Begin typing your search above and press return to search.

ఇక్కడా.. అక్కడా ఒకటే వ్యూహం

By:  Tupaki Desk   |   20 March 2015 4:59 AM GMT
ఇక్కడా.. అక్కడా ఒకటే వ్యూహం
X
పార్టీ ఏదైనా కానీ.. విపక్షంలో ఉంటే.. అధికారపక్షాన్ని ఇరుకునపడేసేందుకు.. అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించేందుకు అనుసరించే మార్గం స్పీకర్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వటమే. వాస్తవానికి చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి ఇస్తుంటారు. అది కూడా ప్రభుత్వ కొలువు తీరిన తర్వాత ఏ రెండేళ్లకో.. మూడేళ్లకో స్పీకర్‌ తీరును గర్హిస్తూ అవిశ్వాసతీర్మానం ప్రవేశ పెట్టటం జరుగుతుంది.

కానీ..రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రభుత్వాల్లోనూ ఒకలాంటి పరిస్థితే నెలకొని ఉండటం విశేషంగా చెప్పాలి. ఏపీలో అధికారపక్షం వైఖరిని.. అసెంబ్లీలో స్పీకర్‌ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏపీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టటం తెలిసిందే. అంతేకాదు.. తాము పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు పిలిస్తే తప్ప సభకు రామంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌ ఇప్పటికే శపధం చేశారు.

మరోవైపు.. తెలంగాణ అసెంబ్లీలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. జాతీయగీతాన్ని అవమానించారనే ఆరోపణలతో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన 11 మంది సభ్యులను బడ్జెట్‌ సమావేశాలకు పూర్తిగా సస్పెండ్‌ చేశారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇప్పటికే టీటీడీపీ నేతలు పలు మార్గాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా తెలంగాణ విపక్షాల చేత సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కోరుతూ డిమాండ్‌ చేసేలా చేయగలిగిరు. ఒక్క మజ్లిస్‌ మినహా మిగిలిన పార్టీలన్నీ టీటీడీపీ నేతలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరిందే.

తాజాగా టీటీడీపీ నేతలు తెలంగాణ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలని భావిస్తున్నాయి. ఇందుకు విపక్షాల సాయాన్ని ఆర్థిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఏపీ అసెంబ్లీలో విపక్షం అనుసరిస్తున్న తీరులోనే.. తెలంగాణలో విపక్షంగా ఉన్న టీటీడీపీ ఒకేసారి స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వటం గమనార్హం.

ఇంకో విషయం ఏమిటంటే.. ప్రభుత్వం ఏర్పాటు చేసి పది నెలలు పూర్తికాకముందే స్పీకర్‌పై అవిశ్వాసమేమిటని ఏపీ అధికారపక్షం నేతలు విరుచుకుపడుతుంటే.. సరిగ్గా అదే పనిని తెలంగాణలో తెలంగాణ తెలుగుదేశం నేతలు వ్యవహరించటం గమనార్హం.