Begin typing your search above and press return to search.

సినిమా రంగంలోకి ఏపీ బీజేపీ

By:  Tupaki Desk   |   9 July 2016 7:50 AM GMT
సినిమా రంగంలోకి ఏపీ బీజేపీ
X
ఏపీలో కమల వికాసం ఏ స్థాయిలో ఉందో తెలియదు కానీ ఏపీ బీజేపీ నేతల మెదళ్లు మాత్రం అద్భుతంగా వికసిస్తున్నాయట. ముఖ్యంగా నవ్యాంధ్ర ప్రదేశ్ కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అంతులేని సాయం గురించి ప్రజలకు వివరించడం ఎలా అన్న విషయంలో వారు ఇచ్చిన ఐడియా అదిరిపోయిందట. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. రైల్వే జోన్ ఊసెత్తకపోయినా.. పోలవరాన్ని మర్చిపోయినా.. అమరావతి నిర్మాణానికి పైసా విదల్చకపోయినా కూడా ఏపీకి ఎంతో చేస్తున్నామని చెప్పేందుకు ఒక సినిమా తీయాలని.. దాన్ని జనంలోకి రిలీజ్ చేయాలని ఏపీ బీజేపీ నేతలు తమ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు.

అమిత్ షాతో జరిగిన బీజేపీ కోర్ కమిటీ మీటింగులో ఏపీ పరిస్థితులపై కీలక చర్చ జరిగింది. తామెంత చేస్తున్నా ప్రజలు నమ్మడం లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కేంద్ర ఏమీ చేయడం లేదన్న టీడీపీ ప్రచారం ముందు మన ప్రచారం నిలవలేకపోతోందని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో కేంద్రం చేసిన సాయంపై ఒక షార్టు ఫిల్ము రూపొందించాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి చాలామంది నేతల నుంచి సానుకూల స్పందన వచ్చింది.

అయితే.. ప్రచారంలో ఆరితేరిపోయిన చంద్రబాబు ముందు బీజేపీ షార్టు ఫిల్ము ఎంతవరకు నిలబడుతుందన్నదే ప్రశ్న. సినిమా రంగంలో ఉన్నట్లే ఈ రాజకీయ చదరంగంలోనూ బీజేపీ ఎత్తుగడ విఫలం కాక తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. పెద్ద సినిమాల దెబ్బకు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకనట్లుగా ఇక్కడ కూడా చంద్రబాబు పవర్ ముందు బీజేపీ షార్టు ఫిల్ము ప్రజలకు చేరుతుందా అన్నది చూడాలి. ఇకపోతే ఈ సినిమాకు దర్శకత్వం ఎవరన్నది వంటివి చూడాలి. చంద్రబాబు ఇప్పటికే తన ప్రచారం కోసం పరుచూరి బ్రదర్స్ - అనంత్ శ్రీరాం వంటి సినీ రచయితల సహకారం తీసుకుంటున్నారు. అంతకుముందు బోయపాటి శ్రీను వంటి పెద్ద దర్శకుల హెల్పు కూడా తీసుకున్న సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా సినీ ప్రముఖులనే రంగంలోకి దించాల్సి ఉంటుంది మరి. అయితే.. లోకల్ స్టార్సును తెస్తారో లేదంటే ఏకంగా తమ అధిష్ఠానం అండతో బాలీవుడ్ దిగ్గజ దర్శకులనే తెస్తారో చూడాలి. ఇకపోతే.. ఈ బీజేపీ స్టోరీలో హీరోగా వెంకయ్యను పెడతారో లేదంటే మోడీనే హీరోగా చూపుతారో చూడాలి. బీజేపీ నేతలు హీరోలయైతే చంద్రబాబు విలన్ అనే అనుకోవాల్సి ఉంటుంది మరి. మొత్తానికి ఏపీలో ఎదగడానికి రాజకీయ దమ్ము చాలని బీజేపీ సినిమా రంగంలోకి దిగుతోందన్నమాట.