోర్టు కొట్టేసింది.

మరోవైపు డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం భార్య‌కు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ప్ర‌భుత్వం ఉద్యోగం ఇచ్చింది. ఈ మేర‌కు కాకినాడ జిల్లా క‌లెక్ట‌రు్ కృతికా శుక్లా సుబ్ర‌హ్మ‌ణ్యం భార్య అప‌ర్ణ‌కు నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారు.

మరోవైపు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. అనంత్ బాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని కోరారు. అంతేకాకుండా అతడిపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్ కు విన్నవించారు.

ఈ మేరకు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, సోదరుడు, భార్యతోపాటు విశాఖపట్నం జిల్లా దళిత సంఘాలు ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలసి వినతిపత్రం అందించారు. అనంత్ బాబుకు బెయిల్ ఇచ్చి.. ఎమ్మెల్సీగా కొనసాగిస్తే తమ కుటుంబాన్ని మొత్తం అంతం చేస్తాడని బాధితులు గవర్నర్ వద్ద గోడు వెల్లబోసుకున్నట్టు సమాచారం.