Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల నీటి గొడవ:ఇంపార్టెంట్ పాయింట్లు

By:  Tupaki Desk   |   5 May 2017 7:18 AM GMT
తెలుగు రాష్ట్రాల నీటి గొడవ:ఇంపార్టెంట్ పాయింట్లు
X
విడిపోయి క‌లిసి ఉందామ‌న్న నినాదం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జ‌రిగిన ఉద్య‌మంలో జోరుగా వినిపించేది. తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్లే ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయింది. మ‌రి.. విడిపోయిన త‌ర్వాత క‌లిసి ఉన్నామా? అంటే.. లేద‌నే చెప్పాలి. నిష్ఠూరం లాంటి నిజం ఏమిటంటే.. ఆస్తులు.. నీళ్లు.. వివిధ అంశాల్లో వాటాల కోసం రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిత్యం వాదులాడుకుంటూనే ఉన్నాయి. విభ‌జ‌న జ‌రిగిన మూడేళ్లు పూర్తి అవుతున్న వేళ‌.. తాజాగా కృష్ణా న‌దీ జ‌లాల కోసం రెండు తెలుగురాష్ట్రాలు బ్రిజేష్ ట్రైబ్యున‌ల్ ఎదుట పోటాపోటీగా వాద‌న‌లు వినిపించింది.

రెండు తెలుగు రాష్ట్రాలు వినిపించిన వాద‌న‌ల్ని సాపేక్షంగా చూసిన‌ప్పుడు క‌నిపించే అంశాలు ఆస‌క్తిక‌రంగా ఉండ‌ట‌మే కాదు.. ఆందోళ‌న‌ల్ని క‌లిగిస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య దూరం అంత‌కంత‌కూ పెరిగిపోతుంద‌న్న వాద‌న తాజా వాద‌న‌లు వింటే అర్థ‌మ‌వుతుంది. విడిపోయి క‌లిసి ఉందామ‌న్న మాట‌కు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వినిపిస్తున్న వాద‌న‌లో.. కృష్ణా జ‌లాల్ని త‌మ‌కే కేటాయించాల‌ని చెప్ప‌ట‌మే కాదు.. ఆంధ్రాకు అస‌లు అన్ని నీళ్లు ఎందుకు? అన్న ప్ర‌శ్న‌ను వేయ‌టం క‌నిపిస్తుంది. అదే స‌మ‌యంలో ఏపీ వాద‌న‌ల్ని చూస్తే.. త‌మ అవ‌స‌రాలు.. త‌మ క‌ష్టాలు చెప్పుకోవ‌టం కనిపిస్తుంది.

నీళ్ల కోసం పోరాటం జ‌రిగిన‌ప్పుడు.. త‌మ‌కున్న అవ‌స‌రాలు.. అవ‌కాశాల్ని ఎత్తి చూపి త‌మ‌కేం కావాలో కోరుకోవ‌టం ఒక ప‌ద్ధ‌తి. కానీ.. ఎదుటి వారి అవ‌స‌రాల్ని త‌మ కోణంలో చూస్తూ వాద‌న‌లు వినిపించ‌టం చూసిన‌ప్పుడు.. విడిపోయి క‌లిసి ఉందామ‌న్న వాద‌న‌ను మ‌ర్చిపోవ‌టం క‌నిపిస్తుంది. ఎంత చెడినా రెండు తెలుగు రాష్ట్రాల వారు అన్న‌ద‌మ్ములే. ఎవ‌రికేం బాధ క‌లిగినా.. రెండు చోట్ల ఉన్న తెలుగువారే బాధ ప‌డేది. అలాంట‌ప్పుడు ఎక్కువ త‌క్కువ‌ల విష‌యంలో చూసీచూడ‌న‌ట్లుగా.. ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణిని రెండు రాష్ట్రాలు ఎందుకు మ‌ర్చిపోతున్నాయ‌న్న‌ది ఎంత‌కూ అర్థం కాదు. ఒక‌వేళ‌.. పిడివాద‌న‌ను అదే ప‌నిగా వినిపిస్తుంటే.. ఆ విష‌యాన్ని నేరుగా.. సూటిగా ప్ర‌జ‌ల‌కు చెప్పేస్తే స‌రిపోతుంది. కానీ.. అలాంటిదేమీ చెప్ప‌కుండా ట్రైబ్యున‌ల్ ఎదుట హోరాహోరీగా సాగుతున్న వాదులాట‌ను చూసిన‌ప్పుడు.. రానున్న రోజుల్లో నీళ్ల వాటాలు తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య కొత్త మంట‌ల్ని రేపే ప్ర‌మాదం ఉంద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. దీన్ని నివారించ‌టానికి.. రెండు రాష్ట్రాలు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది.

