Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్షాల‌ను జంతువుల‌తో పోల్చిన కేంద్ర మంత్రి!

By:  Tupaki Desk   |   29 Jun 2018 9:08 AM GMT
ప్ర‌తిప‌క్షాల‌ను జంతువుల‌తో పోల్చిన కేంద్ర మంత్రి!
X
త‌మ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిల‌వ‌డం బీజేపీ నేత‌ల‌కు కొత్త‌మీ కాదు. త్రిపుర సీఎం బిప్ల‌వ్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌ల‌తో మొదలుపెడితే....ఆ జాబితా చాంతాడంత ఉంటుంది. సాక్ష్యాత్తూ ప్ర‌ధాని కార్యాల‌యం నుంచి ఆ వ్యాఖ్య‌లు చేసిన నేత‌ల‌కు అక్షింత‌లు ప‌డ్డ‌ప్ప‌టికీ వారి తీరు మార‌డం లేదు. పైగా, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ మ‌రింత మంది బీజేపీ నేత‌లు త‌మ నోటిదురుసుతో పార్టీకి చెడ్డ‌పేరు తెస్తున్నారు. ఇటు సొంత‌పార్టీ నేత‌లే త‌మ పాలిట విల‌న్లు కావ‌డంతో ఏం చేయాలో తెలియ‌క బీజేపీ అధిష్టానం త‌ల‌లు ప‌ట్టుకుంటోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో బీజేపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రతిపక్షాలనుద్దేశించి కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తిప‌క్షాల‌ను జంతువులతో పోలుస్తూ హెగ్డే చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారం రేపుతున్నాయి.

అధికారం ప‌క్షంపై ప్ర‌తిపక్షాలు విమ‌ర్శ‌లు గుప్పించ‌డం...వాటికి అధికార ప‌క్షం కౌంట‌ర్ ఇవ్వ‌డం మామూలే. అయితే, ఈ మ‌ధ్య ప్ర‌తిప‌క్షాల‌పై ఒక ర‌క‌మైన ద్వేష భావాన్ని పెంచుకున్న పాల‌క‌ప‌క్ష నేత‌లు అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తాజాగా, ప్ర‌తిప‌క్షాల‌పై హెగ్డే కూడా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ప్రతిపక్షాలు జంతువులని, పులికి వ్యతిరేకంగా అవి ఎదురు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. కాకులు - కోతులు - నక్కలు - ఇతర జంతువులన్నీ కలసి ఒక్కటిగా వస్తున్నాయ‌ని, మరోవైపు పులి (మోదీ) ఉన్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2019లో పులినే ఎన్నుకోవాల‌ని ఓ స‌భ‌లో ప్ర‌సంగించిన హెగ్డే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ దేశాన్ని 70 ఏళ్లపాటు బీజేపీ ప‌రిపాలించి ఉంటే .....ప్లాస్టిక్ కుర్చీలకు బదులు వెండి కుర్చీల్లో కూర్చుని ఉండేవారని అన్నారు. అయితే, హెగ్డే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఇది మొద‌టి సారి కాదు. ఈ ఏడాది జనవరిలో దళితులను శునకాలతో పోల్చిన హెగ్డే వ్యాఖ్య‌లు పెను దుమారం రేపాయి. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, శివమొగ్గ ప్రాంత ప్రజలే అచ్చమైన కన్నడ మాట్లాడగలరని మిగ‌తావారికి కన్న‌డ స్ప‌ష్టంగా రాద‌ని ఎద్దేవా చేయ‌డం సంచ‌ల‌నం రేపింది.