Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ నేతలకు ఎంత కష్టమొచ్చిందో!!

By:  Tupaki Desk   |   15 April 2017 5:30 PM GMT
కాంగ్రెస్ నేతలకు ఎంత కష్టమొచ్చిందో!!
X
‘‘ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే??? కాదు.. కాకూడదు..’’ అంటూ దానవీర శూరవీరకర్ణలో ఎన్టీఆర్ రేంజిలో తెలుగు కాంగ్రెస్ ప్రముఖులు ఇటీవల భారీ డైలాగులు కొడుతున్నారు. మరి ఎన్నికల నాటికి ఈ డైలాగులు ఏమవుతాయో కానీ, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్సే జీవితం.. కాంగ్రెస్ తోనే జీవితాంతం అంటూ మాటలు చెబుతున్నారు. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి - తెలంగాణలో ఆ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పార్టీలు మారుతారని వినిపిస్తున్న నేపథ్యంలో వారు ఆ ప్రచారాన్ని తిప్పి కొడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తేలేదని పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. వైకాపాలోకి మారుతున్నట్లు వస్తున్న పిచ్చిమాటలను నమ్మొద్దని అన్నారు. చివరి వరకు తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు. గత ఐదు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో కొందరు వ్యక్తులు తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే తనకు అలాంటి ఆలోచన లేదన్నారు. గత 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీలకంగా కొనసాగుతున్నానన్నారు. విభజన సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు ఆంధ్రా నుండి కర్నాటక ప్రాంతానికి వెళ్తున్నట్లు ప్రచారం చేశారన్నారు. కాంగ్రెస్ తరఫున ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యానని, మంత్రి పదవులు అనుభవించానన్నారు. బలహీనంగా ఉన్న వారు పదవుల కోసం పార్టీలు మారతారన్నారు. టిడిపి - వైకాపాకు చెందిన కొందరు నాయకులు ఉద్దేశ పూర్వకంగా తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేసి తన వర్గీయులను దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసేంత వరకు కాంగ్రెస్‌ లో ఉంటామని వైఎస్ హయాంలో ఎమ్మెల్యేలంతా ప్రమాణం చేశామని ఆయన గుర్తు చేశారు.

మరోవైపు తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఇదే మాట చెబుతున్నారు. వారు బీజేపీలో చేరుతారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో తాము బీజేపీలోకి వెళ్ళబోమని కాంగ్రెస్‌ లోనే కొనసాగుతామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తమను, కాంగ్రెస్‌ ను బలహీనపరచాలన్న ఉద్దేశ్యంతో కొంత మంది తెరాస నాయకులతో పాటు తమ పార్టీలోనూ కొంత మంది గిట్టని వారు ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ - ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్వర్యంలో పనిచేస్తామని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ను మళ్లీ అధికారంలోకి తీసుకుని వచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఆయన తెలిపారు. అయితే.. గతంలో టీఆరెస్ అంచుల వరకు వెళ్లిరావడం వంటివి మాత్రం ఆయన ప్రస్తావించలేదు.

మొత్తానికి తెలుగు రాష్ర్టాల్లోని కాంగ్రెస్ నేతల ఫిరాయింపుల పర్వం మొదలవుతోంది.. అలాగే శీలపరీక్షకు సిద్ధమవ్వాల్సిన సమయమూ మొదలవుతోందనద్నమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/