Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ నేత‌లు సీమాంధ్ర ద్రోహులా?

By:  Tupaki Desk   |   13 Feb 2018 5:26 AM GMT
ఏపీ బీజేపీ నేత‌లు సీమాంధ్ర ద్రోహులా?
X
ఇంటి స‌మ‌స్య‌లు ఇంట్లో వాళ్లకు తెలుస్తాయా? ప‌క్కింటోడికి తెలుస్తాయా? ఇంట్లోనే ఉంటూ.. ఇంటికి సంబంధం లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే వారు కొంద‌రు ఉంటారు. ఇలాంటోళ్లు ఇంటికి భార‌మే కాదు.. ఇంటిని బ‌ద్నాం చేయ‌టంలో మొద‌టి వ‌రుస‌లో ఉంటారు. త‌ల్లిపాలు తాగి.. ఆ త‌ల్లి రొమ్ముల్ని త‌న్నే ర‌కాన్ని ఏమ‌నాలి? ఎలా చూడాలి? ఏపీ బీజేపీ నేత‌లు తీరు చూస్తుంటే.. ఇప్పుడివ‌న్నీ గుర్తుకు రాక మాన‌వు.

దేశంలో మ‌రే రాష్ట్రంలో లేని ద‌రిద్రం ఏపీలోనే క‌నిపిస్తుంది. దేశంలో క‌మ్యూనిస్టులు. ఏపీ బీజేపీ నేత‌లు ఇంచుమించు ఒకేలా క‌నిపిస్తార‌ని చెబుతారు. చైనాకు జ‌లుబు చేస్తే దేశంలోని క‌మ్యూనిస్టుల‌కు తుమ్ములు వ‌స్తుంటాయ‌ని గ‌తంలో ఒక ఎద్దేవా త‌ర‌చూ వినిపిస్తూ ఉండేది. క‌మ్యూనిస్టుల‌కు త‌మ పార్టీ కంటే.. ఆ పార్టీ ఏ దేశానికి చెందిన‌ద‌న్న విష‌యాన్ని ప‌ట్టించుకోర‌ని చెబుతారు. అదేమంటే.. తాము విశ్వ మాన‌వుల‌మ‌న్న బిల్డ‌ప్ క‌నిపిస్తూ ఉంటుంది.

క‌మ్యూనిస్టుల‌కు తోడు పోయిన ర‌కంగా ఏపీ బీజేపీ నేత‌లుగా చెప్పాలి. దేశంలో మ‌రే రాష్ట్రంలో అయినా.. ఏ పార్టీకి చెందిన నేత‌లైనా స‌రే.. తొలుత త‌మ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు పెద్ద‌పీట వేసిన త‌ర్వాతే పార్టీ సంగ‌తి చూస్తారు. కానీ.. ఏపీ క‌మ‌ల‌నాథులు ఇందుకు భిన్నం. వారికి తాము ప్రాతినిధ్యం వ‌హించే రాష్ట్రం కంటే కూడా తామున్న బీజేపీ అంటేనే ప్రాణం. ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కంటే కూడా పార్టీ ప్ర‌యోజ‌నాల‌కే పెద్ద‌పీట వేస్తారు.

ఏపీ ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌ని చెప్పినా.. ఆ విష‌యాన్ని లేవ‌నెత్తితే త‌మ పార్టీకి ఇబ్బందిగా మారుతుంద‌నిపిస్తే చాలు.. ఆ స‌మ‌స్య ఎంత తీవ్ర‌మైన‌దైనా స‌రే వ‌దిలేయ‌టం క‌నిపిస్తుంది. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ మొండిత‌నం.. మూర్ఖ‌త్వం.. ముందుచూపు లేని త‌నం కార‌ణంగా ఇష్టారాజ్యంగా ఏపీ విభ‌జ‌న జ‌రిగింది. ఇదిలా ఉంటే.. విభ‌జ‌న కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చేందుకు ప్ర‌య‌త్నించాల్సిన ఏపీ బీజేపీ నేత‌లు.. మోడీకి కొమ్ము కాసేందుకే త‌మ‌కున్న శ‌క్తియుక్తుల్ని ప్ర‌ద‌ర్శించ‌టం క‌నిపిస్తుంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ ఇచ్చిన హామీల అమ‌లు త‌ర్వాత‌.. ముష్టిని విదిల్చిన‌ట్లుగా విదిల్చిన నిధుల్ని చూసి మా గొప్ప‌గా సంబ‌ర‌ప‌డిపోవ‌ట‌మే కాదు.. ల‌క్ష కోట్లు.. రెండు ల‌క్ష‌ల కోట్లు కేంద్రం ఇచ్చిందంటూ డ‌బ్బా కొట్టుకోవ‌టం చూస్తే.. ఏపీ బీజేపీ నేత‌ల్ని ఏమ‌నాలో అర్థం కాదు. ఎక్క‌డైనా త‌మ రాష్ట్రానికి రావాల్సిన‌వి వ‌స్తున్నా.. మ‌రింత ఇవ్వాల‌న్న మాట చెప్పే నేత‌ల్ని చూస్తాం. కానీ.. ఏపీ బీజేపీ నేత‌లు ఇందుకు భిన్నం. ఏపీకి ఇవ్వాల్సిన వాటి గురించి ప్ర‌శ్నించ‌టం ప‌క్క‌న పెట్టేసి.. ఇవ్వ‌ని నిదుల గురించి క‌నీసం పెద‌వి విప్ప‌ని దుర్మార్గ‌మైన తీరు క‌నిపిస్తుంటుంది.

