Begin typing your search above and press return to search.

టార్గెట్ ఏపీః ముందు షా, తర్వాత మోడీ

By:  Tupaki Desk   |   24 Nov 2016 5:30 PM GMT
టార్గెట్ ఏపీః ముందు షా, తర్వాత మోడీ
X
ఆంధ్రప్రదేశ్‌ లో పార్టీ బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా ముందుగా పార్టీ జాతీయ అధ్యకుడు అమిత్ షా - అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. అంతేకాకుండా భారీ బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌సంగించ‌నున్నారు. వ‌చ్చే ఎన్నికల నాటికి ఉత్తరాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలం తగ్గుతుందనే అంచనాలకు వ‌చ్చిన కమల నాథులు అక్కడ తగ్గే బలాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో పూరించుకోవాలని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బలం పెంచుకుంటే మరోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవచ్చనేది బీజేపీ అధిష్టానం ఆలోచనగా చెపుతున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ కంటే ప‌ట్టున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోనే మ‌రింత బ‌లం పెంచుకోవ‌డం కీల‌క‌మ‌ని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాపై నెలకొన్న పరిస్థితులు..అధికార తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతపై ప్రత్యేకంగా అధిష్టానం పెద్దలు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఈ నెల 26న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించే రైతు సదస్సుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రానున్నారు. గత మార్చి 6న రాజమండ్రిలో జరిగిన భారీ బహిరంగ సభలో కూడా అమిత్‌ షా పాల్గొన్నారు. తిరిగి అనతి కాలంలోనే జరుగుతున్న సదస్సుకు అమిత్‌ షా హాజరు ప్రత్యేకతను సంతరించుకుంది. ఇంత తక్కువ వ్యవధిలో మరే ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగిన సభలకు అమిత్‌ షా హాజరుకాలేదని పార్టీ వర్గాలే చెప్పడం విశేషం. ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రానికి చేకూరే లబ్దిని సదస్సు ద్వారా వివరించడంతో పాటు పార్టీ కోర్‌ కమిటీని ప్రత్యేకంగా సమావేశ పరచి అమిత్‌ షా దిశా నిర్థేశం చేయనున్నారు. పెద్దనోట్ల రద్దుపై వస్తున్న విపక్షాల ఆరోపణలకు - ప్రజల్లో నెలకొన్న సందేహాలకు కూడా ఈ సదస్సు ద్వారా గట్టి సమాధానం చెప్పాలని భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జరిగేది రైతు సదస్సే అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులను - సానుభూతిపరులు - ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించాలని ఆయా జిల్లా పార్టీలకు ఆదేశాలు అందాయి.

ఇదిలాఉండ‌గా వచ్చే ఏడాది జనవరి 3న తిరుపతిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఇచ్చితీరతామంటూ తిరుపతి బహిరంగ సభలో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో మోడీ వాగ్దానం చేశారు. ఇప్పుడిదే అంశాన్ని విపక్షనేత జగన్మోహన రెడ్డి - జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పదేపదే ప్రస్తావిస్తున్నారు. తిరుపతి బహిరంగ సభ ద్వారా ప్రధాని మోడీ విపక్షాలపై ఎదురుదాడికి దిగనున్నట్టు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ప్రత్యేక ప్యాకేజీ - పెద్ద నోట్ల రద్దు సహా అన్ని ఆరోపణలకు - అనుమానాలకు ప్రధానితో చెక్‌ పెట్టించేందుకు పార్టీ నేతలు నిర్ణయించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/