Begin typing your search above and press return to search.

ఖాజాగూడలో పురాతన రాళ్లు... కాపాడాలంటున్న సాఫ్ట్ వేర్లు..

By:  Tupaki Desk   |   13 March 2022 9:30 AM GMT
ఖాజాగూడలో పురాతన రాళ్లు... కాపాడాలంటున్న సాఫ్ట్ వేర్లు..
X
మన హైదరాబాద్ కు హైటెక్ సిటీగా మాత్రమే కాకుండా... కల్చరల్ సిటీగా కూడా పేరుంది. గొప్ప సంస్కృతి సంప్రాదాయాలకు నెలవుగా ఉండేది. నిజాం రాజుల దర్పం కళ్లకు కట్టినట్టు చూపించే ఎన్నో పురాతనమైనవి ఈ గ్లోబల్ సిటీలో మనకు దర్శనం ఇస్తాయి. ఒకప్పుడు హైదరాబాద్ కేవలం కొండలు, గుట్టలుగా మాత్రమే ఉండేది.

ఒక్క ఓల్డ్ సిటీ తప్పక మిగతా ప్రాంతాలు అన్నీ అడవుల్లో భాగంగా ఉండేవి. భాగ్యనగరం చాలా మార్పులు చెందింది. దీనిలో భాగంగానే అప్పుడు అడవులగా ఉన్న ప్రాంతాలు, రాళ్లు ఉన్న ప్రాంతాలను ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ అనే పేర్లతో పిలుస్తున్నారు. ఇదిలా ఉంటే వీటితో పాటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చూడగానే ఆకట్టుకునే పురాతన బండ రాళ్లు చాలానే ఉన్నాయి.

అయితే ప్రస్తుతం ఈ రాళ్లను కాపాడాలని కొందరు వ్యక్తులు, ఓ ఎన్జీఓ ప్రయత్నిస్తోంది. రాళ్లు మన జీవితంలో భాగమని వారు చెప్తున్నారు. వాటిని తొలగించడం లాంటివి చేస్తే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే అని అంటున్నారు. అసలు ఈ రాళ్లకు వారికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా... ఉంది.

హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో రాళ్లకు చాలా గొప్ప చరిత్ర ఉంటుంది. అందుకే వాటిని రక్షించుకుందాం అని అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉంటే కొన్ని ప్రాంతాల్లో ఉండే చాలా పెద్ద బండరాళ్లకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా వాటిని పర్యటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు.

అయితే అలాంటి రాళ్ల జాబితాలో ఖాజాగూడా రాక్స్ కూడా ఉన్నాయి. నగరంలో ఉండే ఖాజాగూడ రాక్స్‌ కు చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడకు చాలా మంది సేద తీరేందుకు వస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది సాప్ట్ వేర్ ఇంజనీర్లు వీకెండ్స్ లో కొంత సమయం పాటు ఇక్కడ గడుపుతుంటారు. మరి కొందరు అయితే ట్రెక్కింగ్ కూడా వస్తుంటారు.

వారాంతాల్లో ఈ ప్రాంతం చాలా సందడిగా ఉంటుంది. దీని ముఖ్య కారణం ఏమిటంటే.. ఆ బండరాళ్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఓ పెద్ద బండను కేవలం కొన్ని చిన్న బండలు అడ్డుకుని ఉంటాయి. దీంతో అవి అక్కడ నుంచి కదలకుండా ఏళ్ల తరబడి అలానే ఉంటున్నాయి. చూసేందుకు ఇవి చాలా వింతలా ఉంటుంది.

అందుకే చాలా మంది వచ్చిపోతుంటారు. అయితే ప్రకృతి సిద్దంగా ఏర్పడిన ఈ ఖాజా గూడా రాక్స్ ను కచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు సేవ్ ఖాజాగూడా రాక్స్ వాలంటీర్లు.

కాపాడుకోవాల్సినంత ఇబ్బంది ఈ రాళ్లకు ఏం వచ్చింది అనే ప్రశ్న అందరికీ తలెత్తుతోంది కదూ... అవును... ఇంత అరుదైన, చాలా ఏళ్ల నాటి చరిత్ర ఉన్న ఈ బండ రాళ్లు కబ్జాకోరల్లో చిక్కుటున్నాయని అంటున్నారు. ఇక్కడ ఉంటే మసీదు, గుడి విస్తరణల పేరుతో ఆ రాళ్లను తొలగిస్తూ.. మట్టిని కాజేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో హెచ్ ఎండీఏ కూడా దీనిని హెరిటేజ్ సైట్ గా గుర్తించినట్లు పేర్కొన్నారు వాలంటీర్లు. కానీ మరలా దానిని వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు.

దీనిపై అధికారులకు ఎన్ని సార్లు అర్జీలు ఇచ్చినా కానీ స్పందించడం లేదని వాపోతున్నారు. అయితే ఈ వివాదం పెద్దది కావడంతో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఓ ఐఏఎస్ అధికారి వెల్లడించారు.