Begin typing your search above and press return to search.

ప‌రువు తీస్తున్న మోడీ భ‌జ‌న బ్యాచ్!

By:  Tupaki Desk   |   19 Aug 2018 7:07 AM GMT
ప‌రువు తీస్తున్న మోడీ భ‌జ‌న బ్యాచ్!
X
మోడీ బ్యాచ్ చెల‌రేగిపోతోంది. త‌న‌ను తాను వీరుడిగా.. శూరుడిగా భావించ‌టం త‌ప్పేం కాదు. కానీ.. అతిశ‌యోక్తిని మించిపోయేలా ఉంటే మొద‌టికే మోసం ఖాయం. సార్వత్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో ఎడెనిమిది నెల‌ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఏపీలో రాజ‌కీయం హాట్ హాట్ గా మారింది. అధికార‌.. విప‌క్ష నేత‌లు పోటాపోటీగా చేస్తున్న రాజ‌కీయ వ్యాఖ్య‌లు వాతావ‌ర‌ణాన్ని వేడెక్కించేస్తున్నాయి.

ఓప‌క్క తెలంగాణ‌లో ముంద‌స్తు (కేసీఆర్ దృష్టిలో ముంద‌స్తు కాద‌న్న మాట‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ప్ప‌టికీ)కు సిద్ధ‌మ‌వుతూ.. అందుకు త‌గ్గ గ్రౌండ్ రెఢీ చేసుకుంటుంటే.. ఏపీలో మాత్రం అధికారిక గ‌డువు ముగిసే వ‌ర‌కూ ఎన్నిక‌ల‌కు వెళ్లకూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో బాబు స‌ర్కార్ ఉంది. ఇప్ప‌టికే ప్ర‌జా వ్య‌తిరేక‌త విధానాల‌తో ఎదురుగాలి వీస్తున్న వేళ‌.. ముంద‌స్తుకు వెళితే.. మునిగిపోవ‌టం ఖాయ‌మ‌న్న ఆలోచ‌న‌లో బాబు బ్యాచ్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మారిన వాతావ‌ర‌ణానికి త‌గ్గ‌ట్లుగా బీజేపీ సైతం త‌న ప్ర‌చారానికి ప‌దును పెడుతోంది.

త‌న భ‌జ‌న బ్యాచ్ ను రంగంలోకి దింపి.. త‌నకు అనుకూల‌మైన స‌ర్వేల్ని వండి వార్చేలా చేస్తోంది. తాజాగా కొన్ని మీడియా సంస్థ‌లు ప్ర‌క‌టించిన స‌ర్వే ఫ‌లితాలు చూస్తే.. ఈ విష‌యం ఇట్టే అర్థమ‌వుతుంది. స‌ర్వేల్లో కాస్తో కూస్తో అటుఇటుగా ఉండ‌టాన్ని త‌ప్పు ప‌ట్ట‌లేం. కానీ.. స‌ర్వే చూసినోళ్లంతా ఎట‌కారం చేసుకుంటార‌న్న భ‌యం బొత్తిగా లేని వైనాన్ని చూస్తే.. మోడీ భ‌జ‌న సంఘం బ‌రితెగింపు ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.

ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా.. ఏపీలో పోటీ టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ మ‌ధ్య‌నే అన్న‌ది అంద‌రికి తెలిసిన ముచ్చ‌టే. ఇక‌.. జ‌న‌సేన అంతో ఇంతో ప్ర‌భావం చూపించినా.. ప‌రిమిత‌మైన స్థానాల్లో త‌ప్పించి ఇంకేమీ చేయ‌లేదు. ఇక‌.. బీజేపీ లాంటి పార్టీల‌న్నీ టుమ్రీనే. బీజేపీ బ‌లం ఎంత‌న్న‌ది 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్నే చూస్తే.. టీడీపీ.. జ‌న‌సేన పార్టీలు క‌లిసి బీజేపీకి అండ‌గా నిలిచి నాలుగు లోక్ స‌భ స్థానాల్లో బ‌రిలోకి దిగితే రెండింటిలో మాత్ర‌మే గెలిచింది.

