Begin typing your search above and press return to search.

‘ఏపీ అసెంబ్లీ’ శంకుస్థాపన డేట్ చెప్పేశారు

By:  Tupaki Desk   |   3 Feb 2017 4:53 AM GMT
‘ఏపీ అసెంబ్లీ’ శంకుస్థాపన డేట్ చెప్పేశారు
X
కాస్త అటూఇటూగా మరో రెండేళ్ల వ్యవధిలో ఏపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలకు తగినట్లుగా ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులు వేయటం షురూ చేశారు. పదవిలోకి వచ్చిన రెండున్నరేళ్లు దాటినా.. ఏపీ రాజధాని పనుల విషయంలో ఇప్పటివరకూ కీలకమైన నిర్మాణాల్ని ప్రారంభించని సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళలో.. ఏపీ రాజధానిలో నిర్మాణాలపై బాబు ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది.

ఈ వాదనకు బలం చేకూరేలా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అమరావతిలో కీలకమైన ఏపీ అసెంబ్లీ భవనాన్ని.. ఏపీ హైకోర్టు నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన డేట్ ను ఫిక్స చేశారు. ఇప్పటికే అమరావతిలో నిర్మించే నిర్మాణాలకు సంబంధించి పలు అకృతులను సిద్ధం చేయటం.. వీటి ఎంపికలో ఏపీ సర్కారు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నాటికి అమరావతిలో పలు నిర్మాణాల్ని నిర్మించాలని.. వాటిని చూపిస్తూ.. తనకు మరోసారి అవకాశం ఇస్తే..మరింత అభివృద్ధి చేస్తానని చెప్పే దిశగా బాబు ప్లానింగ్ ఉందని చెబుతుంటారు.

ఇందుకు తగ్గట్లే.. తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఉండటం గమనార్హం. ఈ జులై 20న అమరావతిలో నిర్మించే అసెంబ్లీ భవనానికి.. హైకోర్టు భవన నిర్మాణానికి ఆగస్టు 17న శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఈ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను ఈ నెల 22న ఇవ్వనున్నారు. వీటిపై పలు దశల్లో చర్చలు జరిపి.. ఏప్రిల్ 19న డిజైన్లను ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రుల చరిత్ర.. సంస్కృతి.. సంప్రదాయాల్ని మేళవించేలా నిర్మాణాలు ఉండాలన్న విషయాన్ని చంద్రబాబు స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు. వీటితో పాటు 2019లో జరగనున్న జాతీయ క్రీడల్ని దృష్టిలోపెట్టుకొని అమరావతిలోని స్పోర్ట్స్ సిటీని నిర్మించాల్సిన అవసరం ఉందని బాబు చెబుతున్నారు. రానున్న రెండేళ్ల వ్యవధిలో ఏపీ అసెంబ్లీ.. హైకోర్టు.. స్పోర్ట్స్ సిటీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. సార్వత్రిక ఎన్నికల సమయానికి ముఖ్యమైన భవనాల్ని నిర్మించటం ద్వారా ఏపీ ప్రజల మనసుల్ని కొల్లగొట్టటంతో పాటు.. ఓట్లుగా మార్చుకోవాలన్న ఆలోచనలో ఏపీ ముఖ్యమంత్రి ఉన్నట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/