Begin typing your search above and press return to search.

ఇంకా కాంగ్రెస్, నెహ్రూనే అంటుంటే ఎలా?

By:  Tupaki Desk   |   11 Feb 2022 5:55 AM GMT
ఇంకా కాంగ్రెస్, నెహ్రూనే అంటుంటే ఎలా?
X
గత ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎత్తి చూపుతూ ప్ర‌జ‌ల్లో త‌మ పార్టీకి ఆద‌ర‌ణ పెంచుకునేందుకు అధికార పార్టీలు ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాయి. ఎన్నిక‌లు వ‌చ్చాయంటే ఆ ప్ర‌యత్నాలు మ‌రింత ఎక్క‌వవుతాయి. ప్ర‌స్తుతం దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ ఇదే రూట్లో సాగుతున్నార‌నే అభిప్రాయాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను దెబ్బ‌కొట్టేందుకు ఆయ‌న ఊ అంటే గ‌తంలో ఆ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పిదాలు, వైఫ‌ల్యాల‌ను తెరమీద‌కు తీసుకువ‌స్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో దేశానికి అన్యాయం జ‌రిగింద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

ఇంకా ఎన్ని రోజులు..

ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఒక‌దానిపై మ‌రొక‌టి విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం సాధార‌ణ‌మే. బీజేపీ నేత‌ల‌తో పాటు ప్ర‌ధాని కూడా అదే ప‌ని చేస్తున్నారు. కానీ ఇంకా ఎన్నాళ్లూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలం గురించి మాజీ ప్ర‌ధాని నెహ్రూపై విమ‌ర్శ‌లు చేస్తూ రోజులు గ‌డుపుతార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి రాక‌ముందు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అస‌మర్థ‌త కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌ని మోడీ అంటున్నారు.

రాష్ట్రాలు స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్నాయ‌ని చెబుతున్నారు. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చి ఎనిమిదేళ్ల కాలం ద‌గ్గ‌ర ప‌డుతోంది. ఇప్ప‌టికీ గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌నే ప్ర‌శ్నిస్తూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డపుకునేందుకు మోడీ ప్ర‌య‌త్నిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఆ వ్యాఖ్య‌లతో ర‌చ్చ‌..

ఇప్ప‌టికే ఏపీ విభ‌జ‌న‌పై కాంగ్రెస్ అన్యాయంగా వ్య‌వ‌హ‌రించింద‌ని అందువ‌ల్ల ఇప్ప‌టికీ తెలంగాణ, ఏపీ మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని మోడీ పార్ల‌మెంట్‌లో వ్యాఖ్యానించారు. ఎలాంటి చ‌ర్చ లేకుండా పార్ల‌మెంట్ త‌లుపులు మూసి మ‌రీ తెలంగాణ బిల్లును ఆమోదించింద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని దుయ్య‌బ‌ట్టారు. ఇక తాజాగా గోవా ప్ర‌జ‌ల‌కు దేశ తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ ద్రోహం చేశార‌ని మోడీ విమ‌ర్శించారు. ఆయ‌న మ‌పుసాలో ఎన్నిక‌ల ప్రచార స‌భ‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన 15 ఏళ్ల‌కు గోవా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంద‌ని మోడీ అన్నారు. అంత కాలం దాస్య శృంఖలాల్లో గోవా మ‌గ్గ‌డానికి నెహ్రూ అనుస‌రించిన విధాన‌మే కార‌ణ‌మ‌ని నిందించారు. బ‌ల‌మైన సైన్యం ఉన్న భార‌త్ త‌లుచుకుంటే పోర్చుగీస్ పాల‌న నుంచి కొన్ని గంట్లోనే గోవా విముక్త‌మ‌యేద‌ని కానీ నెహ్రూ ఆ ప‌ని చేయ‌లేద‌ని ఆరోపించారు.

మోడీ వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికే కాంగ్రెస్ భ‌గ్గుమంటోంది. రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ మోడీ చేసిన అభివృద్ది ఏం లేద‌ని అందుకే కాంగ్రెస్ పేరు ఎత్తుతున్నార‌ని ఆ పార్టీ నేత‌లు కౌంట‌ర్ ఇస్తున్నారు. మోడీ పాల‌న‌లో దేశంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అన్యాయ‌మే జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికైనా మోడీ త‌న ప్ర‌భుత్వ పాల‌న‌పై దృష్టి పెడితే మంచిద‌ని సూచిస్తున్నారు.