మోడీ స‌ర్కారు చిట్ట‌చివ‌రి పూర్తిస్థాయి వార్షిక బ‌డ్జెట్ లో ఏపీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌లిగించ‌ని రీతిలో ఉండ‌టంపై ఏపీ ప్ర‌జ‌లంతా తీవ్ర ఆగ్ర‌హావేశాల‌తో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో ఏపీలోని రాజ‌కీయ పార్టీలు ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి మాట్లాడుతున్నారు. ప్ర‌ధాని మోడీ తీరును తీవ్రంగా త‌ప్ప ప‌డుతున్నారు. అయితే.. మిగిలిన పార్టీల‌కు భిన్నంగా ఏపీ బీజేపీ నేత‌లు మాత్రం త‌మ అధినాయ‌క‌త్వం ఏపీకి చాలానే చేసింద‌ని చెప్పుకోవ‌టం షాకింగ్ గా మారింది. ఏపీకి గ‌డిచిన నాలుగేళ్ల‌లో కేంద్రం ఇచ్చింది రూ.20వేల కోట్లేన‌ని.. అందులో ప్ర‌త్యేకం కింద ఇచ్చింది రూ.10వేల కోట్లు మాత్ర‌మేన‌ని ఓప‌క్క లెక్క‌లు విప్పి చెబుతున్నా.. ఏపీ బీజేపీ నేత‌లు మాత్రం రూ.ల‌క్ష‌ల కోట్ల రూపాయిలు కేంద్రం ఇచ్చింద‌ని చెబుతున్నారు.

మీ లెక్క‌లు త‌ప్పంటే.. మీ లెక్క‌లు త‌ప్పు అంటూ టీడీపీ.. బీజేపీ నేత‌ల మ‌ధ్య వాదులాట అంత‌కంత‌కూ పెరుగుతున్న‌దే త‌ప్పించి త‌గ్గ‌టం లేదు.

నిధుల విష‌యంలో ఏపీకి కేంద్రం ఇచ్చిన లెక్క విష‌యంలో ఏపీ బీజేపీ నేత‌ల నోటి మాట‌లు వింటే గుండె ఆగిపోవాల్సిందే. ఎందుకంటే గ‌డిచిన నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో ఏపీకి రూ.3.55 ల‌క్ష‌ల కోట్లు ఇచ్చిన‌ట్లుగా తేల్చారు. అయితే.. ఈ లెక్క శుద్ద అబ‌ద్ధంగా కొట్టిపారేస్తున్నారు. కేంద్రం నుంచి ఏపీకి వ‌చ్చింది కేవ‌లం రూ.20వేల కోట్లు మాత్ర‌మేన‌ని.. ఇందులో ప్ర‌త్యేకంగా ఏపీకి ఇచ్చింది రూ.10వేల కోట్లు మాత్ర‌మేన‌ని తేల్చింది. అన్ని రాష్ట్రాల‌కు ఇచ్చిన‌ట్లే ఏపీకి కూడా నిధులు ఇచ్చార‌ని.. దాన్ని ప్ర‌త్యేకంగా లెక్క వేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఏపీ స‌ర్కారు చెబుతోంది.

