Begin typing your search above and press return to search.

బాబుకు బీపీ పెంచేలా...బీజేపీ కొత్త వ్యూహం

By:  Tupaki Desk   |   19 Feb 2018 3:35 AM GMT
బాబుకు బీపీ పెంచేలా...బీజేపీ కొత్త వ్యూహం
X
స్వ‌యంగా తాను రంగంలోకి దిగ‌క‌పోయిన‌ప్ప‌టికీ..పార్ల‌మెంటులో ఎంపీల‌తో క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌తో మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీని ఇర‌కాటంలో పెట్టే స్కెచ్‌ను అమ‌లు చేస్తున్న ఏపీ సీఎం - టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై క‌మ‌ళ‌నాథులు సైతం అదే ఫార్ములా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఏ అంశాల ఆధారంగా అయితే త‌మ‌ను ఇబ్బందుల పాలు చేస్తున్నారే...అవే అంశాల ఆధారంగా...ఏ రాజీనామాల కోణంలో అయితే త‌మ‌ను దోషులుగా నిల‌బెడుతున్నారో అవే రాజీనామాల ఆధారంగా బాబును బుక్ చేసేందుకు బీజేపీ నేత‌లు నిర్ణయించారు. టీడీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, తమ ఇద్దరు మంత్రులు టీడీపీ మంత్రివర్గం నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకునే దిశగా బీజేపీ ముందుకు సాగుతోంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం టీడీపీపై ఎదురుదాడి విషయంలో వౌనంగా ఉన్నా - పార్టీ నేతలు మాత్రం టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని సహించలేకపోతున్నారు. రాష్ట్రం లో - అసెంబ్లీలో ఇక అసలుసిసలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించారు.

విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఈ మేర‌కు సూత్ర‌ప్రాయ నిర్ణ‌యం తీసుకున్నారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించారు. కేంద్రం ఇచ్చిన నిధులు - వాటిని రాష్ట్రం వినియోగిస్తున్న తీరు - ఉపాధి హామీ పథకం - పోలవరం - తదితర అంశాల్లో జరుగుతున్న అవినీతిని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి విష్ణుకుమార్‌ రాజు - ఆకుల సత్యనారాయణ సంసిద్ధత వ్యక్తం చేశారు. గతంలో పోలవరం - ప్యాకేజీపై బాబు ఏవిధంగా అసెంబ్లీని వేదికగా చేసుకున్నారో - తామూ కేంద్రం ఇచ్చిన నిధులను శాఖల వారీగా వివరించడం ద్వారా అదే అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని నిర్ణయించారు. పార్టీని టీడీపీ ఒక పథకం ప్రకారం గత నాలుగేళ్ల నుంచి బలహీనపరిచిందని - ఇప్పుడు ఎన్నికలకు ఏడాది ముందు అన్నీ తీసుకుని ఏమీ ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నా వౌనంగా ఉంటే పార్టీకి ఉనికే ఉండదని గ్రహించింది. అందుకే తాము కూడా 2014లో టీడీపీ ఇచ్చిన హామీల అమలు - 13 జిల్లాలకు కేటాయించిన నిధులు - వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లో ఆగిన ప్రాజెక్టులపై పోరాడాలని నిర్ణయించినట్లు సమాచారం.

కాగా, స‌మావేశం ప్రారంభ‌మ‌యింది మొద‌లుకొని హాట్ హాట్‌ గా చ‌ర్చ సాగింది. పార్టీ సమావేశంలో మాట్లాడని కొద్దిమంది నేతలు వినా మిగిలిన వారంతా టీడీపీ తమపై చేస్తున్న దుష్ప్రచారంపై ఎదురుదాడి చేయాల్సిందేనని తీర్మానించారు. ముఖ్యంగా బాబు మంత్రివర్గం నుంచి ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేసి బయటకొచ్చి పార్టీని బతికించుకుందామన్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి సూచనలతో మెజారిటీ నేతలు ఏకీభవించారు. మనల్ని దోషులుగా నిలబెడుతున్న టీడీపీపై మొహమాటం ప్రదర్శించాల్సిన అవసరం ఏమొచ్చిందని, మనం కూడా వారిస్థాయిలో ఎందుకు ఎదురుదాడి చేయడం లేదని నిలదీశారు. దీంతో ఈ స‌మావేశంలో ఉన్న మంత్రి మాణిక్యాల‌రావు సైతం అదే రీతిలో స్పందించిన‌ట్లు తెలుస్తోంది.

`నాయకత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇస్తే రాజీనామా చేయడం నిమిషాల పని. అసలు మీ పార్టీని టీడీపీ వాళ్లు రోజూ తిడుతుంటే మీరెందుకు రాజీనామాలు చేసి బయటకు రావడం లేదని నాకు మనవాళ్లు మెసేజ్‌ లు పంపిస్తున్నారు. ఫోన్లు చేస్తున్నారు. అందుకే నేను ఫోన్ ఫ్లైట్ మోడ్‌ లో పెట్టుకోవాల్సి వస్తోంది. నాకూ ఈ పరిస్థితి ఇబ్బందిగానే ఉంది’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.