Begin typing your search above and press return to search.

సీమాంధ్రుల‌కు ఏపీ బీజేపీ నేత‌ల అవ‌మానం

By:  Tupaki Desk   |   9 Sep 2016 7:47 AM GMT
సీమాంధ్రుల‌కు ఏపీ బీజేపీ నేత‌ల అవ‌మానం
X
కోట్లాది మంది సీమాంధ్రులు క‌డుపు ర‌గిలిపోతున్న వేళ‌.. వారి మ‌నోభావాల్ని దెబ్బ తీసేలా.. వారి బాధ‌ను ప‌ట్టించుకోకుండా.. వేద‌న‌ను వినిపించుకోకుండా త‌మకు న‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఏపీ బీజేపీ నేత‌లు వైఖ‌రి ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గా మారింది. విభ‌జ‌న‌లో భాగంగా ఏపీకి ఇవ్వాల్సిన హోదాను ఇచ్చే విష‌యంలో రెండున్న‌రేళ్ల‌కు పైగా నాన్చిన కేంద్ర స‌ర్కారు ఇప్పుడు అందుకు భిన్నంగా ప్యాకేజీ అంటూ చేసిన ప్ర‌క‌ట‌న‌పై ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు.

ఏపీ ప్ర‌యోజ‌నాలకు ఏ మాత్రం స‌హ‌క‌రించేలా లేని ప్యాకేజీని అహా.. ఓహో అంటూ బీజేపీ నేత‌లు జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్నారు. ప్యాకేజీ ప్ర‌క‌టించిన అరుణ్ జైట్లీ.. ఆయ‌న ప‌క్క‌నే కూర్చున్న వెంక‌య్య‌లు ఏపీకి ఇచ్చిన ప్యాకేజీల గురించి చెప్పుకుంటున్న గొప్ప‌లు అన్నీఇన్నీ కావు. మొద‌ట్లో ఈ అంశంపై పెద్ద‌గా రియాక్ట్ కాని ఏపీ బీజేపీ నేత‌లు తాజాగా కాస్త భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం గ‌మ‌నార్హం. ఏపీకి చెందిన క‌మ‌ల‌నాథులు ప‌లువురు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఏపీకి ప్ర‌క‌టించిన ప్యాకేజీపై వెంక‌య్య‌కు స్పెష‌ల్ థ్యాంక్స్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన వెంక‌య్య.. కేంద్ర స‌హ‌కారం లేకుండా ఏపీ కోలుకోలేద‌న్న వ్యాఖ్య‌ను చేయ‌టంతో పాటు.. రైల్వే జోన్ విష‌యంలో కేంద్రం ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. ప్ర‌త్యేక హోదా అంశాన్ని విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌ర్చ‌ని విష‌యాన్ని ప్ర‌స్తావించిన వెంక‌య్య‌.. ఏపీకి అన్నివిధాలుగా సాయం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజీ మీద వ‌స్తున్న విమ‌ర్శ‌ల్ని గ‌ట్టిగా తిప్పి కొట్టాలంటూ ఏపీ బీజేపీ నేత‌ల్ని వెంక‌య్య కోరారు. ఇప్ప‌టివ‌ర‌కూ కేంద్రం అమ‌లు చేసిన హామీల్ని ఏపీ ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు. నిజంగానే ఏపీకి అంత‌మేలు చేసే ఉద్దేశ‌మే కేంద్రానికి ఉండి ఉంటే.. రైల్వే జోన్ మీద ఇంకా ఎందుకు నిర్ణ‌యం తీసుకోన‌ట్లు? ఒక్క జోన్ విష‌యంలోనే కాదు.. ప్యాకేజీకి సంబంధించి వెల్లువెత్తుతున్న ఎన్నో సందేహాల మీద బీజేపీ నేత‌లు సూటిగా స‌మాధానాలు చెప్ప‌లేని ప‌రిస్థితి. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ గురించి మీడియా వివ‌రంగా క‌థ‌నాలు ఇచ్చిన త‌ర్వాత కూడా త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతుందంటూ వెంక‌య్య లాంటోళ్లు చెప్ప‌టంలో అర్థం లేదు.

ఏపీకి ఇచ్చిన ప్యాకేజీ ఏమిటి? అందులోని అంశాల గురించి అర్థం చేసుకోలేనంత అమాయ‌కత్వంలో ఏపీ ప్ర‌జ‌లు లేర‌న్న విష‌యాన్ని బీజేపీ నేత‌లు అర్థం చేసుకొని ఉంటే మంచిది. ఏపీకి ఇవ్వాల్సిందేమిటి? ఇచ్చిందేమిట‌న్న విష‌యంలో సీమాంధ్రుల‌కు స్ప‌ష్ట‌త ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. మ‌సిపూసి మారేడు కాయ చేద్దామ‌న్న‌ట్లుగా వెంక‌య్యాలాంటి వాళ్లు ప్ర‌య‌త్నించ‌టం ఏమిటి? దానికి తందానా అన్న‌ట్లుగా ఏపీ బీజేపీ నేత‌లు త‌ల ఊపుతూ వెంక‌య్య‌ను పొగిడేస్తున్న తీరు చూసిన‌ప్పుడు.. ఏపీ క‌మ‌ల‌నాథుల‌కు ఏపీ ప్ర‌జ‌ల కంటే కూడా త‌మ అధినాయ‌క‌త్వ‌మే ముఖ్య‌మ‌న్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు. సీమాంధ్రుల‌కు ఇంత‌కు మించిన అవ‌మానం ఇంకేం ఉంటుంది..?