తాజాగా రెండు రాష్ట్రాలు వినిపించిన వాద‌న‌ల్ని చూస్తే..

తెలంగాణ వాద‌న ఇదే..

= బచావత్‌ ట్రైబ్యునల్‌ చేసిన కేటాయింపులను కొనసాగిస్తూనే పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌ కేటాయింపులు కోరింది. ఇది సరి కాదు.

= నీటికి సంబంధించిన వాస్తవ వినియోగాన్ని, బేసిన్‌లోని అవసరాలను పరిగణనలోకి తీసుకొని కేటాయింపులు చేయాలి. బచావత్‌ ట్రైబ్యునల్‌, బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ చేసిన కేటాయింపులను పునఃసమీక్షించాలి.

= తెలంగాణ అవసరాలను పట్టించుకోలేదు. సంరక్షణ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ ఎక్కువ నీటిని పొందింది. ఇప్పుడు కొనసాగించమని కోరుతోంది. కానీ.. తెలంగాణకు ప్రత్యేకించి కృష్ణాబేసిన్‌లోని ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆధునికీకరణ ద్వారా కృష్ణాడెల్టాలో 29 టీఎంసీలు, కేసీ కాలువలో తొమ్మిది టీఎంసీలు ఆదా అయినట్లు పేర్కొన్నారు. కానీ, ఈ ప్రాజెక్టుల్లో కేటాయించిన నీటి కంటే ఎక్కువ వినియోగం జరుగుతోంది.

= కృష్ణాడెల్టా ఆధునికీకరణ నివేదిక ప్రకారం మొదటి పంట 10.5 లక్షల ఎకరాల సాగులో 29 టీఎంసీలు ఆదా అవుతాయి. ఈ నివేదికలోనే స్థానిక డ్రెయిన్లలో లభించే 42.53 టీఎంసీల్లో 20 టీఎంసీలను వినియోగించుకోవచ్చని, భవిష్యత్తులో మొత్తం కూడా వినియోగించుకోవచ్చని పేర్కొంది. కాబట్టి ఆదా అయిన నీటిని 29 టీఎంసీలకే పరిమితం చేయడం సరికాదు.

= ఆయకట్టు ప్రాంతం రాజధాని అభివృద్ధికి, ఆక్వాకల్చర్‌కు కూడా ఎక్కువగా పోయింది. సాగయ్యే ప్రాంతం తగ్గిపోయింది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొంటే కృష్ణాడెల్టాకు 100 టీఎంసీల కంటే తక్కువ సరిపోతాయి. అసలు కృష్ణాడెల్టాకు నీటి కేటాయింపు అవసరమా అన్నది పరిశీలించాలి.

= పులిచింతలలో ఆవిరి కింద 9 టీఎంసీలుగా పేర్కొనడం కూడా ఎక్కువ. వాస్తవంగా ఆవిరయ్యేది చాలా తక్కువ ఉంటుంది. ఈ ప్రాజెక్టువల్ల సాగర్‌ ఎడమగట్టు కాలువ కింద ఆయకట్టు ముంపునకు గురైంది. నీటి నిల్వ ప్రాంతం కూడా తెలంగాణలోనే ఎక్కువ. మద్రాసు తాగునీటి పేరుతో మళ్లించే నీటిని మార్గమధ్యంలోసాగునీటికే ఎక్కువ వినియోగిస్తున్నారు.

= కరవు ప్రాంతాలకు నీరందిస్తున్న నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టి నిర్లక్ష్యానికి గురై ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలకు 75 శాతం నీటి లభ్యత కింద ప్రాజెక్టు వారీ కేటాయింపు చేయాలి.

= ఆంధ్రప్రదేశ్‌ చాలా ఎక్కువ నీటిని కేటాయించాలని ట్రైబ్యునల్‌ను కోరింది. ప్రస్తుత వినియోగాన్ని కొనసాగిస్తూనే కొత్తగా సాగునీటి అవసరాలకు 547 టీఎంసీలు కోరింది. రాజధాని ప్రాంతం మొత్తం కృష్ణాడెల్టా, నాగార్జునసాగర్‌ కుడి, ఎడమకాలువలు, గుంటూరు ఛానల్‌ ఆయకట్టు ప్రాంతంలోనే ఉంది. ఇదంతా పట్టణ ప్రాంతంగా మారినందున ఆయకట్టుకు నీరు అవసరం లేదు.

