Begin typing your search above and press return to search.

వణికించే చలిని మరిచేలా పొగలు సెగలతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

By:  Tupaki Desk   |   8 Dec 2019 4:13 AM GMT
వణికించే చలిని మరిచేలా పొగలు సెగలతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు
X
తెలంగాణ రాజకీయానికి.. ఏపీ రాజకీయానికి తేడా ఏమిటన్నది చూస్తే.. వ్యత్యాసం ఒక విషయంలో కొట్టొచ్చినట్లు కనిపించకమానదు. తెలంగాణలో కేసీఆర్ ను ఢీ కొట్టేంత అధినేత ఎవరూ కనిపించరు. దీంతో.. వన్ మ్యాన్ షో నడుస్తుంటుంది. అధికారపక్షానికి బలమైన ప్రతిపక్షం లేకపోవటం రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయన్న దానికి నిదర్శనంగా తెలంగాణ రాజకీయాన్ని చెప్పక తప్పదు.

అందుకు భిన్నంగా ఏపీ రాజకీయం ఉంటుందని చెప్పాలి. వైఎస్ జగన్.. చంద్రబాబుల మధ్య వయసులో చాలానే తేడా ఉన్నా.. ఈ ఇద్దరు అధినేతలు పోట్ల గిత్తల్లా ఢీ అంటే ఢీ అన్నట్లు ఉంటారు. అధికారపక్షంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా పోరాట స్ఫూర్తిని మాత్రం ఆపరు. కాకుంటే వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తన ప్రత్యర్థుల్ని ఇరుకున పెడుతుంటే.. చంద్రబాబు తీరు మాత్రం మోటుగా.. పాత కాలం పద్దతుల్లో సాగుతూ జనాలకు చిరాకు పెట్టేసేలా చేస్తుంటుంది.

ప్రజాతీర్పునకు ఎలా స్పందించాలి? విపక్ష నేతగా ఎలా వ్యవహరించాలన్న విషయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ తడబాటుకు గురి కావటం.. ఒక పక్కా ప్లాన్ లేకుండా ముందుకెళ్లటం చంద్రబాబులో కనిపిస్తుంది. ప్రత్యర్థికి అర్థం కాని ఫార్మాట్ లో వెళ్లాలన్న ఆలోచన బాబుకు లేదని చెబుతారు.
ఈ కారణంగానే ప్రతిపక్షం అన్నంతనే ఉండాల్సిన కనీస సానుభూతి ప్రజల్లో బాబుకు లేకపోవటం వెనుక అసలు కారణం ఇదేనంటారు. ఎన్నికల ఫలితాలు విడుదలై.. ప్రభుత్వం ఏర్పాటై కేవలం ఆర్నెల్లు అయినా జిల్లాల పర్యటనలు.. నిరసనలు.. ఇలా నిత్యం ఏదో ఒక రచ్చ చేయనిదే నిద్ర పట్టదన్నట్లుగా వ్యవహరించటం బాబుకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి. ఈ కారణంతోనే ప్రతిపక్ష నేతగా రావాల్సినంత సానుభూతి ఆయనకు దక్కటం లేదని చెప్పక తప్పదు.

ఇప్పటికే ఏపీ అధికారపక్షాన్ని దుమ్మెత్తి పోసే విషయంలో వెనుకా ముందు చూసుకోకుండా చేస్తున్న తండ్రీ కొడుకుల తీరుపై ఏపీ ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. పాలించేందుకు అవసరమైన కనీస అవకాశం ఇవ్వకుండా ఈ తిట్ల వర్షమేమిటన్న ప్రశ్నను సంధిస్తున్నారు. విపక్ష నేత సంధించే సవాళ్లను తనకు అవకాశంగా మార్చుకొని.. ఒకటి తర్వాత ఒకటిగా నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్లిపోతున్నారు జగన్. ఈ వేగాన్ని ఏ మాత్రం ఊహించని బాబు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఇలాంటి వేళలోనే సోమవారం నుంచి ఏపీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎంత గట్టిగా తిడితే అంత ఎక్కువ మైలేజీ వస్తుందన్న భ్రమలో ఉన్న చంద్రబాబుకు వరుస షాకులు ఇచ్చేందుకు ఏపీ అధికారపక్షం సిద్ధమవుతోంది.

ఆ మధ్యన ఇసుక అంశంపై నానా రచ్చ చేసిన బాబు అండ్ కో ఆ ఇష్యూ క్లోజ్ అయ్యాక.. పది.. పదిహేను రోజులుగా అమరావతి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని వీలైనంత బలంగా ప్రస్తావించాలని.. తమ హయాంలో అమరావతిని ఎంతలా డెవలప్ చేశామన్న విషయాన్ని గొప్పగా చెప్పుకోవటానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతుంటే.. వారి వాదనలో పస ఎంతన్నది అందరికి అర్థమయ్యేలా చెప్పేందుకు ఏపీ అధికారపక్షం రెఢీ అవుతోంది. దీంతో.. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆగమాగం కావటం ఖాయమని చెప్పక తప్పదు. వణికించే చలిలో హీటు పుట్టించేలా తాజా సమావేశాలు ఉండనున్నాయి.