Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ విభజన?

By:  Tupaki Desk   |   7 Nov 2016 7:08 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ విభజన?
X
తెలుగు రాష్ట్రాలు మరో విభజనకు తెర లేపేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. షాకవ్వకండి.. ఇది మరో కొత్త రాష్ట్రం ఏర్పాటు కోసం కాదు.. నియోజకవర్గాల విభజన.. విపక్షాలను ఖాళీ చేయడంతో అధికార పార్టీల్లో ఇబ్బడిముబ్బడిగా నేతలు పెరిగిపోవడంతో వారిని సర్దుబాటు చేయడం కోసం చేయబోతున్న పునర్విభజన. ఏపీ - తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రాన్ని ఇప్పటికే పలుమార్లు కోరినా కేంద్రం కుదరదని చెప్పేసింది. టెక్నికల్ గానూ ఇప్పట్లో అది సాధ్యం కాదనే అంటున్నారు. కానీ... అపర చాణక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబును మించిపోయేలా రాజకీయ చక్రం తిప్పుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు నియోజకవర్గాల పెంపు కోసం రంగంలోకి దిగబోతుండడంతో కేంద్రం ఆయన మాట వినే అవకాశం ఉందన్న వాదనా వినిపిస్తోంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణను విజయవంతంగా పూర్తిచేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ఈ విషయంలో కేంద్రాన్ని వీలైనంత త్వరగా ఒప్పించాలని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నెల 16 నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చేలా చూడాలని యోచిస్తున్నారు. దీనిపై వెంటనే కసరత్తు ప్రారంభించాలని ఆయన ఎంపీ వినోద్ కుమార్ ను ఆదేశించినట్లు తెలుస్తోంది. టీఆర్ ఎస్ ఎంపీలు - కేంద్రమంత్రులతోనూ కేసీఆర్ ఈ అంశంపై భేటీ కానున్నట్లు సమాచారం.

శాసనసభ స్థానాల పెంపుపై ఇప్పటికే పలుమార్లు ప్రధాని మోదీ - కేంద్రమంత్రుల వద్ద కేసీఆర్ ప్రస్తావించారు. అయితే ఏపీ పునర్విభజన చట్టంలో స్పష్టత లేకపోవడంతో నియోజకవర్గాల సంఖ్య పెంపుకోసం దానిని సవరించాల్సి ఉందని కేంద్రం తెలిపింది. చట్టసరవణపై పార్లమెంటులో కేంద్రం హామీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఈ విషయంలో ఎటువంటి కదలిక లేకపోవడంతో దీనిపై సీఎం దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముగియడంతో ఇక నియోజకవర్గాలపై దృష్టిసారించాలని నిర్ణయించారు. ఇప్పటి నుంచీ ప్రయత్నిస్తేనే 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ లో ఎమ్మెల్యే స్థానాలను 175 నుంచి 225కు - తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/