Begin typing your search above and press return to search.

త్రిశంకు స్వ‌ర్గంలో ఏపీ బీజేపీ

By:  Tupaki Desk   |   16 Sep 2016 6:42 AM GMT
త్రిశంకు స్వ‌ర్గంలో ఏపీ బీజేపీ
X
ఏపీలో బీజేపీ క‌ష్టాల‌ను కొని తెచ్చుకుంటోందా? ఏరి కోరి ప్ర‌జ‌ల‌కు దూరం కావాల‌ని భావిస్తోందా? త‌్రిశంకు స్వ‌ర్గంలో వేలాడేలా ప‌క్కాప్లాన్‌ తో ముందుకు వెళ్తోందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. రాష్ట్ర విభ‌జ‌నతో అటు తెలంగాణ‌ - ఇటు ఏపీల్లో ఎద‌గాల‌ని ఈ జాతీయ పార్టీ భావించింది. ఈ క్ర‌మంలో టీడీపీతో జ‌త‌క‌ట్టి 2014లో ఎన్నిక‌ల‌కు వెళ్లి నాలుగంటే నాలుగు చోట్ల విజ‌యం సాధించింది. చంద్ర‌బాబుతో పొత్తులో భాగంగా రాష్ట్ర మంత్రి వ‌ర్గంలో రెండు సీట్లు కూడా సంపాదించింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో టీడీపీ - బీజేపీల మ‌ధ్య అంత‌రం పెరుగుతూ వ‌స్తోంది. దీనిక‌న్నా ముందు కేంద్రం త‌మ‌కు నిధులు ఇవ్వ‌డం లేద‌ని చంద్ర‌బాబు ప‌దేప‌దే ప్ర‌చారం చేయ‌డం బీజేపీ నేత‌ల‌కు ఎక్క‌డో కాలేలా చేసింది.

దీంతో స్టేట్ బీజేపీ నేత‌లు టీడీపీపై గుర్రుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆ పార్టీ సీనియ‌ర్ నేత పురందేశ్వ‌రి.. ఇటీవ‌ల లెక్క‌లు చెప్పాలంటూ చంద్ర‌బాబుపై ఫైర‌య్యారు. ఆ త‌ర్వాత ప్ర‌త్యేక హోదా విష‌యం ఈ రెండు పార్టీల మ‌ధ్య మ‌రింత చిచ్చురేపింది. కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీకే సెటిల్ అవ్వ‌డం - ఏపీలో హోదాపై సెంటిమెంట్ పెరిగిపోవ‌డం వంటి కారణాలు రెండు పార్టీల మ‌ధ్య చిచ్చుకు కార‌ణ‌మయ్యాయి. దీంతో ఎప్ప‌టి నుంచో తాము సొంతంగా ఎద‌గాల‌ని భావిస్తున్న బీజేపి నేత‌లు.. ఈ ఛాన్స్‌ ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని భావిస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి రాంరాం ప‌ల‌కాల‌ని భావిస్తున్నారు. అయితే, ఒంట‌రిగా విజ‌యం సాధించ‌డం బీజేపీకి అంత వీజీనా? అంటే దీనిపై ఆ పార్టీ నేత‌ల‌కే క్లారిటీ లేదు.

పోనీ చంద్ర‌బాబును వ‌దిలేస్తే.. ఇంకెవ‌రితోనైనా జ‌త‌క‌ట్టి జైకొట్టించుకునే ఛాన్స్ ఉందా? అంటే.. అదికూడా మిలియ‌న్ డాల‌ర్ల కొశ్చ‌న్‌ గానే ఉండిపోయింది. ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న పార్టీల‌ను చూస్తూ..జ‌గ‌న్ నేతృత్వంలోని వైకాపా - ప‌వ‌న్ నేతృత్వంలోని జ‌న‌సేన బ‌లంగా ఉండే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ రెండు పార్టీల్లో ప‌వ‌న్ వైఖ‌రిలో ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చేసింది. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోతే ప్ర‌ధానిని సైతం ప్ర‌శ్నిస్తాన‌ని ఆయ‌న అన్నారు. అంతేకాకుండా వెంక‌య్య‌పై ఇప్ప‌టికే అనేక ఆరోప‌ణ‌లు సంధించారు. దీంతో బీజేపీకి, జ‌న‌సేన‌కి పొత్తు కుద‌ర‌ద‌ని అర్థ‌మైపోయింది. ఇక‌, వైకాపా.. అది కూడా బీజేపీతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగే ప‌రిస్థితిలేదు.

పోనీ - కామ్రెడ్ల‌తో జ‌త‌క‌డ‌దామా? అంటే ఈ రెండు పార్టీల‌దీ జాతి వైరం లాంటిది. ఇక ఆఖ‌రికి మిగిలింది కాంగ్రెస్‌. అస్స‌లు ఇది సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. మ‌రి ఏపీలో బీజేపీ ప‌రిస్థితి ఏంటి? అంటే పేద్ద క్వ‌శ్చ‌న్ మార్కే క‌నిపిస్తోంది. మ‌రో రెండేళ్ల‌లో ఏపీలో ఎన్నిక‌లు ముంచుకొస్తున్న‌వేళ‌.. తాము సొంతంగా ఎద‌గాల‌న్న రాష్ట్ర క‌మలం నేత‌ల ప్లాన్ ఎలాంటిదో వారికే అంతుప‌ట్ట‌డం లేద‌ని తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో ఇటు చంద్ర‌బాబును వ‌దులుకుని, అటు వేరే వాళ్ల‌తో జ‌త‌క‌ట్ట‌లేక‌.. మొత్తానికి బీజేపీ త్రిశంకు స్వ‌ర్గంలో ఊగిస‌లాడ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో ఇప్పుడున్న నాలుగు సీట్లు కూడా నిల‌బెట్టుకునే ఛాన్స్ లేద‌ని అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు!