Begin typing your search above and press return to search.

అసెంబ్లీ సీట్లు ఎలా పెంచుతారో మేమూ చూస్తాం

By:  Tupaki Desk   |   20 March 2017 7:51 AM GMT
అసెంబ్లీ సీట్లు ఎలా పెంచుతారో మేమూ చూస్తాం
X
నియోజకవర్గాలు పెరుగుతాయని ఆశ పెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించిన ఏపి - తెలంగాణ ముఖ్యమంత్రుల ఆశలకు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు బ్రేకులేస్తున్నారు. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా ఇద్దరు సీఎంలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నా ఫలితం కనిపించడం లేదు. విభజన చట్టం ప్రకారం తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఆమేరకు రెండు రాష్ట్రాల శాసనసభలు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాయి. 119 సీట్లున్న తెలంగాణలో 153కు - 175 సీట్లున్న ఏపిలో 225కు నియోజకవర్గాలను పెంచాలని రెండు ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఆమేరకు ఇద్దరు సిఎంలూ కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు ద్వారా లాబీయింగ్ చేస్తున్నారు. టీఆర్‌ ఎస్ పక్షాన ఎంపి వినోద్‌ కుమార్ - టిడిపి తరపున కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే, కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం ఇప్పట్లో పునర్విభజన కుదరదని, 2021లోనే పునర్విభజన జరుగుతుందని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ లో ప్రశ్నోత్తరాల సందర్భంగా స్పష్టం చేసింది. అయినా తెదేపా - తెరాస మాత్రం తమ ప్రయత్నాలు ఆపడం లేదు.

మరోవైపు ఇద్దరు సీఎంల కోరిక మేరకు వెంకయ్యనాయుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి స్వయంగా వెళ్లి ఫైలు స్టేటస్ ఏంటో తెలుసుకున్నారట. ఫైలు పరిశీలనలో ఉందని ఆయన లీకివ్వడంతో సీఎలు - గోడదూకిన ఎమ్మెల్యేలు.. కొత్త ఆశావహులు అంతా ఆశలు పెంచుకుంటున్నారట. అయితే.. ఏపీ - తెలంగాణల్లోని బిజెపి శాఖలు మాత్రం నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సిన అవసరం లేదని కరాఖండిగా చెప్పేశాయి. కొద్దినెలల క్రితం అమిత్‌ షా హైదరాబాద్‌ కు వచ్చిన సందర్భంలో పునర్విభజనపై రెండు రాష్ట్రాల నాయకులతో చర్చించారు. ఆ క్రమంలో పునర్విభజన అవసరమా? లేదా? దానికి కారణాలేమిటంటూ ముద్రించిన ఫార్మెట్‌ ను అందరికీ పంపిణీ చేశారు. దానికి రెండు రాష్ట్రాల పార్టీ నేతలు ఇప్పటి పరిస్థితిలో తమకు అవసరం లేదని అందులో లిఖితపూర్వకంగా రాసిచ్చిన సంగతి మర్చిపోకూడదు. దానివల్ల పార్టీకి కొత్తగా వచ్చిన లాభమేమీ వుండదని, సంస్థాగతంగా అంత బలం కూడా లేదని నాయకులు అమిత్‌ షాకు వివరించారు. అయితే కొద్దిరోజుల నుంచి పునర్విభజన అంశంపై మళ్లీ కదలిక ప్రారంభమైందని మీడియాలో వార్తలు రావడంతో రెండు రాష్ట్రాల బీజేపీ నేతలు మరోసారి అమిత్ షాను కలవడానికి రెడీ అవుతున్నట్లు టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/