Begin typing your search above and press return to search.

మేక్ ఇన్ ఇండియాలో కొత్త కోణం

By:  Tupaki Desk   |   2 Jun 2016 6:26 AM GMT
మేక్ ఇన్ ఇండియాలో కొత్త కోణం
X
ప్ర‌ధాని నరేంద్ర మోడీ మాన‌స పుత్రిక మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. మేక్ ఇన్ ఇండియా అంటే ప్రతిపక్షానికి వ్యతిరేకంగా వ్యూహాలు వండి వార్చడం అని ఆరోపించింది. ప్రతిపక్షంపై ఆధారరహిత విమర్శలు చేస్తూ సమస్యలపై నుంచి ప్రజల దృష్టి మరల్చడమని పేర్కొంది. ఆర్థిక రంగంలో కేంద్రం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కేంద్రం ప్రాధాన్యత ఇస్తున్నదని ఏఐసీసీ వెబ్ సైట్ లో కాంగ్రెస్ పోస్టు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసు నుంచి అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం - ఇష్రాత్ జహాన్ బూటకపు ఎన్ కౌంటర్ వరకూ ఆధారరహిత ఆరోపణలు చేయగలనని బీజేపీ రుజువు చేసుకుందని పేర్కొంది. ఒక వేళ ఆ ఆరోపణలలో వాస్తవం ఉంటే నిందితులను ప్రాసిక్యూట్ చేయలేనంత బలహీనంగా మోడీ సర్కార్ ఉందా అని ప్రశ్నించింది.

ఇదిల ఉండగా మోడీ ప్ర‌భుత్వం ఆలోచ‌న మ‌రో వివాదాన్ని రాజేసే పరిస్థితులు క‌నిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయబరేలి, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేధిల నుంచి ప్రాజెక్టులను తరలించాలని మోడీ సర్కార్ యోచిస్తున్నది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో గత యూపీఏ ప్రభుత్వం ఈ రెండు నియోజకవర్గాలలోనూ ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టులను మరో ప్రాంతానికి తరలించాలని యోచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర మంత్రి అనంత్ గీతి విలేకరులతో మాట్లాడుతూ రాయబరేలీలో ఒకటి - అమెథీలో మరొకరిని ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని పేర్కొంటూ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే గత యూపీఏ ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసిందన్నారు. అలా రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నేడు ఖాయిలా పడ్డాయన్నారు. అమేథీ - రాయబరేలిలలో ప్రతిపాదిత ప్రాజెక్టులు రెండింటినీ అనుకూలమైన ప్రాంతాలకు తరలించాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. మంచిప‌నులు చేస్తే కూడా ఓర్వ‌లేని ప్ర‌భుత్వం ఉండ‌టం వ‌ల్లే ఇలా ప‌థ‌కాల‌కు అడ్డుక‌ట్ట వేస్తోంద‌ని కాంగ్రెస్ ఫైర‌య్యింది.