Begin typing your search above and press return to search.

తెలంగాణ పొలిమేర‌ల వ‌ర‌కూ ఏపీ రాజ‌ధానే

By:  Tupaki Desk   |   21 Aug 2015 9:55 AM GMT
తెలంగాణ పొలిమేర‌ల వ‌ర‌కూ ఏపీ రాజ‌ధానే
X
హైద‌రాబాద్‌ ను త‌ల‌ద‌న్నేలా ఏపీ రాజ‌ధానిని నిర్మిస్తాన‌ని త‌ర‌చూ చెప్పే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు.. ఆ ప‌ని చేస్తారో లేదో కానీ.. ఏపీ రాజ‌ధాని విస్తీర్ణాన్ని మాత్రం పెంచేస్తున్నారు. తాజాగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం.. ఏపీ రాజ‌ధాని న‌గ‌రం.. తెలంగాణ పొలిమేర‌ల వ‌ర‌కూ రావ‌టం కాస్తంత విశేష‌మే.

పోలీసు.. శాంతిభ‌ద్ర‌త‌ల‌ను దృష్టిలో ఉంచుకొని తాజాగా ఏపీ రాజ‌ధాని ప‌రిధిని పెంచిన‌ట్లుగా ఏపీ స‌ర్కారు చెబుతోంది. ప్ర‌స్తుతం మార్చిన ప‌రిధి ప్ర‌కారం.. ఏపీ రాజ‌ధాని ప్రాంతం భారీగా పెర‌గ‌నుంది. పెంచిన ప‌రిధితో తెలంగాణ పొలిమేర‌ల‌కు కాస్త ద‌గ్గ‌ర‌గా ఉండే జ‌గ్గ‌య్య‌పేట కూడా ఏపీ రాజ‌ధాని కింద‌కు వ‌చ్చేయ‌నుంది.

జ‌గ్గ‌య్య‌పేట మున్సిపాలిటీ.. వ‌త్స‌వాయి మండ‌లాల‌ను రాజ‌ధాని ప‌రిధిలోకి తీసుకొస్తూ ఏపీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా ఏపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంతో.. తెలంగాణ రాష్ట్ర స‌రిహ‌ద్దు అయిన కోదాడ‌ను దాటి ఏపీలోకి ప్ర‌వేశించినంత‌నే ఏపీ రాష్ట్ర రాజ‌ధానిలో అడుగు పెట్టిన‌ట్లుగా ఉండ‌టం గ‌మ‌నార్హం. కృష్ణా జిల్లాలోని 58 మండ‌లాల‌ను రాజ‌ధాని ప‌రిధిలోకి తీసుకొచ్చారు. ఏడాపెడా ప్రాంతాల్ని రాజ‌ధాని ప‌రిధిలోకి తీసుకొచ్చేస్తే స‌రిపోతుందా? రాజ‌ధాని న‌గ‌రానికి ఉండాల్సిన హంగులు మాటేమిటి? చూస్తుంటే హంగులున్నా లేకున్నా.. భారీ రాజ‌ధాని అన్న పేరు ప్ర‌ఖ్యాతుల కోసం ఏపీ సీఎం చంద్ర‌బాబు తాప‌త్ర‌య‌ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.