Begin typing your search above and press return to search.

అనంత పిలుస్తోంది రా... బాబూ... ఇక్క‌డ పోటీ చేస్తే జిల్లా ఊడ్చేయొచ్చు!

By:  Tupaki Desk   |   9 Dec 2022 12:30 AM GMT
అనంత పిలుస్తోంది రా... బాబూ... ఇక్క‌డ పోటీ చేస్తే జిల్లా ఊడ్చేయొచ్చు!
X
కుప్పం కాదుకానీ రాబోయే ఎన్నికల్లో మా జిల్లా నుంచీ పోటీ చేయండి బాబుగారూ అంటూ అనంత‌పురం టీడీపీ త‌మ్ముళ్లు ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడ్ని కోరుతుండ‌టం ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారుతోంది. అనంత‌పురం జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. ఇక రాబోయే ఎన్నిక‌లు టీడీపీ చావోరేవో ఎన్నిక‌ల్లాంటివి. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచీ పోటీ చేయాల‌ని అనంత టీడీపీ త‌మ్ముళ్లు కోరుతున్నార‌ట‌. చంద్ర‌బాబు గ‌నుక అలా చేస్తే ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో వైసీపీకి ఒక్క‌సీటు కూడా రాకుండా ఊడ్చేయ‌వ‌చ్చ‌ని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు.

పార్టీ ఆవిర్భావం నుంచీ అనంత‌పురం జిల్లా టీడీపీ కంచుకోట‌. 2014 ఎన్నిక‌ల్లో ఆ జిల్లాలో ఆ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. అయితే 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ హవాలో ఆ పార్టీ కేవ‌లం ఉర‌వ‌కొండ‌, హిందూపురం స్థానాల‌ను మాత్ర‌మే గెల‌వ‌గ‌లిగింది. అనంత‌పురం జిల్లాలో తెలుగ‌దేశం పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది.

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో 14 శాస‌న‌స‌భ స్థానాలున్నాయి. ఈ జిల్లా నుంచీ గ‌నుక చంద్ర‌బాబు నాయుడు పోటీ చేస్తే ఆ ప్ర‌భావం ఉమ్మ‌డి జిల్లా మొత్తం ప‌డుతుంద‌ని తెలుగు త‌మ్మ‌ళ్లు భావిస్తున్నారు. బాబుగారు గనుక ఇక్క‌డ పోటీ చేస్తే జిల్లా మొత్తం ఊడ్చేయ‌వ‌చ్చ‌ని, వైసీపీ అడ్ర‌స్ గ‌ల్లంత‌య్యేలా ఫ‌లితాలుంటాయ‌ని అనంత తెలుగు త‌మ్ముళ్లు గంటా భ‌జాయించి చెబుతున్నారు. హిందూపురం ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో లేక‌పోతే ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో మ‌రే నియోజ‌క‌వ‌ర్గం నుంచైనా చంద్ర‌బాబు పోటీ చేయాల‌ని ఆయ‌న‌పైన ఈ జిల్లా టీడీపీ నేత‌లు గ‌ట్టి ఒత్తిడి తెస్తున్నారు. ఈ సారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌లు కేవ‌లం అటు తెలుగుదేశం పార్టీకే కాకుండా ఇటు అనంత‌పురం జిల్లా టీడీపీ నేత‌ల‌కు కూడా చావోరేవో లాంటివే.

అనంత తెలుగు త‌మ్ముళ్ల విజ్ఞ‌ప్తిని చంద్ర‌బాబు సుతిమెత్త‌గా తిర‌స్క‌రిస్తున్నార‌ట‌. చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచీ ఆయ‌న వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తున్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అక్క‌డ వైసీపీ పాగా వేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుప్పంలో చంద్ర‌బాబు ఓడిస్తామ‌ని వైసీపీ ఇప్ప‌టికే స‌వాల్ చేస్తోంది. ఇప్పుడు గ‌నుక కుప్పం నియోజ‌క‌వ‌ర్గం దాటి మ‌రో నియోజ‌క‌వ‌ర్గం నుంచీ తాను పోటీ చేస్తే పార్టీ శ్రేణులు ఢీలా ప‌డిపోతాయ‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు.

తాను నియోజ‌క‌వ‌ర్గం మారితే టీడీపీ, చంద్ర‌బాబు భ‌య‌ప‌డ్డార‌ని అధికార‌ప‌క్షం ప్ర‌చారం చేస్తుంద‌ని, దాని ప్ర‌భావం రాష్ట్ర‌మంత‌టా ప‌డుతుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. అందుకే త‌నంత‌పురం జిల్లా తెలుగు త‌మ్ముళ్లు తీసుకొస్తున్న ప్ర‌తిపాద‌న‌ను ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రిస్తూ, వారు చూపుతున్న అభిమానానికి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నార‌ట‌.

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి వేవ్ కనపడుతోందని, వైసీపీపై ఉన్న వ్యతిరేకతను అవకాశంగా మలచుకొని అన్ని నియోజకవర్గాలు గెలుచుకోవాలని పార్టీ భావిస్తోంది. జేసీ సోదరులు, పరిటాల కుటుంబం, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి లాంటి ఉద్ధండులతో జిల్లాలో బలంగా కనపడుతోంది. మరోవైపు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుపై, పరిటాల కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తర్వాత క్షమాపణలు చెప్పడం వంటివి వైసీపీకి మైనస్ గా మారాయని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.