Begin typing your search above and press return to search.

అధికార పార్టీలో కోవర్ట్ ఆప‌రేష‌న్‌

By:  Tupaki Desk   |   19 Aug 2016 7:37 AM GMT
అధికార పార్టీలో కోవర్ట్ ఆప‌రేష‌న్‌
X
అధికారం పంచుకుంటున్న‌ప్ప‌టికీ ఏపీలో మిత్ర‌ప‌క్షమో-ప్ర‌తిప‌క్షమో తెలియ‌ని గంద‌ర‌గోళంలో ప‌డిపోయిన బీజేపీ నేత‌లు కొత్త స‌మ‌స్య‌ను ఎదుర్కుంటున్నారని చ‌ర్చ న‌డుస్తోంది. రాష్ట్రంలో సెంటిమెంటుగా మారిన ప్రత్యేక హోదా - ప్యాకేజీ అంశంపై తెదేపా- కేంద్రం మధ్య ఏం జరుగుతోందో తెలియక ఏపీ బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. త‌మ పార్టీలోని కొంద‌రు నేత‌లే టీడీపీకి అనుగుణంగా కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ న‌డిపిస్తూ పార్టీని న‌ష్ట‌ప‌ర్చేలా చేస్తున్నార‌ని క‌మ‌ళ‌నాథులు మండిప‌డుతున్నారని అంటున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక ప్యాకేజీ మీద కేంద్రం కసరత్తు చేస్తోంద‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వెలువ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. మెరుగైన ప్యాకేజీ ఇవ్వడం ద్వారా - హోదా ప్రయోజనాలు నెరవేర్చాలని కేంద్రం యోచిస్తోంది. దాదాపు 10 రాష్ట్రాలు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఏపీకి హోదా ఇచ్చి పది రాష్ట్రాల్లో పార్టీని దూరం చేసుకునే పరిస్థితిలో లేమని తెదేపా నాయకత్వానికి బీజేపీ స్పష్టం చేసిందని అంటున్నారు. దానికి బదులు ప్యాకేజీపై మాట ఇచ్చిందని అందులో భాగంగా కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ - వెంకయ్యనాయుడు - తెదేపాకు చెందిన కేంద్రమంత్రి సుజనాచౌదరి గత కొద్దిరోజుల నుంచి జరుపుతున్న చర్చలు మీడియాలో ప్రముఖంగా చోటుచేసుకుంటున్నాయి. ఇది రాష్ట్ర బీజేపీ నేతలకు విస్మయం కలిగిస్తోంది. ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ వ్యవహారం అంతా కేవలం ఇద్దరు ముగ్గురు నేతల వ్యక్తిగత వ్యవహారంలా మారిందే తప్ప - దానికి సంబంధించి ఏం జరుగుతుందో త‌మ మాతృక అయిన ఆర్ ఎస్ ఎస్ నుంచి వచ్చి పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించే వారికి సైతం తెలియడం లేదని వారు వాపోతున్నారు.

ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ఆ విషయాన్ని ముందుగా రాష్ట్ర పార్టీకి సమాచారం ఇవ్వడం, దానిపై పార్టీ పరంగా ప్రచారం చేసి ప్రజలను మానసికంగా సన్నద్ధులను చేయడం - ఆ తర్వాత దాని క్రెడిట్‌ పార్టీ తీసుకోవడం వంటి రాజకీయ చర్యలు తీసుకోని వైనంపై రాష్ట్ర బీజేపీ సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాపై పార్టీని ముద్దాయిగా నిలబెడుతూ - ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీని పొగుడుతున్న తెదేపా నేతల వ్యూహంతో రాష్ట్రంలో పార్టీ ఎదిగే పరిస్థితి లేకుండా పోయిందని బీజేపీ నేతలు వాపోతున్నారు. ప్రత్యేక హోదాపై తమ పార్టీని దోషిగా నిలబెట్టడంలో తెదేపా విజయం సాధించిందని, ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీపై జరుగుతున్న చర్చలను కూడా తనకు అనుకూలంగా మలచుకుంటున్నా, తామేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని బీజేపీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సాగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం ప్యాకేజీపై తెదేపా పోరాడుతోందని, మరో నెలలో తెదేపా కృషి వల్ల ప్యాకేజీ వచ్చే అవకాశం ఉందంటూ కథనాలు వెలువరిస్తుంటే - ఇక ఆ అంశంలో తమ పాత్ర ఏమిటో తెలియక మౌనం వహించాల్సి వస్తోందని అగ్రనేతలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీపై జరుగుతున్న చర్చల్లో తమ పార్టీ అధ్యక్షుడు - ఎంపీ కూడా అయిన హరిబాబును ఎక్కడా భాగస్వామ్యం చేస్తున్నట్లు లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీపై జరుగుతున్న చర్చల్లో పార్టీ నేతలను కూడా భాగస్వామ్యం చేసినట్టయితే, ఆ క్రెడిట్ పార్టీకి దక్కుతుందని చెబుతున్నారు. అలాకాకుండా చర్చలను కేవలం ఇద్దరు ముగ్గురికి పరిమితం చేసి, క్రెడిట్‌ ను తెదేపాకు కట్టబట్టే రాజకీయం జరుగుతోందని పార్టీ అగ్రనేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీపై పార్టీపరంగా క్రెడిట్ ను తీసుకునేందుకు తమ పార్టీ అగ్రనేతలకే ఇష్టం లేనట్లుందని, ప్యాకేజీ ఘనత కూడా తెదేపా ఖాతాలో కలిపేందుకే కొందరు ఉత్సాహపడుతున్నారని అగ్రనేతలు అంత‌ర్గ‌తంగా వాపోతున్నారు.