Begin typing your search above and press return to search.

ప్ర‌దీప్ కోర్టుకు మాత్రం రాలేదు!

By:  Tupaki Desk   |   11 Jan 2018 8:25 AM GMT
ప్ర‌దీప్ కోర్టుకు మాత్రం రాలేదు!
X
డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయిన ప్ర‌ముఖ యాంక‌ర్ ప్ర‌దీప్‌.. మొన్నామ‌ధ్య పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజ‌రు కావ‌టం తెలిసిందే. తాగి వాహ‌నం న‌డిపితే వ‌చ్చే న‌ష్టాల మీద ట్రాఫిక్ పోలీసులు నిర్వ‌హిస్తున్న కౌన్సెలింగ్ అద్భుతంగా ఉంద‌ని.. చాలా విష‌యాలు తెలిశాయంటూ మీడియాతో చెప్పారు. తాను త‌ప్పు చేశాన‌ని.. మ‌ళ్లీ అలాంటి త‌ప్పు చేయ‌న‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

సాధార‌ణంగా పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజ‌రైన త‌ర్వాత.. ఆ వెంట‌నే కోర్టు ఎదుట హాజ‌ర‌వుతారు. కానీ.. ప్ర‌దీప్ మాత్రం ఆ ప‌ని చేయ‌లేదు. కౌన్సెలింగ్ పూర్తి అయిన నేప‌థ్యంలో బుధ‌వారం కోర్టు ఎదుట హాజ‌ర‌వుతార‌ని పోలీసులు భావించారు. కానీ.. త‌దుప‌రి చ‌ర్య‌ల నిమిత్తం కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉంటుంది. కానీ.. ప్ర‌దీప్ హాజ‌రు కాక‌పోవ‌టంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డిన స‌మ‌యంలో నిర్వ‌హించిన బ్రీత్ ఎన‌లైజ‌ర్ టెస్ట్ లో 178 పాయింట్లు రావటం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ అమ‌లైన శిక్ష‌ల ప్ర‌కారం చూస్తే 150 పాయింట్లు దాటితే జైలుశిక్ష‌కు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఒక‌వేళ న్యాయ‌మూర్తి విచ‌క్ష‌ణాధికారంతో జ‌రిమానా విధించే వీలుంది. ఒక‌వేళ జైలుశిక్ష విధిస్తే 15 రోజుల వ‌ర‌కూ జైలు త‌ప్ప‌ద‌న్న మాట వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అన్నింటికి సిద్ధ‌మ‌య్యాకే కోర్టుకు హాజ‌రు కావాలన్న ఉద్దేశంతో కోర్టుకు హాజ‌రు కాలేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

షూటింగ్ బిజీలో ఉన్న నేప‌థ్యంలో.. ఒక‌వేళ న్యాయ‌మూర్తి జైలుశిక్ష విధిస్తే.. ఆ వెంట‌నే కారాగారానికి త‌ర‌లిస్తారు. అదే జ‌రిగితే.. ముంద‌స్తుగా ఓకే చేసుకున్న షూటింగ్ ల‌కు అంత‌రాయం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. అందుకే.. కోర్టుకు హాజ‌రు కాలేద‌ని.. చ‌ట్టప్ర‌కారం కోర్టుకు హాజ‌ర‌య్యేందుకు కాస్త ఆల‌స్య‌మ‌య్యేలా ఉన్న అవ‌కాశాల్ని వినియోగించుకుంటున్నార‌న్న మాట వినిపిస్తోంది. ఇందుకు త‌గ్గ‌ట్లే బుధ‌వారం రాత్రి ప్ర‌దీప్ తండ్రి పోలీసుల‌ను సంప్ర‌దించి.. షూటింగ్ హ‌డావుడి ఎక్కువ‌గా ఉండ‌టంతో ప్ర‌దీప్ కోర్టుకు హాజ‌రు కాలేద‌న్న విష‌యాన్ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఒక‌ట్రెండు రోజుల్లో కోర్టు ఎదుట హాజ‌ర‌వుతార‌ని చెబుతున్నా.. సంక్రాంతి పండ‌గ త‌ర్వాతే కోర్టు ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.