= ఆంధ్రప్రదేశ్‌ వాస్తవాలకు దూరంగా 110.13 టీఎంసీలు తాగునీటికి కోరింది. పక్కబేసిన్‌లోని ప్రాజెక్టులకు 406 టీఎంసీలు కోరింది. ఇంత భారీ నీరు ఎక్కడ అందుబాటులో ఉందో చెప్పలేదు.

= శ్రీశైలం, పులిచింతలలో ఆవిరయ్యే నీటిని కూడా రాష్ట్రాల వారీగా వినియోగ వాటా ప్రకారం లెక్కగట్టాలి. అన్నింటినీ పరిగణనలోకి తీసుకొంటే ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 512 టీఎంసీలకు బదులు 155.40 టీఎంసీలు సరిపోతాయి. తాగునీరు, ఇతర అవసరాలన్నీ కలుపుకొంటే 162.42టీఎంసీలు కేటాయిస్తే సరిపోతుంది.

ఏపీ వాద‌న ఇది..

+ ఆంధ్రప్రదేశ్‌ వరి పండించేందుకు ఆస్కారమున్న ప్రాంతం. దేశానికే ధాన్యాగారమ‌న్న పేరుంది. ఏ సౌకర్యాలూ లేని కొత్త రాష్ట్రం భవిష్యత్తంతా సాగుపైనే ఆధారపడి ఉంది. ఇక్కడే సాగునీటి అవసరాలెక్కువ. తెలంగాణలో ఖనిజాలు ఎక్కువ. సింగరేణి బొగ్గు గనులున్నాయ. అక్కడి నేలలు ఆరుతడి పంటలకు మాత్రమే యోగ్యమైనవి. బయ్యారం గనుల నుంచే వారికి రూ.లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది.

+ 2014లో రాష్ట్రం విడిపోయే నాటికే తెలంగాణ మిగులు రెవెన్యూతో ఉంది. అంతర్జాతీయ ఐటీ హబ్‌ హైదరాబాద్‌లో ఉంది. ఉద్యోగాలు, పరిశ్రమలు అక్కడే ఎక్కువ. వీటి నుంచి ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయమే ఎక్కువ. మరోవైపు ఆంధ్రపదేశ్‌ కొత్త రాజధానిని నిర్మించుకోవాలి. ఇక్కడ సాగు, తాగు, ఇతరత్రా నీటి అవసరాలు ఎక్కువ. అనేక ప్రాజెక్టులు కృష్ణా జలాలపైనే ఆధారపడి ఉన్నాయి.

+ రాష్ట్ర పునర్విభజన చట్టం పేర్కొన్నట్లు కృష్ణా నది మొత్తాన్ని ఒక హైడ్రలాజికల్‌ యూనిట్‌గా తీసుకుని నీటి లోటు ఏర్పడ్డప్పుడు ఏ ప్రాధాన్యాల ప్రకారం వినియోగించుకోవాలో ట్రైబ్యునల్‌ తేల్చాలి. 60 రోజుల్లో రుతుపవనాలద్వారా వచ్చే 75శాతం నీటిని తీసుకునేలా తెలంగాణ తన వాదన వినిపిస్తోంది. దీనివల్ల దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పూర్తిగా నష్టపోతుంది.

+ తెలుగుగంగ, రాజోలిబండ మళ్లింపు పథకం కుడి కాలువ నీటి కేటాయింపులను మార్చడానికి వీలులేదు. పునర్విభజన చట్టంప్రకారం ట్రైబ్యునల్‌కు ఆ పరిధి లేదు. కృష్ణా డెల్టాకు 113 టీఎంసీలే సరిపోతాయనే తెలంగాణ వాదన అర్థరహితం.

+ ఆధునికీకరణ పూర్తయిన తర్వాతే 152 టీఎంసీలు అవసరమవుతాయని లెక్క తేల్చారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల రాయలసీమ తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్నదే తప్ప కొత్త ప్రాజెక్టు కాదు. ఆర్డీఎస్‌ ఆధునికీకరణ పనులు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించినవే.

+ ఏపీకి 512 టీఎంసీలు - తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులకు సంబంధించి కుదిరిన అంగీకారం మేరకు ట్రైబ్యునల్‌ ప్రాజెక్టుల వారీ కేటాయింపులు ఉండాలి. లోటు సందర్భంలో ఇరు రాష్ట్రాల మ‌ధ్య పంపిణీ విధానాన్ని మాత్రమే నిర్ణయించాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/