Begin typing your search above and press return to search.

ఉద్యోగుల 'చలో విజయవాడ'.. టెన్షన్.. టెన్షన్

By:  Tupaki Desk   |   3 Feb 2022 3:49 AM GMT
ఉద్యోగుల చలో విజయవాడ.. టెన్షన్.. టెన్షన్
X
పీఆర్సీ సాధన సమితి చేపట్టిన ‘చలో విజయవాడ’ టెన్షన్ టెన్షన్ గా మారింది. ఇప్పటికే విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డుకు ‘పీఆర్సీ’ ఉద్యమకారులు ఎవ్వరూ రావద్దని విజయవాడ పోలీసులు ఉద్యోగులను కోరారు. చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేదని ఇప్పటికే తేల్చిచెప్పారు.

అయితే ఉద్యోగులు మాత్రం నిర్వహించి తీరుతామని మొండి పట్టుదలతో ముందుకు కదులుతున్నారు. ఇరు శ్రేణులూ మోహరిస్తుండడంతో గడిచే ప్రతి నిమిషం ఉద్రిక్తతను పెంచేస్తోంది. భారీగా కదిలివస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు పోలీసులు.

ఉద్యోగులు పయనమైన దారుల నిండా కంచెలు, బారికేడ్లు, పోలీసు వలయాలు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. దీంతో విజయవాడకు వచ్చే దారులన్నింటి వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ కట్టడి.. అరెస్టులు, నేతల గృహ నిర్బంధాలు.. ఉపాధ్యాయుల ఇళ్లకు హెచ్చరికల నోటీసులు జారీ చేశారు.

ఇక చలో విజయవాడ జరిగే ‘బీఆర్టీఎస్ ’ రోడ్ లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ అన్ని ప్రాంతాల్లో పోలీస్ పికెట్స్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ల వద్ద తనిఖీలు వాహనాల తనిఖీలు, లాడ్జిల తనిఖీలను చేపట్టి అనుమానితులను చెక్ చేసి వారి వివరాలను సేకరిస్తున్నారు.

బీఆర్టీఎస్ ’ రోడ్ లో 100 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పాల్కన్ వాహనంతో డ్రోన్ కెమెరా ద్వారా పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.

ఇక ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. పాత జీతాలు అడిగితే కొత్త వేతనాలు వేయడం..చర్చలకు పెట్టిన ఏ షరతూనూ ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం.. ఉద్యోగులు వద్దన్న కొత్త పీఆర్సీతో తగ్గిన జనవరి వేతనాలను డీఏలతో కవర్ చేసి సర్కార్ చేసిన మోసాన్ని నిలదీయాలని ‘చలో విజయవాడ’ విజయవంతానికి ఉద్యోగులు పంతం పట్టారు.

ఓ వైపు పోలీసు వ్యూహాలు.. మరోవైపు ఉద్యోగులు భారీ సంఖ్యలో రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఉద్యోగులు పోలీసుల కళ్లు గప్పి రావడానికి మారువేశాల్లో విజయవాడ నగరానికి చేరుకున్నారు. కొందరు బిచ్చగాళ్ల వేశంలో వస్తే.. మరికొందరు రైతుల్లా విజయవాడలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.