అలాంటి పార్టీ ఏపీలో ఒంట‌రిగానో.. లేదంటో ఏదో ఒక పార్టీతో క‌లిసి పోటీ చేస్తే మాత్రం ఏడు లోక్ స‌భ స్థానాల్ని గెలుచుకోగ‌ల‌దా? త‌మ‌కు తోచిన‌ట్లుగా ఏపీని ముక్క‌లు చేసిన కాంగ్రెస్ కు ఆంధ్రోళ్లు ఎలాంటి షాకులిచ్చారో తెలిసిందే. అలాంటిది త‌మ‌కెంతో అవ‌స‌ర‌మైన ప్ర‌త్యేక హోదా విష‌యంలో మోడీ మాష్టారు ఎంత మూర్ఖంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విష‌యాన్ని గ‌డిచిన నాలుగున్న‌రేళ్లుగా చూస్తున్న ఆంధ్రోళ్లు ఆ పార్టీకి ఓటు వేస్తారంటారా?

వెంక‌న్న సాక్షిగా తిరుప‌తి మొద‌లు.. గుంటూరు.. విశాఖ‌ప‌ట్నం వేదిక‌ల మీద నుంచి తాను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తాన‌ని మోడీ చెప్పి.. ఇప్పుడు ఇవ్వ‌నంటే ఇవ్వ‌ను.. ఏం చేసుకుంటారో చేసుకోండ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న నేప‌థ్యంలో బీజేపీకి ఏపీలో ఓట్లు ప‌డే ఛాన్స్ ఉందా? అన్న ప్ర‌శ్న‌ను చిన్న‌పిల్లాడ్ని అడిగినా.. సీరియ‌స్ గా స్పందించే ప‌రిస్థితి. ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రావాళ్ల‌ను ఓట్లు అడుగుతారంటూ క‌డిగేసే తీరు ఇప్పుడు క‌నిపిస్తుంది.

వాస్త‌వ ప‌రిస్థితి ఇలా ఉంటే.. మోడీ భ‌జ‌న సంఘం మాత్రం కేంద్రంలో బీజేపీ కొలువు తీర‌టం ఖాయ‌మ‌ని.. ఇందులో భాగంగా ఏపీలో ఏడు స్థానాల్ని సొంతం చేసుకుంటాయ‌న్న త‌ల‌తిక్క స‌ర్వే ఫ‌లితాన్ని వెల్ల‌డించాయి. అక్క‌డెక్క‌డో ఢిల్లీలో కూర్చున్న మోడీషాలు ఈ అంకెల్ని చూసి సంతోష‌ప‌డొచ్చు. కానీ.. వాస్త‌వానికి పూర్తి భిన్నంగా ఉన్న లెక్క‌ల్ని చూసిన ఏపీ ప్ర‌జ‌లకు మాత్రం కాలిపోతోంది. అవున‌వును.. ఏడు సీట్లు ఇస్తాం.. ఇస్తాం.. హోదా విష‌యం హ్యాండిచ్చినందుకా? అంటూ ఎట‌కారం ఆడేస్తూ.. ఈసారి ఎన్నిక‌ల్లో బీజేపీకి క‌ర్రు కాల్చి తామేంటో చూపిస్తామ‌ని చెబుతున్నారు. ఆంధ్రోళ్ల‌ను దెబ్బ తీసినోడు బాగుప‌డిన వైనం చ‌రిత్ర‌లో లేద‌ని.. .ఇందుకు మోడీ సైతం మిన‌హాయింపు కాద‌ని వారంటున్నారు. మ‌రి.. ఇలాంటి శాప‌నార్థాలు మోడీషా చెవుల దాకా చేరుతున్నాయా?