Begin typing your search above and press return to search.

క్యాబినెట్ మీటింగ్ అంతా భూముల మీదేనా?

By:  Tupaki Desk   |   6 Sep 2015 5:06 AM GMT
క్యాబినెట్ మీటింగ్ అంతా భూముల మీదేనా?
X
మరో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. అయితే.. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశానికి.. గతంలో జరిగిన వారికి మధ్య కాస్తంత వ్యత్యాసం ఉంది. ఈ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో చాలావరకూ భూమి.. భూమితో సంబంధం ఉన్న అంశాలపైనే నిర్ణయాలు తీసుకోవటం విశేషం.

ఓపక్క ఏపీ రాజధాని భూములకు సంబంధించి భూసమీకరణ.. భూసేకరణ ఇష్యూలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న సర్కారు.. తాజాగా భూమికి సంబంధించిన అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకోవటం కాస్తంత ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అభివృద్ధి కార్యక్రమాలకు భూమితో సంబంధం లేకుండా సాగన్నట్లుగా ఏపీ సర్కారు తీరు ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. భూమి సంబంధిత అంశాలు తెరపైకి వచ్చిన వెంటనే.. వివాదాలు ముసురుకుంటాయని.. భూమికి సంబంధించిన అంశాలపై తొందరపాటు పనికిరాదని.. కానీ బాబు సర్కారు అలాంటివి పట్టించుకునే స్థితిలో లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తాజాగా ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో భూమి సంబంధించి అంశాల్ని ఒక్కసారి పరిశీలిస్తే..

= మచిలీపట్నం పోర్టు అభివృద్ధి కోసం 2010లో మచిలీపట్నం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ తో చేసుకున్న ఒప్పందాన్ని పొడిగించారు. పోర్డు కోసం 5,324 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ఇప్పటివరకూ 524 ఎకరాలు మాత్రమే సేకరించారు. మిగిలిన భూమిని 36 నెలల్లో సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ రాజధాని కోసం భారీ ఎత్తున భూమిని సేకరించిన తర్వాత ఇదే పెద్ద సేకరణ అయ్యే అవకాశం ఉంది. ఈ భూముల్ని సేకరిస్తారా? సమీకరిస్తారా? అన్నది ప్రశ్న అయితే.. వీలైనంత వరకూ సమీకరణకే వెళతామని సీఎం చంద్రబాబు చెప్పటం గమనార్హం.

= విశాఖపట్నం భీమిలి మండలం కాపులుప్పాడులో 2008లో ఎకరా రూ.20లక్షల చొప్పున యూనిటెక్ కంపెనీకి ఇచ్చిన భూమి కేటాయింపుల ఒప్పందాన్ని రద్దు చేశారు. 1750 ఎకరాలకు సదరు సంస్థ రూ.350కోట్లు చెల్లించాల్సి ఉంటే.. కేవలం రూ.255కోట్లు మాత్రమే చెల్లించటంపై అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు.. ఒప్పందంలోని నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా ఆరోపించి నిర్ణయం తీసుకున్నారు.

= అనంతపురం జిల్లా పాలసముద్రం మండలంలో ఏపీఐఐసీ.. ఈఎంపీఐ ఇన్నోవేషన్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్.. తదితర కంపెనీల క్లస్టర్ ఏర్పాటుకు ఆమోదంతో పాటు.. 264.06 ఎకరాలు భూమి కేటాయింపు.

= తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన ప్రాంతంలో ఏపీఐఐసీ వద్ద ఉన్న 2,094.7 ఎకరాల భూమిని గతంలో కాకినాడ సెజ్ కోసం కేటాయించారు. అందులోనుంచి 505 ఎకరాలను దివి ల్యాబ్స్ కోసం కేటాయించారు.

= ఇదే సెజ్ లోని మిగిలిన 1589 ఎకరాలతోపాటు మరో 289 ఎకరాలుకలిపి కాకినాడ సెజ్ కు పారిశ్రామిక పార్కు అభివృద్ధి కోసం కేటాయించటం గమనార్హం.

= శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సర్వగ్రామంలో సప్తగిరి పవర్ ప్రాజెక్టు సంస్థ ఏర్పాటు చేసే కంపెనీ కోసం ఎకరా రూ.4.30లక్షలకు 9.96ఎకరాల కేటాయింపు.