Begin typing your search above and press return to search.

ఏపీ క్యాబినెట్ లో బాబు బ్యాచ్ డిసైడ్ చేసిందేంది?

By:  Tupaki Desk   |   7 Sep 2016 5:07 AM GMT
ఏపీ క్యాబినెట్ లో బాబు బ్యాచ్ డిసైడ్ చేసిందేంది?
X
ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్వహించింది. అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అయితే.. ఈ సమావేశంలో పలుకీలక నిర్ణయాలు తీసున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ.. మండలి సమావేశాల సందర్భంగా ప్రవేశ పెట్టాల్సిన నాలుగు బిల్లుల్ని డిసైడ్ చేయటం దగ్గర నుంచి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఏపీ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్న నిర్ణయాల వివరాల్లోకి వెళితే..

ఏపీ ఐటీకి మరింత ఉత్సాహాన్నిచ్చేలా ఆ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో(ఉత్తరాంధ్ర.. కోస్తా.. రాయలసీమ) నాలుగు భారీ టవర్లను ప్రభుత్వ.. ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కనీస అద్దె హామీని ప్రభుత్వం ఇచ్చేలా తీసుకున్న ఈ నిర్ణయంలో భాగంగా ఉత్తరాంధ్రలో విశాఖ.. కోస్తా ప్రాంతానికి చెందిన విజయవాడ.. రాయలసీమకు చెందిన అనంతపురం.. తిరుపతిలలో ఈ కొత్త ఐటీ టవర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఒక్కో టవర్ లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ టవర్లను ఏర్పాటు చేయనుండటం గమనార్హం.

కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకూ ఇళ్లు.. పారిశ్రామిక అవసరాలకు గ్యాస్ ను ఇళ్లకే సరఫరా చేసేందుకు వీలుగా కాకినాడలో భారీ గ్యాస్ నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. రూ.1,010 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ గ్యాస్ నిల్వ కేంద్రానికి గెయిల్ (కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ) 50 శాతం.. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన ఏపీఐఐసీ.. జెన్ కోలు మిగిలిన 50 శాతం భాగస్వామ్యం కలిగి ఉండాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో దాదాపు 80 శాతం రుణంగా తీసుకోనున్నారు.

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం పాలకొలను.. మరోపది గ్రామాల పరిదిలోని 7214 ఎకరాల పరిశ్రమలహబ్ ను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. అదే సమయంలో విశాఖలోని దుప్పిటూరులో 61.6 ఎకరాల సెజ్ విస్తరణకు ఒక్కోఎకరానికి రూ.12 లక్షలు చొప్పున కేటాయింపు. ఎలక్ట్రానిక్ విధానంలో ఐవోటీ విధానం విలీనం చేయాలన్నదిశగా నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. మరికొన్ని అంశాల మీద కూడా అసెంబ్లీలోబిల్లుల రూపంలోపెట్టాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఒకే భూమిని ఇద్దరు రిజిష్టరు చేయటానికి వీలు లేకుండా చట్ట సవరణతో పాటు.. పర్యాటక ప్రాంతాల్లో ఉండే ఫైవ్ స్టార్.. త్రీ స్టార్ హోటళ్లలో వ్యాట్ ను 14.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలన్న నిర్ణయం.. మొబైల్ ఫోన్లపై కూడా వ్యాట్ ను 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం.. జీఎస్టీ బిల్లును ఏపీ అసెంబ్లీ మద్దతు ఇస్తూ నిర్ణయం తీసుకోవటంతో పాటు.. ప్రైవేటు కళాశాలల్ని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మార్చేందుకు వీలుగా బిల్లును పెట్టాలని ఏపీ సర్కారు భావిస్తోంది.