Begin typing your search above and press return to search.

ఢిగ్గీ దిగిపోవాల్సిందే అంటున్న కాంగ్రెస్ నేత‌లు

By:  Tupaki Desk   |   17 March 2017 10:03 AM GMT
ఢిగ్గీ దిగిపోవాల్సిందే అంటున్న కాంగ్రెస్ నేత‌లు
X
ఆంధ్రా - తెలంగాణ రాష్ట్రాల ఇన్‌ చార్జి - ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌ కు రెండు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు - ఎంపీలు నిద్ర క‌రువు అయ్యేలా చేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో గోవా - మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక పెద్ద పార్టీగా సీట్లు సంపాదించిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు రాష్ర్టాల్లో సీఎం పీఠం అధిరోహించే బాధ్య‌త‌ల‌ను దిగ్విజయ్ సింగ్‌ కు కాంగ్రెస్ పార్టీ అప్ప‌గించింది. అయితే ఇక్కడ సీన్ రివ‌ర్స్ అయి బీజేపీ గ‌ద్దెనెక్కింది. దీంతో డిగ్గీ వ్యవహరించిన విధానం, ముఖ్యంగా అవలంబించిన నిర్లక్ష్య వైఖరి ఫలితంగానే పార్టీ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయిందంటూ రెండు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అదే స‌మ‌యంలో మీడియాకు ఎక్కారు. ఇపుడు సేమ్ సీన్ ఏపీ - తెలంగాణ‌లో జ‌రుగుతోంది.

పార్టీ బాధ్యుడిగా దిగ్విజయ్ సింగ్ వ్యవహరిస్తున్న తీరు, అవలంబిస్తున్న విధానాల మూలంగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏమాత్రం అభివృద్ధి చెందటం లేదని, రోజురోజుకూ మరింతగా దిగజారిపోతోందని తెలుగు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి - మరికొందరు సీనియర్ నాయకులు త్వరలోనే రాహుల్ గాంధీని కలిసి దిగ్విజయ్ సింగ్‌ను తొలగించాలని కోరుతూ ఒక వినతిపత్రాన్ని అందజేయనున్నారని స‌మాచారం. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులు ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీని కలిసినప్పుడు దిగ్విజయ్ సింగ్ మూలంగా తెలంగాణ- ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీకి కలుగుతున్న నష్టం గురించి వివరించినట్లు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు వేరు - వేరు నాయకులను ఇన్‌ చార్జీలుగా నియమించాలని వారు అధినాయకత్వాన్ని కోరుతున్నారు.

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ శాసన సభలకు 2019లో ఎన్నికలు జరిగే సమయానికి పార్టీని పటిష్టం చేయటంతోపాటు ప్రజల వద్దకు వెళ్లేందుకు ఇప్పటినుండే పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టవలసి ఉంద‌ని ఇలా చేయని పక్షంలో ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఫలితాలే ఇక్కడ కూడా ఎదురవుతాయని వారు పార్టీ అధినాయకత్వాన్ని హెచ్చరిస్తున్నారు. గోవా - మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక పెద్ద పార్టీగా ఎదిగివచ్చినా దిగ్విజయ్ సింగ్ వ్యవహరించిన తీరు, అతి భ‌రోసా, నిర్లక్ష్య వైఖరి ఫలితంగానే పార్టీ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయిందంటూ ఆ రెండు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు చేసిన ఫిర్యాదు నూటికి నూరు శాతం నిజమని వారంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బాగుపడి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలంటే రాష్ట్ర ఇన్‌ చార్జీలుగా కొత్తవారిని నియమించాలని వారు పార్టీ అధినాయకత్వాన్ని కోరుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/