Begin typing your search above and press return to search.

పార్ల‌మెంటులో మోడీ బ్యాచ్ కి ఇత్త‌డేనా?

By:  Tupaki Desk   |   3 March 2018 3:30 PM GMT
పార్ల‌మెంటులో  మోడీ బ్యాచ్ కి ఇత్త‌డేనా?
X
ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ చూడ‌ని స‌రికొత్త రాజ‌కీయం ఢిల్లీ సాక్షిగా చూసే ప‌రిస్థితి. ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్రానికి క‌ట్టు బానిస‌ల మాదిరి వ్య‌వ‌హ‌రించే తెలుగు ఎంపీలు ఈసారి అందుకు భిన్న‌మైన ఎజెండాతో కేంద్రానికి చుక్క‌లు చూపించ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అటు ఏపీ ఎంపీలు కానీ.. ఇటు తెలంగాణ ఎంపీలు కానీ మోడీ స‌ర్కారుకు తెలుగు నిర‌స‌న సెగ ఏ స్థాయిలో ఉంటుందో చేత‌ల్లో చూపిస్తార‌ని చెబుతున్నారు.

విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి ఇవ్వాల్సిన సాయంతో పాటు.. విభ‌జ‌న హామీల విష‌యంలో హ్యాండ్ ఇచ్చిన వైనంపై ఏపీ అధికార‌ప‌క్షం ఆగ్ర‌హంగా ఉంది. ఇదే అంశంపై ఏపీ విప‌క్ష నేత సీరియ‌స్ గా ఉండ‌టంతో.. ఆయ‌న చేసే పోరాటం త‌న రాజ‌కీయ ఉనికికి ఎక్క‌డ స‌మ‌స్య‌గా మారుతుందోన‌న్న భ‌యం బాబు చేత కేంద్రానికి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేసేలా చేస్తోంది. తీవ్ర ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించేలా చేస్తోంది.

ఏపీ ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగించేలా చేస్తున్న మోడీ స‌ర్కారు తీరుకు నిర‌స‌న‌గా అవ‌స‌ర‌మైతే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసేందుకు సైతం వెనుకాడ‌మ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తేల్చి చెప్పిన నేప‌థ్యంలో బాబు మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో ఎక్క‌డ లేని కోపాన్ని తెచ్చుకొని మ‌రీ క‌మ‌ల‌నాథుల‌పై ఆయ‌న క‌స్సుమంటున్నారు.చివ‌ర‌కు అమిత్ షా లాంటోడు ఢిల్లీకి రావాల‌ని బాబుకు ఫోన్ చేస్తే.. తాను రాలేన‌ని.. కావాలంటే సుజ‌నాతో ఒక టీం పంపుతాన‌ని చెప్ప‌టం ద్వారా.. త‌న కోపం ఉత్తుది ఎంత‌మాత్రం కాద‌న్న విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

బాబు కోపం వెనుక జ‌గ‌న్ భ‌యం వెంటాతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో రాజీ ప‌డ్డార‌న్న ముద్ర ప‌డితే.. త‌న రాజ‌కీయ ఉనికికే ప్ర‌మాద‌మ‌న్న విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన బాబు.. బీజేపీతో తెగ‌తెంపులు చేసుకోవ‌టానికి సైతం సిద్ధంగా ఉన్నారు. బాబు తీరు ఇలా సాగుతుంటే.. ఏపీ ప్ర‌యోజ‌నాలే ధ్యేయంగా ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. ఏపీ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రిస్తున్న కేంద్రానికి ఇప్ప‌టికే అల్టిమేటం ఇచ్చిన జ‌గ‌న్‌.. తాను చెప్పిన గ‌డువు ముగిసే వ‌ర‌కూ వెయిట్ చేయాల‌న్న ధోర‌ణిలో ఉన్నారు.

ఏపీ నేత‌ల ప‌రిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణ ఎంపీల ప‌రిస్థితి ఇంచుమించే ఇదే రీతిలో ఉంది. విభ‌జ‌న స‌మ‌యంలో రాష్ట్రానికి చేస్తామ‌న్న ప‌నులకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ ఏవీ అడుగు ముందుకు ప‌డ‌క‌పోవ‌టం.. కేంద్రం నుంచి కోరుతున్న సాయం విష‌యంలో మొండిచేయి చూపిస్తున్న వైనంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం సీరియ‌స్ గా ఉన్నారు.

ఈ కార‌ణంతోనే మోడీకి తానెంత క్లోజ్ అన్న విష‌యాన్ని చెప్పుకునేందుకు త‌పించే ఆయ‌న‌.. ఇప్పుడు మోడీ ప‌క్క‌న గారు ప్లేస్ లో గాడును చేర్చేయ‌ట‌మే కాదు.. కేంద్రానికి తెలివి లేద‌న్న మాట‌ను చెప్పేస్తున్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు వేళ‌.. ప్ర‌ధాని వ‌ద్ద‌కు వెళ్లి స‌ల‌హాలు ఇచ్చిన నోటితోనే మోడీని ఉద్దేశించి విమ‌ర్శ‌ల‌తో క‌డిగేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం నుంచి ప్రారంభ‌వ‌య్యే పార్ల‌మెంటు స‌మావేశాల్లో తెలుగు ఎంపీల పుణ్య‌మా అని మోడీ అండ్ కోకు నిర‌స‌న‌ల ఇత్త‌డి త‌ప్ప‌ద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.