Begin typing your search above and press return to search.

చంద్రబాబే టార్గెట్ గా బీజేపీ పాలిట్రిక్స్..

By:  Tupaki Desk   |   2 Jun 2018 6:41 AM GMT
చంద్రబాబే టార్గెట్ గా బీజేపీ పాలిట్రిక్స్..
X
రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు.. శత్రువు.. మిత్రుడవుతాడు.. మిత్రులు.. శత్రువులవుతారు.. నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన చంద్రబాబు బీజేపీతో విడిపోయారు. చట్టాపట్టాలేసుకొని తిరిగిన మోడీ-చంద్రబాబుల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఏకంగా మోడీని టార్గెట్ చేసి చంద్రబాబు ఎంత చేయాలో అంత చేస్తున్నాడు. ఏపీ ప్రజల్లో మరో కాంగ్రెస్ లా బీజేపీని మార్చేస్తున్నారు. పాత పగలో ఏమో కానీ.. చంద్రబాబు విషయంలో మోడీ పట్టుదలకు పోతున్నారు. టామ్ అండ్ జెర్రీలాగా వీరి మధ్య వైరం రోజురోజుకు ముదిరిపోతోంది.. ఇప్పుడు ఏపీలో టీడీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బీజేపీ చేయాల్సిందల్లా చేస్తోందని తాజాగా వెల్లడైంది.

బీజేపీ సీనియర్ నేత - పార్టీ ప్రధాన కార్యదర్శి ఒకరు శుక్రవారం రాత్రి ఢిల్లీలో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఏపీ - తెలంగాణ రాజకీయాలపై స్పందించారు.. ‘ఏపీలో ఎవరు గెలిచినా.. తెలుగు దేశం పార్టీని మాత్రం అధికారంలోకి రానివ్వం. ఇక తెలంగాణలో కాంగ్రెస్ కు విజయం దక్కకుండా ఏమైనా చేస్తాం’ అని తమ పార్టీ వైఖరిని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాదు టీడీపీ-బీజేపీ విడిపోవడం వెనుక జరిగిన తంతును వివరించారు.. ఏన్డీఏ నుంచి టీడీపీ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆపకపోవడం వెనుక కారణాలను వివరించారు. టీడీపీ వైఖరి నచ్చకే అది వెళ్లిపోవాలని బీజేపీ కూడా కోరుకుందని.. అందుకే అలా ప్రవర్తించామని వివరించారు. అంతేకాదు.. ‘చంద్రబాబును నిజంగా బీజేపీ కావాలనుకుంటే అప్పుడే ఆపగలిగే వాళ్లం కదా’ అని ఆయన వ్యాక్యానించారు.

అంతేకాదు 2019లో చంద్రబాబు శీర్షాసనం వేసినా ముఖ్యమంత్రి కారని.. అప్పటికీ ఏపీని ఏం చేయాలో వ్యూహరచన చేశామని బీజేపీ ముఖ్యుడు వ్యాక్యానించారు. దీనికోసమే పాత బీజేపీ అధ్యక్షుడిని రాజీనామా చేయించి.. కొత్త బీజేపీ అధ్యక్షుడిగా కన్నాను నియమించామన్నారు. 2019కు ముందు కాంగ్రెస్ కు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అనేకమంది నేతలను బీజేపీలో కలుపుకుంటామని.. ఏపీలో కాంగ్రెస్ మొక్క కూడా మొలవకుండా చేస్తామని ఆయన చెప్పారు. టీడీపీ నుంచి ఇతర పార్టీల నుంచి పలువురిని కలుపుకొని 1984లో ఏపీలో ఎలా సంక్షోభం సృష్టించామో అలా చేసి చంద్రబాబుకు అధికారం దక్కకుండా చేస్తామని ఆయన సీక్రెట్ విషయాలు చెప్పుకొచ్చారు. ఇలా చంద్రబాబును ఏపీలో అధికారంలో రాకుండా బీజేపీ ఏం చేయగలదో ఆ బీజేపీ ముఖ్యుడు విలేకరులతో ఇన్ సైడ్ గా వ్యాక్యానించారు. ఈ విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.