Begin typing your search above and press return to search.

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలు ఇవే!

By:  Tupaki Desk   |   12 Feb 2020 9:28 AM GMT
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలు ఇవే!
X
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల పై చర్చ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని కుదించడంతో పాటు - ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడడం - డబ్బులు - మద్యం పంచుతూ పట్టుబడడం - అందులో ఏ ఒక్కటి రుజువైనా కూడా కఠిన చర్యలు తీసుకునేలా - అలాగే అభ్యర్థులను ఎన్నిక నుండి డిస్‌ క్వాలిఫై చేసేలా పంచాయతీరాజ్ చట్టంలో కీలక సవరణలు తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే మార్చి 15 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు.

అలాగే , సర్పంచ్ లకే పారిశుద్ధ్యం - పచ్చదనం బాధ్యతలు అప్పగించనున్నారు. స్థానిక నివాసం ఉన్నవారికే సర్పంచ్ పదవికి అర్హులని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అలాగే ఎవరైనా కూడా నేరాలకు పాల్పడితే గరిష్టంగా మూడేళ్ళ వరకు జైలుశిక్ష విధించనున్నట్టు మంత్రి తెలిపారు.

కాగా, పంచాయతీ ఎన్నికలకు 5 రోజులు మాత్రమే ప్రచారం నిర్వహించాలని పేర్ని నాని చెప్పారు. ఎంపీటీసీ - జడ్పీటీసీ ఎన్నికలకు 8 రోజులు ప్రచారం నిర్వహించాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సర్పంచ్ - ఎంపీటీసీ - జడ్పీటీసీ పదవులకు గిరిజనులే అర్హులని చెప్పారు. ఇక, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది కేబినెట్. వచ్చే శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును పెట్టాలని నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తరువాత బడ్జెట్ సమావేశాలని నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ఈ భేటీలో జగనన్న విద్యా కానుక కింద బ్యాగ్ - యూనిఫామ్ - బూట్లు - నోట్ పుస్తకాలు ఇవ్వాలనే అంశంపై కూడా చర్చించారు. అలాగే జెన్ కో ఆధ్వరంలో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.