అన్ని రాష్ట్రాల‌కు ఇచ్చిన నిధుల విష‌యంలోనూ ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని తెలుగు త‌మ్ముళ్లు చెబుతున్నారు. కేంద్రం పేర్కొన్న వివిధ ప‌థ‌కాల కింద రూ.28వేల కోట్లు ఏపీకి రావాల్సి ఉంటే.. అందులో రూ.10వేల కోట్లు మాత్ర‌మే వ‌చ్చిన‌ట్లుగా టీడీపీ వ‌ర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

అంతేకాదు.. పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీకి ఇస్తామ‌ని చెప్పిన నిధులు సైతం ఇవ్వ‌లేద‌న్న‌ది తాజా ఆరోప‌ణ‌. నాబార్డు ద్వారా పోల‌వ‌రం ప్రాజెక్టుకు నిధులు తానే ఇస్తాన‌ని కేంద్రం చెప్పింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీ స‌ర్కారు రూ.7,179 కోట్లు ఖ‌ర్చు పెడితే.. కేంద్రం తిరిగి చెల్లించింది కేలం రూ.4332 కోట్లు మాత్ర‌మే. మ‌రో రూ.2847 కోట్లు విడుద‌ల చేయాల్సి ఉంది. ఇది కాకుండా పోల‌వ‌రం ప్రాజెక్టు పెరిగిన అంచ‌నా వ్య‌యాన్ని ఇప్ప‌టివ‌ర‌కూ ఆమోదించ‌ని వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఏపీ బీజేపీ నేత‌లు పోల‌వ‌రం లెక్క‌ను అస్స‌లు ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం.

ఇక‌.. ఏపీ క‌మ‌ల‌నాథులు మొద‌లు కొని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు వ‌ర‌కూ త‌ర‌చూ చెప్పే మాటేమిటంటే.. ఏపీలో జాతీయ ర‌హ‌దారుల కోసం రూ.ల‌క్ష కోట్లు ఇచ్చిన‌ట్లు చెబుతుంటారు. వాస్త‌వానికి ఏపీ వ‌ర‌కూ ఇచ్చింది కేవ‌లం రూ.3వేల కోట్లు మాత్ర‌మే. ఇక‌.. విశాఖ‌-చెన్నై- కారిడార్ కోస్ట‌ల్ ఎక‌నామిక్ జోన్.. నాగాయ‌లంక మిస్సైల్ యూనిట్ కోసం మొత్తంగా రూ.15,226 కోట్లు ఇచ్చిన‌ట్లు చెప్పినా.. ఖ‌ర్చు చేసింది మాత్రం గుండు సున్నా మాత్ర‌మే.

ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే ప్ర‌ధాన‌మంత్రి అవాస్ యోజ‌న కింద వేలాది ఇళ్ల‌ను మోడీ స‌ర్కారు ఆమోదించింద‌ని.. ఇందుకోసం రూ.17,292 కోట్లు ఇచ్చిన‌ట్లు చెబుతుంటారు. అయితే.. రాష్ట్రానికి వ‌చ్చింది మాత్రం రూ.1500 కోట్లు మాత్ర‌మే. ఇలా బీజేపీ నేత‌లు చెప్పే వేల కోట్ల‌కు.. వాస్త‌వంలో విడుద‌ల చేసిన వంద‌ల కోట్ల‌కు అస్స‌లు పొంత‌నే ఉండ‌దు. కానీ.. ఇందుకు భిన్నంగా తాము చాలా చేసిన‌ట్లుగా క‌మ‌ల‌నాథులు చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది.

అక్క‌డెక్క‌డో ఢిల్లీలో ఉన్న క‌మ‌ల‌నాథులు క‌వ‌రింగ్ మాట‌లు చెప్ప‌టాన్ని ఎంతోకొంత అర్థం చేసుకోవ‌చ్చు. కానీ.. ఏపీలోనే ఉంటూ.. నిత్యం ఏపీ ప్ర‌జ‌లు.. ఏపీ ప్ర‌భుత్వం ప‌డుతున్న క‌ష్టాల్ని చూస్తూ కూడా.. నిధుల కోసం కేంద్రం మీద ఒత్తిడి చేయ‌టం వ‌దిలేసి.. ఏపీ స‌ర్కారు మీద క‌స్సుమ‌నటం క‌నిపిస్తుంది. ఇదంతా చూసిన‌ప్పుడు. సీమాంధ్ర బీజేపీ నేత‌లు ఏపీ వారేనా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు.