Begin typing your search above and press return to search.

ఎకరం 5కోట్ల నుంచి కోటిన్నరకు !!

By:  Tupaki Desk   |   24 Aug 2015 5:27 AM GMT
ఎకరం 5కోట్ల నుంచి కోటిన్నరకు !!
X
ఏపీ రాజధాని కోసం భూములు ఇవ్వటానికి కొంతమంది రైతులు ఏ మాత్రం సుముఖంగా లేకపోవటం తెలిసిందే. పెనుమాక.. ఉండవల్లికి చెందిన రైతులు చెబుతుండటం తెలిసిందే. ప్రభుత్వం భారీ ప్యాకేజీలు ఇస్తున్నా వద్దంటున్న వారు.. ఎందుకలా అంటున్నారన్నది చాలామంది మదిలో మెదిలే ప్రశ్న. మరోవైపు తూళ్లురు ప్రజలు హారతులు ఇచ్చి మరీ.. తమ భూములు తీసుకోవాలంటూ పండగ వాతావరణంలో ఇచ్చేయటం ఏమిటి? అందుకు భిన్నంగా పెనుమాక.. ఉండవల్లి ప్రాంతాలకు చెందిన రైతులు ప్రాణాలైనా ఇస్తాం కానీ భూమి మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పటం ఎందుకు? అన్న ప్రశ్న రావటం మామూలే.

దీనికి వాళ్లు.. వీళ్లు కాకుండా ఉండవల్లి.. పెనుమాకకు చెందిన రైతులు కొందరు తాజాగా చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంత పర్యటన సందర్భంగా పలువురు రైతులు తమ భూముల్ని ఎందుకు ఇవ్వమో చెప్పుకొచ్చారు. వారి వాదన.. వారి మాటల్లోనే చూస్తే..

= తుళ్లూరు ప్రాంతంలో రాజధాని ప్రకటనకు ముందు ఎకరం రూ.8 నుంచి రూ.10 లక్షలు ఉండేది. ఇప్పుడు దాని విలువ రూ.1.5కోట్లు చేరింది. అందుకే ప్రభుత్వం వారికి ల్యాండ్ ఫూలింగ్ అని చెప్పిన వెంటనే ఇచ్చేశారు.

= ఉండవల్లి.. పెనుమాక ప్రాంతాల సంగతి అందుకు పూర్తిగా భిన్నం. రాజధాని ప్రకటనకు ముందే ఈ ప్రాంతాల్లోని భూములు ఎకరం రూ.4 నుంచి రూ.5కోట్ల మధ్యలో పలుకుతున్నాయి. రాజధాని ప్రకటన తర్వాత ఎకరం ధర రూ.1.5కోట్లకు పడిపోయింది.

= రాజధాని రావటం వల్ల భూముల ధరలు పెరగటం కాదు.. తగ్గిపోయాయి.

= తమ ఎకరం భూమి మీద ఏడాదికి రూ.3 నుంచి రూ.6లక్షల ఆదాయం వస్తుందని.. దాని మీద ఆరు కుటుంబాలు బతుకుతుంటాయని.. ఇప్పుడు ఎకరానికి రూ.50వేలు రాజధాని కౌలు ఇస్తామంటే ఎలా? మేం ఎలా బతకాలి? మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి?

= ఎకరం పొలం ఉన్న తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. ఒక్కొక్కరికి స్కూల్ ఫీజులే రూ.50వేలు అవుతున్నాయి. ప్రభుత్వం తమ రెండు ఎకరాల భూమిని తీసుకొని రూ.లక్ష ఇస్తే.. ఆ మొత్తం పిల్లల చదువులకే సరిపోతాయి. మరి మేం ఎలా బతకాలి?

= భూసేకరణ అంటూ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా.. మా ప్రాంతంలోని పిల్లలకు పెళ్లిళ్లు జరగటం లేదు.

= చుట్టూ ఉన్న భూమిని తీసుకొని.. మధ్యలో ఉన్న భూమిని తీసుకోకపోతే.. రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని అంటున్నారని.. కానీ.. తమ భూములు మధ్యన లేవని.. ఒక మూలకు ఉన్నాయన్నారు.

= రాజధాని నుంచి తమ భూముల్ని మినహాయించాలని ఉండవల్లి.. పెనుమాక రైతులు కోరుతున్నారు.