Begin typing your search above and press return to search.

ఏపీలో రంగంలోకి బీజేపీ.. బాబుకు ఎసరే..

By:  Tupaki Desk   |   29 Sep 2018 2:30 PM GMT
ఏపీలో రంగంలోకి బీజేపీ.. బాబుకు ఎసరే..
X
ఏపీ రాజకీయాలపై బీజేపీ దృష్టి సారించినట్లు తెలిసింది. ఎలాగైనా పాగా వేయాలని వ్యూహాలు రచిస్తోంది. బీజేపీపై టీడీపీ - ఇతర పార్టీలు - వ్యక్తులు చేస్తున్న ప్రచారాలంతా అబద్ధమని తెలియజేప్పేందుకు సమాయత్తమవుతుంది. ఏపీలో జరుగుతున్న ప్రధాన పథకాలన్నింటికీ కేంద్రమే నిధులు సమకూరుస్తున్నట్లు చెబుతున్న ఆ పార్టీ నేతలు - ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి మనసులు గెలుచుకోవాలని రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే వైసీపీ పాదయాత్రలు చేపడుతుంగా - టీడీపీ ఇంటింటింటికి తెలుగుదేశం కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పవన్ ప్రజా పోరాట యాత్రలు చేస్తున్నారు. అలాగే బీజేపీ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ఇంటింటికి కార్యక్రమాన్ని నిర్వహించాలని డిసైడ్ అయ్యింది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలోనూ - నిధుల కేటాయింపులోనూ - విభజన చట్టం అమలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఏపీలోని టీడీపీ ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తుంది. బీజేపీతో జట్టు కట్టిన వారు రాష్ట్రానికి అన్యాయం చేసిన వారవుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను కూడా గమనిస్తున్న ప్రతిపక్ష - కొత్త పార్టీలు బహిరంగంగా జట్టు కట్టేందుకు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇటీవల జరిగిన బహిరంగ సభల్లో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తానని ప్రకటించి ఉన్నారు. రాఫెల్ - పెట్రో ధరలు - పెద్ద నోట్ల ఉప సంహరణను వైఫల్యాలుగా చూపుతూ దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ అధినాయకత్వం ఎదురు దాడి చేస్తూ వాస్తవ పరిస్థితిని వివరించేందుకు రాష్ట్రంలో బహిరంగ సభలు కూడా నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

అందులో భాగంగానే వచ్చే నెల 6వ తేదీ రాష్ట్రంలోని నెల్లూరులో - 15వ తేదీ అనంతపురం - 25వ తేదీ విశాఖ పట్టణంలో మెగా ధర్నాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాల మేరకు ఓ వైపు పార్టీని బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తూనే మరో వైపు వాస్తవ పరిస్థితులకు ప్రజలకు వివరించనున్నారు. ఆ మేరకు శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ శ్రేణులతో గుంటూరులో సమావేశమయ్యారు. అలాగే, రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తు లేకుండా అన్ని నియోజకవర్గ స్థానాల్లో పోటీ చేయాలని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచించిన వ్యక్తికే ముఖ్య మంత్రి పదవి ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఏ మేరకు రాష్ట్రంలో బీజేపీ జవసత్వాలు పోసుకుంటుందో కాలమే నిర్ణయించాలి.