Begin typing your search above and press return to search.

తెలుగు బీజేపీ నేత‌ల‌పై కొత్త అంచ‌నా

By:  Tupaki Desk   |   22 May 2016 7:19 AM GMT
తెలుగు బీజేపీ నేత‌ల‌పై కొత్త అంచ‌నా
X
తెలుగు రాష్ట్రాలకు చెందిన బిజెపి అగ్రనేతల భవితవ్యంపై తర్జనభర్జన జరుగుతోంది. బీజేపీకి చెందిన‌ తెలుగు అగ్ర‌నేత‌లు ముప్పవరపు వెంకయ్యనాయుడు - నిర్మ‌ల సీతారామ‌న్‌ - రాంమాధ‌వ్‌ ల‌కు రాజ‌కీయంగా ఎలాంటి యోగం ప‌డుతుంద‌నే చ‌ర్చ ఢిల్లీ రాజ‌కీయాల్లో జోరుగా సాగుతోంది. రానున్న రాజ్యసభ ఎన్నికల్లో వారిలో ఎంతమందికి సీట్లు వరిస్తాయి? ఎవరిని కేంద్రంలో తీసుకుంటారు? ఎవరికి పార్టీ పదవి అప్పగిస్తారన్న అంశంపై పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

వచ్చేనెలలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నేత - కేంద్రమంత్రి వెంక‌య్య‌నాయుడు భవిష్యత్తు ఏమిటన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆయనకు 3సార్లు రాజ్యసభకు అవకాశం ఇచ్చారు. పార్టీ నిబంధన ప్రకారం ఇప్పటివరకూ ఇద్దరు - ముగ్గురుకు మినహా ఎవరికీ నాలుగవ దఫా రాజ్యసభ ఇచ్చిన దాఖలాలు లేవని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నారు. మరి వెంకయ్య విషయంలో ఏమైనా మినహాయింపు ఉంటుందా చూడాలంటున్నారు.

ఇప్పటి పరిస్థితిలో ఆయన అవసరం ఉన్నందున, తిరిగి రాజ్యసభకు ఎంపిక చేయడం ఖాయమని ఒకవర్గం వాదిస్తోంది. ఆ ప్రకారంగా మధ్యప్రదేశ్ - కర్నాటక రాష్ట్రాల నుంచి ఒకచోట వెంకయ్యకు సీటు ఇస్తారంటున్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఇచ్చే అవకాశాలే ఎక్కువంటున్నారు.

మ‌రోవైపు ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న నిర్మలాసీతారామన్‌ కు ఈసారి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది. ఆమెకు జాతీయ ఉపాధ్యక్ష పదవితో పాటు అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పగించవచ్చంటున్నారు. ఈసారి బిజెపికి రాజ్యసభ సీటు ఇచ్చే ప్రతిపాదన ఏమీ లేదని - టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తన ఢిల్లీ పర్యటనలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకారంగా చూస్తే ఆమెకు రాష్ట్రం నుంచి పొడిగింపు లేనట్లే కనిపిస్తోంది. ఆఖరి నిమిషంలో ఏమైనా అనూహ్య మార్పులు జరిగితే చెప్పలేమంటున్నారు.

మ‌రోవైపు రాష్ట్రానికి చెందిన జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ కు ఈసారి రాజ్యసభతోపాటు - కేంద్రమంత్రి పదవి కూడా ఖాయమన్న చర్చ గత కొద్దికాలం నుంచి పార్టీ వర్గాల్లో విస్తృతస్థాయిలో జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లో ఒక చోట ఆయనకు సీటు ఇచ్చి - కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు విదేశాంగశాఖ సహాయ శాఖ ఇవ్వవచ్చన్న ప్రచారం గత కొంత కాలం నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఈనెల ఇరాన్ పర్యటనకు వెళ్లనున్నారని, ఆయన తిరిగి వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటరీబోర్డు సమావేశంలో రాజ్యసభ అభ్యర్ధులపై చర్చించి, అభ్యర్ధులను ఖరారు చేస్తారని పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.