Begin typing your search above and press return to search.

బాబు పాల‌న ఫ‌లితం..ఎంద‌రికో ఆత్మ‌హ‌త్య‌లే శర‌ణ్యం

By:  Tupaki Desk   |   7 Oct 2018 1:12 PM GMT
బాబు పాల‌న ఫ‌లితం..ఎంద‌రికో ఆత్మ‌హ‌త్య‌లే శర‌ణ్యం
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు పాల‌న సాగుతోంద‌ని బీజేపీ నేత‌లు మండిప‌డ్డారు. బాబు పాల‌న ఫ‌లితంగా ప్ర‌జ‌లు ఆత్మ‌హ‌త్య‌ల‌ను ఆశ్ర‌యిస్తున్నార‌ని ఆక్షేపించారు. బీజేపీ రాష్ట్ర శాఖ‌ ఆధ్వర్యంలో ప్రజా ఆవేదన ధర్నా నిర్వహించిన సంద‌ర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేతలు చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అవినీతికి కేరాఫ్ అడ్రస్‌ గా మారిన చంద్రబాబు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు కృత నిశ్చయంతో వున్నారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ఎన్నో హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబు వాటిని తుంగలోకి తొక్కి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. చివరకు తన తప్పు లేదంటూ అంతా కేంద్రం సహాయ నిరాకరణ వలనే జరిగిందంటూ చంద్రబాబు పేర్కొనడం పచ్చి దగా అంటూ ఆరోపించారు. అన్ని రంగాల్లో అవినీతి తారాస్థాయికి చేరిపోయిందని - ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హత చంద్రబాబుకు లేదంటూ విమర్శించారు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు త‌న‌ను కాపాడాల‌ని గ‌గ్గోలు పెడుతున్నార‌ని పురంధీశ్వ‌రి పేర్కొంటూ ప్రజలే తనకు రక్షణగా నిలవాలని అని చెబుతున్న సీఎం చంద్రబాబు - ఇక ప్రజలను ఎలా కాపాడుతారని - వారికి ఏవిధంగా రక్షణ కల్పిస్తారని ఆమె ప్రశ్నించారు. ఐటీ దాడుల గురించి చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చిత్రంగా ఉన్నాయ‌ని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ప్రజా సాధికార సర్వే పేరుతో రెండు లక్షల మందికి మాత్రమే నిరుద్యోగ భృతి కల్పించడం సరికాదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2014లో తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా - 10 సంవత్సరాలపాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన చంద్రబాబు నేతృత్వంలో విభజనాంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందన్న ఆశతో ప్రధాని నరేంద్రమోడీ ఎన్‌ డీఏలోకి ఆయనను తీసుకోవడం జరిగిందన్నారు. ఏపీ ప్రజలు కూడా నరేంద్రమోడీ ప్రధానిగా ఉంటే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశ్యంతో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేశారన్నారు. అయితే అన్నం పెట్టిన చెయ్యినే నరికే సహజగుణం ఉన్న చంద్రబాబు మరోసారి దాన్ని రుజువు చేస్తూ రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. ఆయన చేస్తున్న ధర్మపోరాట దీక్షలకు కారణాలు లేవని - అయితే తాము చేస్తున్న ప్రజా ఆవేదన ధర్నాలకు మాత్రం పలు కారణాలున్నాయని ఆయన పేర్కొన్నారు. 2015లో చంద్రబాబు ఆశీర్వాదంతో ప్రారంభమైన అగ్రిగోల్డ్ సంస్థ దినదినాభివృద్ధి చెందుతుంటే ఆ ఆస్తులపై కనే్నసిన టీడీపీ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసి 40 లక్షల కుటుంబాలు మానసిక క్షోభకు గురయ్యే విధంగా సంస్థ పతనానికి కారణమైందని పేర్కొన్నారు. చంద్రబాబు తన ప్రచార దాహంతో గోదావరి పుష్కరాలు సందర్భంగా 27 మంది అన్యాయంగా మృతిచెందడానికి కారణమయ్యారని అన్నారు.

ఎమ్మెల్సీ సోమువీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా విజృంభిస్తుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారంటూ దుయ్యబట్టారు. లవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మట్టి పనుల నిర్వహణకు రూ.30 వేల కోట్లు ఖర్చు చేశామని ఏపీ ప్రభుత్వం చెబుతోందని, అంత పెద్ద మొత్తం ఖర్చు చేయకుండా టీడీపీ నేతలు జేబులు నింపుకున్నారన్నారు. అంగన్వాడీలోని కోడిగుడ్లు మొదలుకుని పలు ప్రభుత్వ పథకాల అమలు బాధ్యతలను టీడీపీ వారికే కాంట్రాక్ట్ అప్పగించి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారన్నారు.చంద్రబాబు అసమర్ధ పాలన - హిందుత్వ వ్యతిరేకత వలన ఎంతోమంది పూజారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. రైతురుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు వంటి కార్యక్రమాలకు మంగళంపాడారని చెప్పారు. ప్రభుత్వ అసమర్ధత కారణంగా విద్యార్ధుల స్కాలర్‌షిప్‌లకు చెందిన 70 కోట్ల రూపాయలు మురిగిపోయాయని విమర్శించారు.