Begin typing your search above and press return to search.

బ్యాంక్ కు మాజీ ఎంపీ పంగనామం.. త్వరలోనే ఆస్తుల వేలం

By:  Tupaki Desk   |   22 Feb 2020 6:45 AM GMT
బ్యాంక్ కు మాజీ ఎంపీ పంగనామం.. త్వరలోనే ఆస్తుల వేలం
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు బ్యాంక్ ల నుంచి రుణాలు పొంది వాటిని ఎగ్గొట్టడంతో బ్యాంకులు వారిపై చర్యలు తీసుకుంటున్నాయి. రూ.కోట్లలో రుణాలు తీసుకుని ఆ తర్వాత వాటిని రుణాలు తిరిగి చెల్లించకుండా ఎగ్గొడుతూ బ్యాంక్ లకు పంగనామం పెడుతున్న సంఖ్య పెరుగుతోంది. ఒకప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇదే విషయంలో కష్టాలు పడుతుండగా తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త రాయపాటి సాంబశివరావుకు అదే పరిస్థితి వచ్చింది. ఆయన ఆస్తులను కూడా వేలం వేస్తున్నట్లు ఓ బ్యాంక్ బహిరంగ ప్రకటన విడుదల చేసింది.

గుంటూరు ఎంపీగా పని చేసిన రాయపాటి సాంబశివరావు ప్రముఖ పారిశ్రామిక వేత్తగా కొనసాగుతున్నారు. ఆయన తీసుకున్న రుణాలకు రూ.837.37 కోట్ల విలువైన రుణ బకాయిలు చెల్లించకపోవడంతో తాజాగా ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ ప్రకటించింది. గుంటూరు, న్యూఢిల్లీలోని ఆయనకు సంబంధించిన ఆస్తులను మార్చి 23వ తేదీన వేలం వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. గుంటూరు అరండల్‌పేటలోని 22,500 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్న వాణిజ్య భవనంతోపాటు, న్యూఢిల్లీలోని ఫ్లాట్‌ను వేలం వేయనున్నారు. వేలం వేసినా.. వ్యత్యాసమే ఎక్కువ. రుణానికి వేలం వేసే ఆస్తులకు మధ్య చాలా వ్యత్యాసం ఉండటం గమనార్హం. గుంటూరు భవనం ఆస్తి విలువను రూ.16.44 కోట్లు, ఢిల్లీలోని ఫ్లాట్ విలువను రూ.1.09 కోట్లుగా నిర్ధారించారు.

ఆంధ్రా బ్యాంక్ నుంచి ట్రాన్స్‌ట్రాయ్ ఇండియాతోపాటు చెరుకూరి శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, రాయపాటి రంగారావు, దేవికారాణి, లక్ష్మి పేరిట రుణం తీసుకోగా ఈ రుణానికి పూచీకత్తుగా రాయపాటి జగదీశ్, రాయపాటి జీవన్, నారయ్య చౌదరి, రంగారావు, దేవికా రాణి, లక్ష్మి, సీహెచ్ వాణి, జగన్మోహన్ యలమంచలి ఉన్నారని బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. తీసుకున్న రుణాలకు వాయిదాలు చెల్లించకపోవడం, నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో ఆంధ్రాబ్యాంక్ తదుపరి చర్యలు తీసుకుంటూ ఆస్తుల వేలానికి నిర్ణయించింది. మార్చి 23వ తేదీన ఆ వేలం నిర్వహించనున్నారు.